
న్యూఢిల్లీ : Sulli Deals యాప్ సృష్టికర్త ఓంకారేశ్వర్ ఠాకూర్, Bulli Bai యాప్ కేసు నిందితుడు నీరజ్ బిష్ణోయ్‌లకు ఢిల్లీలోని ఓ కోర్టు బెయిలు మంజూరు చేసింది. వీరిద్దరూ మొదటిసారి నేరం చేయడంతో, సంస్కరణాత్మక శిక్ష సిద్ధాంతం ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. వీరిని నిరంతరం జైలులో నిర్బంధించడం వల్ల వారి సంక్షేమానికి నష్టం జరుగుతుందని పేర్కొంది.
Bulli Bai, Sulli Deals యాప్‌ల ద్వారా ఓ వర్గం మహిళా పాత్రికేయులు, సెలబ్రిటీలను అమ్మకానికి పెట్టినట్లు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వీరిని అవమానిస్తూ, వారి పేరు, ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకు నిందితులు ప్రయత్నించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. నిందితులిద్దరూ విద్యార్థులని, జైలు నిర్బంధాన్ని కొనసాగించడం వల్ల వీరి భవిష్యత్తుకు హాని జరుగుతుందని కోర్టు పేర్కొంది. ఛార్జిషీటు దాఖలైందని, దర్యాప్తులో లోపం కనిపించలేదని పేర్కొంది.
సాక్ష్యాధారాలను తారుమారు చేయకుండా, సాక్షులను బెదిరించకుండా ఈ నిందితులపై కఠినమైన ఆంక్షలను విధించింది. మొబైల్ ఫోన్లను అన్ని వేళలా ఆన్ చేసి ఉంచాలని, సాక్షులను ఏ రూపంలోనూ సంప్రదించకూడదని తెలిపింది. దర్యాప్తు అధికారి కోరినపుడు నిందితులు తమ కరెంట్ లొకేషన్‌ను తెలియజేయాలని చెప్పింది.
GitHub ప్లాట్‌ఫాంలో Bulli Bai యాప్ 2022 జనవరిలో వచ్చింది. దీనిలో ఓ వర్గానికి చెందిన దాదాపు 100 మంది మహిళా జర్నలిస్టులు, సమాజంలో ప్రముఖ మహిళల ఫొటోలు, ప్రొఫైల్స్ పెట్టారు. వీరిని వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. Sulli Deals 2020లో బయటపడింది. దీనిలో కూడా ఓ వర్గానికి చెందిన మహిళల ఫొటోలను వేలానికి పెట్టారు. Bulli Bai యాప్ క్రియేటర్ బిష్ణోయ్‌ని అస్సాంలో 2022 జనవరి 6న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఠాకూర్‌ను జనవరి 9న ఇండోర్‌లో అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి