ప్రత్నామ్నాయానికి పక్కా ప్రణాళిక!

ABN , First Publish Date - 2021-10-26T05:31:55+05:30 IST

జిల్లాలో వచ్చే యాసంగి సీజన్‌కు గాను పెద్దమొత్తంలో వరి పంట సాగును తగ్గించాలని వ్యవసాయాధికారులు పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం యాసంగిలో వరి సాగు చేయవద్దంటూ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా జిల్లాస్థాయిలో ప్రణాళిక లు రూపొందించారు. మొత్తం యాసంగి సీజన్‌లో 96,207 ఎకరాల వరి సాగు ను చేయాల్సి ఉండగా..

ప్రత్నామ్నాయానికి పక్కా ప్రణాళిక!
ఖానాపూర్‌ మండలం తర్లపాడ్‌ గ్రామంలో విస్తారంగా సాగవుతున్న వరి పంట

జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల కోసం అధికారుల యాక్షన్‌ ప్లాన్‌

రాబోయే సీజన్‌లో వరికి బదులుగా ఇతర పంటల సాగు

మొత్తం 19,787 ఎకరాల్లో వరి పంట సాగు తగ్గింపు 

దశల వారీగా వరి లక్ష్యం కుదింపు  

సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరగడమే ప్రధాన కారణం

పప్పు దినుసులు, కూరగాయల పంటలకు ప్రాధాన్యత  

వ్యవసాయ శాఖ అధికారులకు రాష్ట్ర సర్కారు ఆదేశాలు

మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుగుడు, పెసరతో పాటు ఇతర పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు

నిర్మల్‌, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వచ్చే యాసంగి సీజన్‌కు గాను పెద్దమొత్తంలో వరి పంట సాగును తగ్గించాలని వ్యవసాయాధికారులు పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం యాసంగిలో వరి సాగు చేయవద్దంటూ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా జిల్లాస్థాయిలో ప్రణాళిక లు రూపొందించారు. మొత్తం యాసంగి సీజన్‌లో 96,207 ఎకరాల వరి సాగు ను చేయాల్సి ఉండగా.. దీనిని 76,420.21 ఎకరాలకు తగ్గించాలని నిర్ణయించా రు. మొత్తం 19,787 ఎకరాల్లో వరికి బదులుగా పప్పు దినుసులు, ఇతర పంట లను సాగు చేయాలని యాక్షన్‌ప్లాన్‌ తయారు చేశారు. ఇందులో నుంచి మొక్కజొన్నతో పాటు శనగ, పొద్దుతిరుగుడు, పెసర, గోధుమ, నువ్వులు, కుసుమ, ఆవాలు, బాజ్ర లాంటి పంటలను రాబోయే యాసంగిలో సాగు చేయాలంటూ వ్యవసాయాధికారులు నిర్ణయించారు. దీని కోసం రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. రైతు సమన్వయ సమితిలతో పాటు గ్రామంలోని ఆదర్శ రైతులు, ప్రజాప్రతినిధుల సహకారంతో వరి పంట సాగును తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టబోతున్నారు. ప్రతియేటా వానాకాలం, యాసం గి సీజన్‌లలో జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున వరి పంటను సాగు చేస్తుండడమే కాకుండా.. దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా ధాన్యం కొనుగోలు వ్యవహారం, నిల్వ చేయడం యంత్రాంగానికి కత్తిమీద సాములా మారుతోంది. ధాన్యం నిల్వలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోవడంతో రాబోయే యాసంగిలో ఆ పంటల సాగును భారీగా తగ్గించాలని ప్రభుత్వం తలపెట్టింది. వరికి బదులుగా యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతు లు దృష్టి సారించే విధంగా చూడాలన్న ఆదేశాలతో యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ప్రత్యామ్నాయ ప్రణాళికను సైతం అధికారులు తయారు చేశారు. యాసంగిలో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలకు ఇతర ప్రయోజనాలు కూడా కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే 9130 ఎకరాల్లో మొక్కజొన్న, 2424 ఎకరాల్లో శనగలు, 1369 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 949 ఎకరాల్లో ఆవాలు, 663 ఎకరాల్లో వేరుశనగ, 1150 ఎకరాల్లో నువ్వులు, 250 ఎకరాల్లో గోధుమ, 3627 ఎకరాల్లో ఎర్రజొన్న, 100 ఎకరాల్లో కుసుమ పంటలను వరి పంటకు బదులుగా సాగు చేయాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా అను కూలమైన నేలలు గల గ్రామాలను సైతం గుర్తించి, అక్కడి రైతులకు ప్రత్యామ్నాయ పంటలతో చేకూరే ప్రయోజనాలను వివరించనున్నారు. ఇలా దశల వారీగా వరి సాగును తగ్గించేందుకు అధికారులు తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళికలు రూపొందించగా.. ఆ తరువాత ప్రతియేటా వానాకాలం, యాసంగిలలో ప్రత్యామ్నాయ పంటల సాగునే టార్గెట్‌గా పెట్టుకోబోతున్నారు. వరి సాగు వైపు నుంచి రైతులను పూర్తిగా మళ్లించడమే ధ్యేయంగా పెట్టుకుంటున్నారు. 

