గుట్టుగా గంజాయి దందా

ABN , First Publish Date - 2022-07-03T05:42:35+05:30 IST

గుడుంబా తయారీని అరికట్టామని.. గంజాయి వాసన లేకుండా చేశామని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. కానీ జిల్లాలో గంజాయి ఘాటు మాత్రం తగ్గడం లేదు. ఒకప్పుడు మారుమూల గ్రామాలు తండాల్లో నేరుగా గంజాయిని సాగు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ దందాను జోరుగా సాగించేవారు.

గుట్టుగా గంజాయి దందా
గతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి(ఫైల్‌)

- జాతీయ రహదారి వెంట జోరుగా గంజాయి స్మగ్లింగ్‌

- గుట్టుచప్పుడు కాకుండా భిక్కనూరు నుంచి కామారెడ్డి, నిజామాబాద్‌లకు 

- హైదరాబాద్‌ నుంచి నిజాంసాగర్‌, పిట్లం మీదుగా మహారాష్ట్రకు

- ఇటీవల కాలంలో పోలీసుల తనిఖీల్లో వెలుగు చూస్తున్న గంజాయి సరఫరా

- రెండు రోజుల కిందట జాతీయ రహదారి టెక్రియాల్‌ వద్ద స్వాధీనం చేసుకున్న గంజాయి

- నెల రోజుల కిందట ఆంధ్ర నుంచి గంజాయిని తీసుకువస్తుండగా హైదరాబాద్‌ పోలీసులకు చిక్కిన గాంధారి వాసి 

- సరిహద్దు ప్రాంతాల్లో గుట్టుగా గంజాయి దందా

- దాబాలే అడ్డాగా గంజాయి వినియోగం

- యువకులకు డబ్బు ఆశ చూపి సరఫరా చేయించడంతో పాటు మత్తుకు బానిసలను చేస్తున్న వైనం


కామారెడ్డి, జూలై 2(ఆంధ్రజ్యోతి): గుడుంబా తయారీని అరికట్టామని.. గంజాయి వాసన లేకుండా చేశామని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. కానీ జిల్లాలో గంజాయి ఘాటు మాత్రం తగ్గడం లేదు.  ఒకప్పుడు మారుమూల గ్రామాలు తండాల్లో నేరుగా గంజాయిని సాగు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ దందాను జోరుగా సాగించేవారు. ప్రస్తుతం గంజాయి స్మగ్లర్లు, కొత్తదారులు ఎంచుకుని ఇతర ప్రాంతాల నుంచి ఎండు గంజాయిని తెప్పించి జిల్లా జాతీయ రహదారుల మీదుగా మహారాష్ట్ర, కర్ణాటక, నిజామాబాద్‌ లాంటి ప్రాంతాలకు గుట్టుగా సరఫరా చేస్తున్నారు. ఇటీవల కాలంలో 44వ జాతీయ రహదారి వెంట స్మగ్లర్లు గంజాయిని సరఫరా చేస్తుండగా పెద్ద మొత్తంలోనే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర నుంచి గుట్టుగా కామారెడ్డి జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నిజాంసాగర్‌ నుంచి మద్నూర్‌ వరకు కొత్తగా ఏర్పాటైన జాతీయ రహదారి వెంట మహారాష్టకు జోరుగా గంజాయిని సరఫరా చేస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

జోరుగా గంజాయి సరఫరా

జిల్లాలో సాగవుతున్న గంజాయినే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలోనే గంజాయిని జిల్లాకు తరలిస్తున్నారు. గంజాయి మత్తుకు అలవాటు పడిన యువతకు స్మగ్లర్లు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ మీదుగా కొంత మంది యువకులతో గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి, భిక్కనూరులలోని పరిశ్రమలలో, ఇతర కంపెనీలలో పనిచేసే ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు తెచ్చిన గంజాయిని స్థానిక స్మగ్లర్లు యువకులకు డబ్బు ఆశచూపి సరఫరా చేయిస్తున్నారని తెలిసింది. సరఫరా చేయడానికి ముందుకు రాని వారికి ముందుగా మత్తుకు బానిసను చేసి వారితో నాయానో.. బాయానో సరఫరా చేయిస్తున్నట్లు సమాచారం. మండలాల్లోని పలు గ్రామాలతో పాటు జాతీయ రహదారి వెంట ఉన్న పలు దాబాల పరిసరాల నుంచి గంజాయిని జిల్లా కేంద్రానికి సరఫరా చేయిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్‌, రాజీవ్‌నగర్‌, గొల్లవాడ ప్రాంతాల్లోని పలు కల్లు కంపౌండ్‌ల, పలు ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల వద్దకు గంజాయిని తీసుకువచ్చి యువకులకు అందిస్తున్నారని తెలుస్తోంది. గంజాయితో పాటు కల్లు తాగిన యువకులు మత్తులో ఇతరులపై దాడులు చేసిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ..

