Hong Kong Leadership: హాంగ్ కాంగ్ నేతగా వివాదాస్పద భద్రతాధికారి ఎన్నిక

ABN , First Publish Date - 2022-05-08T21:27:43+05:30 IST

ప్రజాస్వామ్యం కోసం జరిగిన ఉద్యమాన్ని కఠినంగా అణచివేసిన మాజీ భద్రతాధికారి

Hong Kong Leadership: హాంగ్ కాంగ్ నేతగా వివాదాస్పద భద్రతాధికారి ఎన్నిక

హాంగ్ కాంగ్ : ప్రజాస్వామ్యం కోసం జరిగిన ఉద్యమాన్ని కఠినంగా అణచివేసిన మాజీ భద్రతాధికారి జాన్ లీ (64) హాంగ్ కాంగ్ నేతగా ఆదివారం ఎన్నికయ్యారు. ఈ నగర జనాభాలో కేవలం 0.02 శాతం మంది అంటే 1,461 మందితో కూడిన ఎన్నికల కమిటీ ఆయనను ఈ పదవికి ఎన్నుకుంది. ఆయన చైనాకు వీరవిధేయుడు కావడంతో ఆయన ఎన్నిక నామమాత్రమేనని అందరూ ముందుగానే ఊహించారు. 


ఈ ఎన్నికల్లో జాన్ లీ మాత్రమే పోటీ చేశారు. ఆయనకు చైనా మద్దతు బలంగా ఉంది. గత నెలలో ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా 786 నామినేషన్లు ఈ ఎన్నికల కమిటీ నుంచి వచ్చాయి. హాంగ్ కాంగ్ ఎన్నికల చట్టాలకు గత ఏడాది భారీ సంస్కరణలు జరిగాయి. చైనాకు విధేయంగా ఉండే దేశభక్తులు మాత్రమే ఈ నగరాన్ని పరిపాలించేందుకు అర్హులని కొత్త నిబంధనలు చెప్తున్నాయి. శాసన సభలో ప్రతిపక్ష గళాలకు చోటు లేకుండా నిబంధనలను రూపొందించారు. 


చైనా హర్షం

రహస్య బ్యాలెట్‌ ద్వారా ఆదివారం జరిగిన ఎన్నికలో జాన్ లీకి అనుకూలంగా 1,416 మంది ఓటు వేశారు. వ్యతిరేకంగా కేవలం ఎనిమిది మంది నిలిచారు. ఆయన దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికవడంపై చైనా సంతోషం వ్యక్తం చేసింది. లీకి అత్యధిక ఆమోదం ఉన్నట్లు ఈ ఎన్నికలు రుజువు చేసినట్లు పేర్కొంది. ‘‘ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం’’ అని హాంగ్ కాంగ్ అండ్ మకావో అఫైర్స్ ఆఫీస్ ఓ ప్రకటనలో తెలిపింది.


జూలై 1న బాధ్యతలు స్వీకారం

ప్రస్తుత హాంగ్ కాంగ్ నేత కారీ లామ్ వారసునిగా జాన్ లీ జూలై 1న బాధ్యతలు స్వీకరిస్తారు. జాన్ లీపై అమెరికా ఆంక్షలు అమలవుతున్నాయి. రాజకీయ అనిశ్చితి, కోవిడ్-19 మహమ్మారి కష్టాల నేపథ్యంలో ఆయన ఈ పదవిని చేపట్టబోతున్నారు. 


ప్రజాస్వామ్యం కోసం ఉద్యమం తర్వాత...

మూడేళ్ళ క్రితం ప్రజాస్వామ్యం కోసం పెద్ద ఎత్తున నిరసన  కార్యక్రమాలు జరిగాయి. అనంతరం చైనా తన సొంత అథారిటేరియన్ ఇమేజ్‌తో Hong Kongను పునర్వ్యవస్థీకరిస్తోంది. అసమ్మతిని అణచివేసేందుకు జాతీయ భద్రతా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తోంది. తనకు విధేయంగా ఉండేవారిని రాజకీయంగా తనిఖీ చేయడానికి ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. 


బ్రిటన్ నుంచి చైనాకు...

హాంగ్ కాంగ్‌ను 1997 జూలై ఒకటిన Chinaకు Britain అప్పగించింది. ‘ఒక దేశం, రెండు వ్యవస్థలు’ ఫార్ములా ప్రకారం హాంగ్ కాంగ్‌కు 50 ఏళ్ళ తర్వాత కొంత స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని చైనా అంగీకరించింది. 


ప్రజాస్వామ్యం కావాలంటూ...

ప్రజలకు అధికారం లభించాలని ది లీగ్ ఆఫ్ సోషల్ డెమొక్రాట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నగరంలో మిగిలిన ఏకైక ప్రజాస్వామ్య అనుకూల వర్గం ఇదొక్కటే. ఆదివారం ఎన్నికలు ప్రారంభమవడానికి ముందు ఈ వర్గానికి చెందిన ముగ్గురు నిరసన తెలిపారు. ప్రజలకు అధికారం లభించాలని, అందరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. 


Read more