వ్యవసాయ అధికారులకు సవాల్‌

ప్రభుత్వం యాసంగిలో వరి పంట సాగును గణనీయంగా తగ్గించి, ఇతర పంటలను సాగు చేయించాలంటూ ఆదేశించిన నేపథ్యంలో సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు ఈ ఆదేశాలను సవాలుగా తీసుకుంటున్నారు. దీని కోసం అధికారులంతా ముందస్తుగా అప్రమత్తమై, వచ్చే యాసంగికి సంబంధించి ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికను రూపొందించారు. జిల్లాలో ప్రతియేటా దాదాపు 96,700 ఎకరాల్లో వరి పంట సాగవుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ పంటకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. దీని కోసం గానూ 19,787 ఎకరాల్లో వరికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని నిర్దారించా రు. యాసంగిలో కేవలం 76,420 ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగయ్యేట్లు చూడబోతున్నారు. అయితే కాగితాలపై పకడ్బందీ ప్రణాళికలు రూపొందించినప్పటికీ క్షేత్రస్థాయిలో వరి వైపు నుంచి రైతుల దృష్టి మళ్లించడం అధికారులకు కత్తిమీద సాములా మారనుందంటున్నారు. జిల్లాలో పుష్కలమైన నీటి వనరులు అందుబాటులో ఉండడమే కాకుం డా, ఇక్కడి భూములు కూడా వరి పంటకు అనుకూలంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించకుండా వానాకాలం, యాసంగి సీజన్‌లలో పోటాపోటీగా వరి పంటనే సాగు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ప్రతియేటా వరి సాగు విస్తీర్ణం పెరిగిపోతుండడం, దిగుబడులు పెద్ద ఎత్తున వస్తుండడమే కాకుండా ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తుండడం రైతులకు ఈ పంటనే ప్రధానంగా మా రేందుకు కారణమవుతోంది. అయితే సర్కారు హెచ్చరికలతో ప్రత్యామ్నాయ పంటల సాగును పెంచేందుకు గ్రామస్థాయిలో పెద్దఎత్తున రైతులకు అవగాహ న కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. సాంప్రదాయ పంటల సాగుకు అలవాటు పడ్డ రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడంలో అధికారులు ఏ మేరకు సఫలీకృతులవుతారో వేచి చూడాల్సిందే మరీ..!!

విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం రైతులకు అవగాహన పెంపొందించడం తప్పనిసరి కానుందంటున్నారు. అయితే రైతు వేదికలను ఈ అవగాహన కార్యక్రమాల కోసం వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. రైతు సమన్వయ సమితిలు, ఆదర్శ రైతులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులందర్నీ అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాము ల ను చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటి వరకు ప్రతీ వానాకాలం, యాసంగి  సీజన్‌లలో వరి సాగుకు అలవాటు పడ్డ రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడంలో అందరి భాగస్వామ్యం తప్పనిసరి కాబోతున్న కారణంగా వ్యవసాయ శాఖ ఇక పకడ్బందీ స్పెషల్‌ డ్రైవ్‌ను చేపట్టబోతోంది. వరి పంట సాగుతో ఇప్పటి మాదిరిగా ఎలాంటి లాభాలు ఉండబోవన్న సంకేతాలను పంపనున్నారు. పంట మార్పిడి విధానంతో చేకూరే ప్రయోజనాలను, అలాగే మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటల సాగును చేపడితే రైతులకు వరి సాగు కన్నా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ప్రచారం చేయనున్నారు. సర్కారు హెచ్చరికలను బేఖాతరు చేసి వరి పంటను సాగు చేస్తే భవిష్యత్‌లో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు దక్కవని, గిట్టుబాటు ధరతో పాటు కొనుగోలు కేంద్రాలను   ఏర్పాటు చేయమని అధికారులు ప్రచారం చేయనున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగును టార్గెట్‌గా చేయాలని భావిస్తున్నారు.  

Updated Date - 2021-10-26T05:31:55+05:30 IST