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులుగా కామారెడ్డి జిల్లా ప్రాంతాలు ఉన్నాయి. ప్రధానంగా మద్నూర్‌, జుక్కల్‌, బిచ్కుంద, బీర్కూర్‌, పిట్లం లాంటి మండలాల్లోనూ కొన్ని మారుమూల గ్రామాలు అంతరాష్ట్ర ప్రాంతాలుగా ఉండడంతో ఈ ప్రాంతాల్లో గంజాయి సరఫరా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు కొత్తగా జాతీయ రహదారి జిల్లా మీదుగా పూర్తయింది. మద్నూర్‌ నుంచి మొదలుకుని నిజాంసాగర్‌ వరకు కొత్త జాతీయ రహదారి వెంట జోరుగా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. నిజాంసాగర్‌, పిట్లం, పెద్ద కొడప్‌గల్‌, బిచ్కుంద, మద్నూర్‌ మండలాల పరిధిలోని జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న దాబాల్లో పేకాటతో పాటు గంజాయిని విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రకు వెళ్లే  ట్రాన్స్‌ఫోర్ట్‌ వాహనాల ద్వారా గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లోని దాబాలకు వెళ్లే చాలు గంజాయి ఘాట్‌ గుంపమంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.

పోలీసులు, ఎక్సైజ్‌ అధికారుల కళ్లు కప్పి సరఫరా

ఒకప్పుడు జిల్లాలో నేరుగా గంజాయిని సాగుచేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేవారు. గంజాయి సాగుపై పోలీసులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు నిఘా పెట్టి నియంత్రించగలిగారు. అయినప్పటికీ కొన్ని మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో సాగు చేసే పలు పంటల్లో ఇప్పటికీ అక్కడక్కడ అంతర పంటగా గంజాయి మొక్కలను సాగు చేస్తుండగా పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేస్తున్నారు. అయినప్పటికీ ఏదో ఒకచోట గంజాయి మొక్కలు వెలుగుచూస్తునే ఉన్నాయి. పోలీసులు, ఎక్సైజ్‌ అధికారుల కళ్లు కప్పి స్మగ్లర్లు గంజాయిని సరఫరా చేయడమే కాకుండా గుట్టుగా గంజాయి మొక్కలను సాగు చేస్తున్నారు. గంజాయి నిర్మూలనకు పోలీసు, ఎక్సైజ్‌శాఖలు ప్రత్యేక నిఽఘా పెట్టినప్పటికీ స్మగ్లర్లు గుట్టుగా సరఫరా చేస్తూనే ఉన్నారు. గత నెలరోజుల కిందట ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నుంచి రూ.6లక్షల విలువ చేసే గంజాయిని గాంధారి వాసి హైదరాబాద్‌ మీదుగా కామారెడ్డికి తరలిస్తుండగా హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. రెండ్రోజుల కిందట కామారెడ్డి పట్టణ శివారులోని జాతీయ రహదారి మీదుగా డిచ్‌పల్లి నుంచి హైదరాబాద్‌కు రూ.1.80లక్షల విలువచేసే గంజాయిని తరలిస్తుండగా దేవునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇలా జిల్లాలో స్మగ్లర్లు పోలీసుల కళ్లు కప్పి గుట్టుగా గంజాయిని సరఫరా చేస్తున్నారు.

Updated Date - 2022-07-03T05:42:35+05:30 IST