యాదగిరీశుడి సన్నిధిలో భక్తుల కోలాహలం

ABN , First Publish Date - 2022-08-15T06:05:00+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తుల హరిహర నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకొంది.

యాదగిరీశుడి సన్నిధిలో భక్తుల కోలాహలం
ప్రత్యేక అలంకారంలో ఉత్సవమూర్తులు

స్వామి దర్శనాలకు మూడు గంటల సమయం 

శాస్త్రోక్తంగా నిత్యారాధనలు.. కోటి కుంకుమార్చనలు

 వర్షంతో ఇబ్బందులు పడిన భక్తులు

యాదగిరిగుట్ట, ఆగస్టు14: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తుల హరిహర నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకొంది. శ్రావణమాసంతోపాటు వరుస సెలవులు రావడంతో అల్పపీడన ప్రభావంతో వర్షం కురుస్తున్నా పలు ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి గర్భాలయంలోని స్వయంభువుల దర్శనాలు.. సేవా మండపాల్లో ఆర్జితసేవల్లో పాల్గొన్నారు. దేవదేవుడి దర్శనాలకోసం విచ్చేసిన భక్తులతో కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, బస్టాండ్‌లు, కొండపైన ఆలయ తిరువీధులు, దర్శన క్యూలైన్లు, ప్రధానాలయం, ప్రసాదాల విక్రయశాల తదితర ప్రాంతాలు కోలాహలంగా కనిపించాయి. స్వామివారి ధర్మదర్శనాలకు మూడుగంటల సమయం, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో వాహనాల్లో తరలిరావడంతో పట్టణంలో పలుమార్లు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. పాతగుట్ట ఆలయంలో స్వయంభువులను దర్శించుకున్న భక్తులు ఆలయ ఆవరణలో పిల్లాపాపలతో సేదతీరారు. కొండగుహలో కొలువుదీరిన స్వయంభు పాంచనారసింహుడికి నిత్యపూజా కైంకర్యాలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి.అష్టభుజి ప్రాకార మండపంలో కోటికుంకుమార్చన పర్వాలు నిర్వహించారు. యాదగిరిగుట్టలో వర్షం కురుస్తున్నా భక్తులు దేవదేవుడి దర్శనాలకోసం క్యూలైన్లలో తరలివెళ్లారు. కొండపైన తలదాచుకునే ప్రదేశాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.  


యాదగిరీశుడి సేవలో ప్రముఖులు

యాదగిరివాసుడిని ఆదివారం సౌత్‌ సెంట్రల్‌ ఎలక్ట్రికల్‌ జనరల్‌ మేనేజర్‌ సోమేశ్‌కుమార్‌, నిజామాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ చిత్ర దర్శించుకుని ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.43,65,662 ఆదాయం సమకురినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.   

Updated Date - 2022-08-15T06:05:00+05:30 IST