నలుగురి ప్రాణాలు కాపాడేందుకు ఆలస్యంగా బయలుదేరిన విమానం!

ABN , First Publish Date - 2020-11-30T03:01:36+05:30 IST

ఎయిర్ ఇండియా విమానాల సమయపాలన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అయితే, ఎయిర్ ఇండియా ప్రాంతీయ

నలుగురి ప్రాణాలు కాపాడేందుకు ఆలస్యంగా బయలుదేరిన విమానం!

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానాల సమయపాలన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అయితే, ఎయిర్ ఇండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ అలయెన్స్ ఎయిర్ విమానం నలుగురిని బతికించేందుకు జైపూర్ నుంచి ఢిల్లీకి ఆలస్యంగా బయలుదేరింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జైపూర్‌కు చెందిన 49 ఏళ్ల మహిళ తన అవయవాలను దానం చేసి చనిపోయింది. అదే సమయంలో ఢిల్లీలో నలుగురు వ్యక్తుల అవయవదాతల కోసం ఎదురుచూస్తూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆ మహిళ నుంచి సేకరించిన కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు సకాలంలో వారికి అమర్చితే వారు బతికే అవకాశం ఉంది. 


ఈ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి కార్యాలయం, స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎస్ఓటీటీఓ), ఎయిర్‌లైన్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), జైపూర్ విమానాశ్రయం రంగంలోకి దిగాయి. ఒకదాన్నొకటి సమన్వయం చేసుకుంటూ జైపూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరే అలయెన్స్ ఎయిర్‌కు చెందిన తొలి విమానంలో అవయవాలను పంపించాలని నిర్ణయించాయి. నిజానికి ఆ విమానం ఉదయం 8.15 గంటలకు బయలుదేరాల్సి ఉంది.


విమానం బోర్డింగ్ కూడా పూర్తయింది. ప్రయాణికులు టేకాఫ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అవయవాలు విమానాశ్రయానికి చేరే వరకు విమానాన్ని ఎగరనివ్వకుండా ఆలస్యం చేయాలని ఎయిర్ ఇండియా, అలయెన్స్ ఎయిర్ మేనేజ్‌మెంట్‌లు నిర్ణయించాయి. ఫలితంగా సమయం మించిపోతున్నా విమానం ఎగరకపోవడంతో తొలుత అసహనం వ్యక్తం చేసిన ప్రయాణికులు, ఆ తర్వాత అసలు విషయం తెలిసి అవయవాలు విమానాశ్రయానికి చేరే వరకు  ఓపిగ్గా ఎదురుచూశారు. 


జైపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అవయవదాత నుంచి అతి క్లిష్టమైన ఆపరేషన్ ద్వారా రెండు ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వేరు చేసిన వైద్యులు విమానాశ్రయానికి చేరుకునే సరికి 9.28 గంటలు అయింది. ఆ వెంటనే విమానం ఢిల్లీకి బయలుదేరింది. నలుగురి ప్రాణాలు నిలబెట్టడంలో తమ పాత్ర ఉన్నందుకు అలయెన్స్ ఎయిర్ సీఈవో హర్‌ప్రీత్ ఎ డె సింగ్ హర్షం వ్యక్తం చేశారు. తమ సిబ్బందిని అభినందించారు. 

Updated Date - 2020-11-30T03:01:36+05:30 IST