షార్జాలో 94 మంది బిచ్చగాళ్లు అరెస్ట్.. రూ.కోటి స్వాధీనం!

ABN , First Publish Date - 2022-04-21T17:18:34+05:30 IST

అరబ్ దేశాల్లో భిక్షాటన అనేది నేరంగా పరిగణిస్తారు. ముఖ్యంగా రంజాన్ మాసంలో అక్కడ బిచ్చం ఎత్తి పట్టుబడితే అంతే సంగతులు.

షార్జాలో 94 మంది బిచ్చగాళ్లు అరెస్ట్.. రూ.కోటి స్వాధీనం!

షార్జా: అరబ్ దేశాల్లో భిక్షాటన అనేది నేరంగా పరిగణిస్తారు. ముఖ్యంగా రంజాన్ మాసంలో అక్కడ బిచ్చం ఎత్తి పట్టుబడితే అంతే సంగతులు. ఈ నేపథ్యంలోనే రంజాన్ మాసంలో భిక్షాటన చేసేవారి కోసం అక్కడి ప్రత్యేక పోలీస్ బృందాలు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తుంటాయి. ఇలా షార్జాలో ఈసారి రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి(గత 10రోజులు) నుంచి 94 మంది బిచ్చగాళ్లను అరెస్ట్ చేసినట్లు బుధవారం షార్జా పోలీసులు వెల్లడించారు. షార్జా పోలీసుకు చెందిన బెగ్గర్ కంట్రోల్ టీమ్ చీఫ్ లెఫ్టినెంట్ కల్నల్ జాస్సీం మహమ్మద్ బిన్ తలైయ్య మాట్లాడుతూ, గడిచిన 10రోజుల్లో 94 మంది యాచకులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వీరిలో 65 మంది పురుషులు, 29 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. నగరంలో  బిచ్చగాళ్లు కనిపిస్తే టోల్ ఫ్రీ నెంబర్లు 80040, 901కు ఫోన్ చేసి చెప్పాలని కల్నల్ జాస్సీం కోరారు. యాచకుల కోసం చేపట్టిన ఈ డ్రైవ్ నిరంతరంగా కొనసాగుతుందన్నారు. 


2020, 2021 రెండేళ్లలో కలిపి సుమారు 1,409 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి దాదాపు 5లక్షల దిర్హమ్స్(సుమారు రూ.కోటి)కు పైగా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక అరెస్టైన వారిలో చాలామంది విజిట్ వీసాపై షార్జాకు వచ్చినట్లు తెలిపారు. అలా వచ్చిన ప్రవాసులను కొంతమంది స్థానికులు డబ్బు ఆశచూపి భిక్షాటనలో దింపుతున్నట్లు చెప్పారు. దీనికోసం పవిత్ర రంజాన్ మాసాన్ని అడ్డుపెట్టుకుని క్యాష్ చేసుకుంటున్నారని కల్నల్ జాస్సీం మండిపడ్డారు. కాగా, పట్టుబడిన బిచ్చగాళ్లు అంతర్జాతీయ నగదు బదిలీకి సంబంధించిన రసీదులను కలిగి ఉండడం ఆశ్చర్యం కలిగించిదని తెలిపారు. అలాగే అరెస్టైన బిచ్చగాళ్లలో ఒకరి వద్ద ఏకంగా 44వేల దిర్హమ్స్(రూ.9.13లక్షలు) నగదు, మరొకరి వద్ద 12వేల దిర్హమ్స్(రూ.2.49లక్షలు) నగదు దొరికిందని చెప్పుకొచ్చారు. నివాసితులకు నగర వ్యాప్తంగా ఎక్కడైనా బిచ్చగాళ్లు కనిపిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లు 80040, 901కు ఫోన్ చేసి చెప్పాల్సిందిగా కల్నల్ జాస్సీం సూచించారు.   

Updated Date - 2022-04-21T17:18:34+05:30 IST