గర్భవిచ్ఛిత్తికి అడ్డుకట్ట

ABN , First Publish Date - 2022-07-07T06:19:04+05:30 IST

గర్భవిచ్ఛిత్తికి అడ్డుకట్ట

గర్భవిచ్ఛిత్తికి అడ్డుకట్ట
ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌తో సమీక్షిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ శ్రీనివాసరావు (ఫైల్‌)

అబార్షన్ల నియంత్రణకు ‘ఎంటీపీ’

చట్టం పటిష్ఠ అమలుపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి

నిబంధనలు మీరితే కఠిన చర్యలేనని హెచ్చరిక 

ఖమ్మం కలెక్టరేట్‌, జూలై 6: గర్భవిచ్ఛిత్తి సంఘటనకు అడ్డుకట్టవేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఖమ్మం జిల్లా యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఈ మేరకు మెడికల్‌ టెర్మినేషన ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతి పొందిన వైద్యులు.. అదీ అత్యవసరమైన పరిస్థితిలో మాత్రమే ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని గర్భస్రావాలు చేయాలి తప్ప ఇతరులు చేయడానికి వీల్లేదు. ఈ నిబంధనలను వైద్యులంతా పాటించాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కూడా ఆదేశించారు. ఈ నెల 30న ఖమ్మంలోని రిలీఫ్‌ ఆస్పత్రిలో చట్టవ్యతిరేకంగా నిర్వహిస్తున్న గర్భవిచ్ఛిత్తి ఘటనను కమిటీ సభ్యులు తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో దీనికి బాధ్యులైన వారిపై తీసుకున్న చర్యల గురించి ఆరా తీసిన ప్రధాన న్యాయమూర్తి.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ఆదేశించారు. 

ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ప్రైవేటు మహిళా వైద్యులకు కొదవేలేదు. జిల్లాలో 366 పైగా ఆస్పత్రులు ఉండగా.. వీటిలో 56 మంది వరకు ప్రసూతి వైద్య నిపుణులున్నారు. కొన్నాళ్లుగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ భ్రూణహత్యల విషయంలో సరైన నియంత్రణ చేయకపోవడాన్ని ఆసరాగా తీసుకున్న కొందరు వైద్యులు ఎంటీపీ చట్టాన్ని విస్మరించారు. దీంతో లింగనిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలు, భ్రూణహత్యలను ఇష్టానుసారంగా చేస్తున్నారు. వాస్తవానికి ఎంబీబీఎస్‌ వైద్యులు గర్భస్రావాలను చేసేందుకు అనర్హులు. స్త్రీ వైద్యంలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారే దీనికి అర్హులు. అయినా కొన్ని రోజులుగా వైద్యులు అంతా యథేచ్ఛగా గర్భస్రావాలు చేస్తున్నారు. నెలలు నిండని వారితో పాటు అనేక కారణాలతో సంతానం వద్దనుకునే వారికి కూడా గర్భస్రావాలు చేస్తున్నారు.


చట్టం ఏం చెబుతోందంటే..?

ఎంటీపీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. మెడికల్‌ టెర్మినేషన ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (1971) చట్టంప్రకారం అనుమతి పొందిన వారు మాత్రమే గర్భస్రావాలు చేయాలి. దీనికి జిల్లాలోని స్త్రీ వైద్యులు విధిగా సహకరించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తే 50లోపు ఆస్పత్రులకు మాత్రమే గర్భస్రావాలకు అనుమతి ఉంటుంది. మిగిలిన వారు అబార్షన్లు చేయడానికి అనర్హులే. దీంతో పాటు నెలకు ఎన్ని గర్భస్రావాలు చేశారనే సమాచారాన్ని వైద్యశాఖకు అందించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఇలాంటి అనుమతులకోసం కేవలం రెండు ఆస్పత్రులకు మాత్రమే అనుమతి ఉందని, ఇప్పటికి మరో ఐదు దరఖాస్తులు వచ్చాయని ఖమ్మం డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.మాలతి తెలిపారు. అనుమతులు లేకుండా ఆస్పత్రుల్లో గర్భస్రావాలు చేస్తే ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ఆమె హెచ్చరించారు. 

Updated Date - 2022-07-07T06:19:04+05:30 IST