99 శాతం కేసులు ప్రమాదరహితమైనవే: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

ABN , First Publish Date - 2020-07-06T23:59:55+05:30 IST

అమెరికాలో నమోదైన కరోనా కేసుల్లో 99 శాతం కేసులు ప్రమాదరహితమైనవి అని

99 శాతం కేసులు ప్రమాదరహితమైనవే: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

వాషింగ్టన్: అమెరికాలో నమోదైన కరోనా కేసుల్లో 99 శాతం కేసులు ప్రమాదరహితమైనవి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫోర్త్ ఆఫ్ జులై(స్వాతంత్ర్య దినోత్సవం) వీకెండ్ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఇప్పటివరకు దాదాపు 4 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించామని.. అందులో 99 శాతం మందికి ఎటువంటి ప్రమాదం లేదని ఆయన అన్నారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఎటువంటి ఆధారాలు లేవు. అమెరికాలో ఇప్పటివరకు 29 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. దాదాపు లక్షా 30 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో నిత్యం 50 వేల కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా, టెక్సాస్, అరోజోనా, ఫ్లోరిడా రాష్ట్రాలు కరోనాకు కేంద్రంగా మారాయి. అయినప్పటికి ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సొంత పార్టీ నేతల్లోనే ఆందోళన నెలకొంది. మరోపక్క ఆయన చైనాపై మరోమారు విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌కు సంబంధించి గోప్యత వహించినందుకు చైనా బాధ్యత వహించాలని ట్రంప్ అన్నారు. చైనా వల్ల కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందిందంటూ ట్రంప్ మండిపడ్డారు. ఇక ఈ ఏడాది చివరకు కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశమున్నట్టు ట్రంప్ చెప్పారు. 

Updated Date - 2020-07-06T23:59:55+05:30 IST