చిన్నారి కిడ్నాప్‌ సుఖాంతం

ABN , First Publish Date - 2022-07-07T05:44:19+05:30 IST

చిన్నారి కిడ్నాప్‌ సుఖాంతం

చిన్నారి కిడ్నాప్‌ సుఖాంతం
కిడ్నాప్‌కు గురైన చిన్నారి వసంతను తల్లికి అప్పగిస్తున్న షాద్‌నగర్‌ ఏసీపీ కుషాల్కర్‌, కొత్తూర్‌ సీఐ బాల్‌రాజ్‌

  • నిందితుల అరెస్ట్‌ 
  • చిన్నారిని తల్లికి అప్పగించిన పోలీసులు


కొత్తూర్‌, జూలై 6: డబ్బుల కోసం చిన్నారిని కిడ్నాప్‌ చేసి విక్రయించేందుకు సిద్ధపడిన ఇద్దరు నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని చిన్నారిని తల్లికి అప్పగించారు. షాద్‌నగర్‌ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ కుషాల్కర్‌ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  వివరాలను వెల్లడించారు. ఇన్ముల్‌నర్వకు చెందిన పార్థం లావణ్య(కూలీ) ఈనెల 1న జేపీ దర్గా వద్దకు తన కుతూరు బేబీ వసంత(13నెలలు) వెంట తీసుకుని వెళ్లింది. దర్గా ప్రధానద్వారం సమీపంలో వసంతను ఉంచి, తాగునీటి కోసం హోటల్‌ దగ్గరకు వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి చిన్నారి కనిపించకపోవడంతో తల్లి లావణ్య లబోదిబోమంది. దర్గా పరిసరాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో లావణ్య కొత్తూర్‌ పోలీసులను ఆశ్రయించింది. సీఐ బాల్‌రాజ్‌ కేసు దర్యాప్తు ప్రారంభించి బేబీ వసంత ఆచూకీ కోసం ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. కాగా, నిందితులు అబ్దుల్‌ రషీద్‌, అప్సర్‌ భేగంలుగా గుర్తించారు. హైదరాబాద్‌ చంద్రాయన్‌గుట్ట ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ అబ్దుల్‌ రషీద్‌కు వరుసకు చిన్నమ్మ అయిన అప్సర్‌భేగం మంత్రాలు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె వద్దకు హైదరాబాద్‌లోని కొత్తపేటకు చెందిన ఓ కుటుంబం వచ్చింది. తమకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, కుమారుడు కావాలని, ఎవరైనా దత్తత ఇస్తే పెంచుకుంటామని అప్సర్‌భేగం వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. ఇందుకు రూ.10వేలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. అప్సరబేగం, అబ్దుల్‌ రషీద్‌లు చిన్నారుల కోసం పలు ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో ఈనెల 1న జేపీ దర్గా వైపు వచ్చారు. దర్గా ముఖద్వారం వద్ద పిల్లాడి దుస్తుల్లో ఉన్న చిన్నారి వసంతను గమనించారు. వెంటనే  కిడ్నాప్‌ చేసి ఆటోలో హైదరాబాద్‌లోని అప్సర్‌ భేగం ఇంటికి తీసుకొచ్చారు. అక్కడకు వెళ్లిన తర్వాత పిల్లాడి దుస్తుల్లో ఉన్న చిన్నారిని ఆడపిల్లగా గుర్తించి ఎవరికైనా విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఎస్‌ఐ శంకర్‌, ఏఎ్‌సఐ అబ్దుల్లా, కానిస్టేబుల్‌ నరేందర్‌ ప్రత్యేక టీంగా ఏర్పడి దర్యాప్తులో భాగంగా నిందితుల వివరాలు సేకరించారు. బుధవారం ఉదయం అప్సర్‌బేగం ఇంటికి చేరుకుని అప్సర్‌బేగంతో పాటు అబ్దుల్‌రషీద్‌ను అదుపులోకి తీసుకుని చిన్నారి వసంతను స్వాధీనపర్చుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చిన్నారిని తల్లి  లావణ్య చెంతకు చేర్చారు. ఈ సందర్భంగా లావణ్య పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కేసును ఛేదించిన ఎస్‌ఐ శంకర్‌, ఏఎ్‌సఐ అబ్దుల్లా, కానిస్టేబుల్‌ నరేందర్‌లను ఏసీపీ కుషాల్కర్‌ ప్రత్యేకంగా అభినందించారు.  సమావేశంలో కొత్తూర్‌ ఇన్‌స్పెక్టర్‌ బాల్‌రాజ్‌ ఉన్నారు. 

Updated Date - 2022-07-07T05:44:19+05:30 IST