పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న 60 ఏళ్ల మహిళ.. కొడుకు, కోడలి గురించి ఆమె చెప్పింది విని ఆశ్చర్యపోయిన పోలీసులు..

ABN , First Publish Date - 2022-06-19T17:38:10+05:30 IST

ఆ మహిళ వయసు 60 సంవత్సరాలు.. భర్త చనిపోవడంతో కొడుకు, కోడలి ఇంట్లో నివసిస్తోంది..

పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న 60 ఏళ్ల మహిళ.. కొడుకు, కోడలి గురించి ఆమె చెప్పింది విని ఆశ్చర్యపోయిన పోలీసులు..

ఆ మహిళ వయసు 60 సంవత్సరాలు.. భర్త చనిపోవడంతో కొడుకు, కోడలి ఇంట్లో నివసిస్తోంది.. తన రెక్కల కష్టంతోనే తను బతుకుతోంది.. అయినా కొడుకు, కోడలు ఆమె పట్ల చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు.. కొడుకు కూడా భార్యకే వత్తాసు పలుకుతున్నాడు.. తాజాగా ఇద్దరూ కలిసి ఆ మహిళపై దాడి చేశారు.. ఉదయం లేచిన వెంటనే ఆమె మొహం చూశామనే కారణంతో ఆమెను కొట్టారు.. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించి తన కొడుకు, కోడలిపై ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

మైనర్ బాలికను ట్రాప్ చేసి అత్యాచారం.. చివరకు విషయం ఎంత దూరం వెళ్లిందంటే..


రాజ్‌గఢ్‌కు సమీపంలోని లాసుల్ది గ్రామానికి చెందిన 60 ఏళ్ల గులాబ్ బాయి శనివారం ఉదయం స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ ప్రకాష్‌ పటేల్‌ను కలిసి తన బాధను వినిపించింది. `సార్.. నా కొడుకు మోహన్ తన్వర్, కోడలు ఆశా నన్ను ఇంట్లోంచి గెంటేశారు. నేను పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. శనివారం ఉదయం, నేను గది వెలుపల ముఖం కడుక్కుంటుంగా.. కోడలు ఆశ బయటకు వచ్చింది. నన్ను చూడగానే ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దౌర్భాగ్యురాలు అంటూ చీపురుతో కొట్టడం మొదలుపెట్టింది. `ఉదయం లేచి నీ మొహం చూస్తే రోజంతా వేస్ట్ అయిపోతుంద`ని నన్ను కొట్టింది.


కొడుకు కూడా భార్యకే మద్దతుగా మాట్లాడాడు. ఇద్దరూ కలిసి నన్ను తాడుతో బంధించారు. వారి బారి నుంచి విడుదలైన తర్వాత పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాన`ని ఆమె పోలీసులకు చెప్పింది. అంతేకాదు, తనకున్న కొద్దిపాటి భూమిని కూడా కొడుకు, కోడలు స్వాధీనం చేసుకున్నారని తెలిపింది. మహిళ ఫిర్యాదు మేరకు కోడలు, కుమారుడిపై కేసు నమోదు చేశారు. ఆ మహిళ కొడుకు, కోడలిని స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. 

Updated Date - 2022-06-19T17:38:10+05:30 IST