చైన్‌ స్నాచింగ్‌ కేసును ఛేదిస్తే..స్వామీజీ హంతకులు దొరికారు!

ABN , First Publish Date - 2022-09-28T17:53:59+05:30 IST

చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర ఘరానా దొంగల ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసును ఛేదించే

చైన్‌ స్నాచింగ్‌ కేసును ఛేదిస్తే..స్వామీజీ హంతకులు దొరికారు!

 ఏడు కేసుల చిక్కుముడి వీడింది..

హైదరాబాద్‌ సిటీ: చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర ఘరానా దొంగల ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసును ఛేదించే క్రమంలో కరీంనగర్‌ జిల్లాలో జరిగిన చెల్పూరి పెద్ద స్వామి హత్యతో పాటు మొత్తం ఏడు కేసుల చిక్కుముడి వీడింది. మంగళవారం బషీర్‌బాగ్‌లోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో నగర అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. 

ఈ నెల నాలుగున ఎస్సార్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం వేట ప్రారంభించారు. ఈ నెల 26న సోమవారం అమీర్‌పేట్‌లోని మైత్రీవనం వద్ద వారున్నారని గుర్తించారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు గ్రామానికి చెందిన కోనేటి జ్ఞానేశ్వర్‌ (26), ములుగు జిల్లా వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన నీలం శ్రీనివాస్‌ (33)లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10.4 తులాల బంగారు ఆభరణాలు, ఓ  బైకు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తస్కరించిన సొత్తును విజయవాడకు చెందిన గంటా నాగబాబు (18)కు విక్రయించే వారని చెప్పారు. నాగబాబు ఓ కేసులో పోలీసులకు చిక్కి ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నట్లు నిందితులు పోలీసులకు వివరించారు. తాజా అరెస్టుతో ఓ హత్యతో పాటు మొత్తం ఏడు కేసుల దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది.  


జైలులో స్నేహితులుగా..

జ్ఞానేశ్వర్‌ పోక్సో యాక్ట్‌లో అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలై 2021లో ఖమ్మం జిల్లా, పాల్వంచ పీఎస్‌ పరిధిలో గంజాయి కేసులో మరోసారి అరెస్ట్‌ అయ్యాడు. నీలం శ్రీనివా్‌సను ఓ హత్య కేసులో వరంగల్‌, మిల్స్‌ కాలనీ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరూ ఈ ఏడాది ఖమ్మం జైలులో కలుసుకుని స్నేహితులుగా మారారు.


షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి పెడదామని..

ఏప్రిల్‌లో జైలు నుంచి విడుదలైన తర్వాత జ్ఞానేశ్వర్‌ గ్రామానికి చేరుకున్న శ్రీనివాస్‌ చోరీలు, స్నాచింగ్‌ల ద్వారా భారీగా డబ్బు కూడబెట్టి షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెడదామని నిర్ణయించుకున్నారు. ఓ స్వామీజిని మట్టుబెట్టి అతడి డబ్బును కాజేద్దామని నిర్ణయించుకున్నారు. ప్లాన్‌ ప్రకారం ఇద్దరూ కలిసి కరీంనగర్‌, తిమ్మాపూర్‌, జోగయ్యపల్లి హనుమాన్‌ మందిరం వద్ద ఉన్న బాబా చేల్పూరి పెద్ద స్వామి వద్దకు చేరుకున్నారు. రెండు సార్లు ఆశ్రమానికి వెళ్లి బాబా ఆశీస్సులు తీసుకున్నారు. సేవ చేయాలని ఉందంటూ ఆశ్రమంలో చేరారు. మూడు రోజుల పాటు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ ఏడాది మే నెల నాలుగున అర్ధరాత్రి స్వామీజీ గదిలోనికి ప్రవేశించిన నిందితులు టవల్‌తో గొంతు నులిమి హతమార్చారు. ఆయన అల్మరాలోని కొన్ని బంగారు ఆభరణాలు, రూ. 32వేల నగదు తీసుకుని పారిపోయారు. ఆభరణాలను విజయవాడలోని నాగబాబుకు విక్రయించారు.


డబ్బులు సరిపోక..

ఆ డబ్బు చాలక మళ్లీ నేరాల బాట పట్టారు. సూర్యాపేటలో ద్విచక్రవాహనాన్ని తస్కరించారు. ఆ బైకుపై విజయవాడ పెనమలూరు పీఎస్‌ పరిధిలో నాలుగు స్నాచింగ్‌లు చేశారు. ఆ తర్వాత నగరానికి చేరుకుని ఈ నెల నాలుగున ఎస్సార్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో మరో స్నాచింగ్‌ చేశారు. ఈ కేసు దర్యాప్తుతో స్వామీజీ హత్య కేసు, బైక్‌ చోరీ కేసు, మరో నాలుగు స్నాచింగ్‌ కేసుల చిక్కుముడి వీడింది. 

Updated Date - 2022-09-28T17:53:59+05:30 IST