తల్లితో ఘర్షణకు దిగిన మహిళను కాల్చిచంపేసిన 10 ఏళ్ల బాలిక.. అరెస్ట్..

Published: Thu, 09 Jun 2022 18:48:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తల్లితో ఘర్షణకు దిగిన మహిళను కాల్చిచంపేసిన 10 ఏళ్ల బాలిక.. అరెస్ట్..

ఒర్లాండ్ : అగ్రరాజ్యం అమెరికా(America)లో విచ్చలవిడిగా పెరిగిపోతున్న గన్‌కల్చర్‌ అక్కడి పసిహృదయాలపైనా తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతోంది. ఇందుకు తార్కాణం లాంటి ఓ ఘటన తాజాగా వెలుగుచూసింది. తన తల్లితో ఘర్షణకు దిగిన మహిళను 10 ఏళ్ల బాలిక తుపాకీతో కాల్చిచంపింది. రెండు రౌండ్ల కాల్పులు జరిపి ‘‘మా అమ్మను కొట్టకుండా ఉండాల్సింది ’’ అంటూ బాలిక బిగ్గరగా అరిచింది. తీవ్రంగా గాయపడ్డ బాధిత మహిళను హుటిహుటిన హాస్పిటల్‌కు తరలించినా ప్రయోజనం దక్కలేదు. ప్రాణాలు నిలువలేదు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఒర్లాండ్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.


మే 30న బాలిక తల్లి, బాధితురాలు లషున్ డెనైస్ రొడ్జెర్స్(41) తమ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ వెలుపల ఘర్షణకు దిగారు. వాదోపవాదాల పెరగడంతో గొడవ పెద్దదైంది. బాలిక తల్లి తొలుత లషున్‌ను చెంపదెబ్బ కొట్టింది. లషున్ కూడా ప్రతిఘటన దాడి చేసింది. ఈ సమయంలో తల్లి పక్కనే ఉన్న బాలిక ఇంట్లోకి పరిగెత్తుకెళ్లి తుపాకీ తీసుకొచ్చింది. బాధితురాలు లషున్‌పై రెండు రౌండ్ల కాల్పులు జరిపింది. ‘మా అమ్మను కొట్టకుండా ఉండాల్సింది’ అంటూ గట్టిగా అరిచింది. బాధితురాలిని ఆమె బాయ్‌ఫ్రెండ్ సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అయినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనపై సోలీసులకు ఫిర్యాదు అందింది. బాలికతోపాటు తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వయసు రీత్యా బాలికను ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ చిల్డ్రెన్ అండ్ ఫ్యామిలీస్‌లో ఉంచారు. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందో తెలుసుకుంటామని ఓర్లాండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు ప్రకటించారు. ఆరెంజ్ అండ్ ఒసెయోలా కౌంటీల స్టేట్ అటార్నీ వోర్రెల్ స్పందిస్తూ.. తన 22 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి ఘటన చూడలేదన్నారు. కేసు నమోదు బాలికపై కేసు నమోదు చేసే ముందు.. బాలిక ప్రవర్తన, ఇందుకు కారణమైన పరిస్థితులను ఆరా తీస్తామని వెల్లడించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, బాలిక తల్లి కూడా తమ అదుపులోనే ఉందని వెల్లడించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.