చింతన, ఆచరణల్లో భిన్న మార్క్సిస్టు

ABN , First Publish Date - 2021-04-23T05:34:10+05:30 IST

మార్క్సిస్ట్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ గౌస్‌ ఆకస్మిక మృతి ఆ పార్టీకే కాదు,...

చింతన, ఆచరణల్లో భిన్న మార్క్సిస్టు

మార్క్సిస్ట్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ గౌస్‌ ఆకస్మిక మృతి ఆ పార్టీకే కాదు, దేశంలో అభివృద్ధి చెందుతున్న బహుజన సామాజిక ప్రజాస్వామ్య ఉద్యమానికి కూడా పెద్ద నష్టం. ఉ.సా. అసువులుబాసి సంవత్సరం గడవకముందే, అదే బాటలో పోరాడుతున్న గౌస్‌ ఈనెల 19న అస్తమించడంతో మిగతా సామాజిక ఉద్యమకారుల బాధ్యత మరింత పెరిగింది. పార్టీలో అత్యంత కీలకమైన అఖిల భారత స్థాయి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్న గౌస్‌ రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ప్రతి దశలోనూ సామర్థ్య నిరూపణ ద్వారా సాగిందే తప్ప ఎవరో గాడ్‌ఫాదర్‌ పైకి లాగుతుంటే ఎగబాకడం లేదు.


కనుకనే, ఆధిపత్య కుల స్వభావంతో కునారిల్లుపోతోన్న భారత దేశ సాంప్రదాయ కమ్యూనిస్టు ఉద్యమానికి కొత్త సామాజిక ఊపిరులూదటానికి గౌస్‌ నడుం బిగించాడు. కమ్యూనిస్టు ఉద్యమ శ్రామిక వర్గ కోణానికి భారతీయ వాస్తవికతలోని సామాజిక గవాక్షాన్ని తెరచి, నూతన సామాజిక దృక్పథాన్ని అందించే బృహత్తర కర్తవ్యాన్ని తన భుజస్కంధాలపై వేసుకొన్నాడు. మార్క్సిస్ట్‌ పదజాలంతో, ఎర్రజెండా ముసుగులో దేశంలోని కొన్ని కులాల ఆధిపత్యాన్ని చెక్కుచెదరకుండా కాపాడే అపవిత్ర కర్తవ్యాన్ని దశాబ్దాలుగా, పరోక్షంగా నిర్వహిస్తున్న కమ్యూనిస్టు నామధేయ ఉద్యమంలో అణచబడ్డ కులాల అస్తిత్వం మరుగున పడిపోయిందని గౌస్‌ గుర్తించాడు. అలాగే కులరహిత, వర్గరహిత సమసమాజ స్థాపనలో అణచబడ్డ సామాజిక వర్గాల కీలక పాత్రని గౌస్‌ నొక్కి చెప్పాడు. గౌస్‌ మార్గ దర్శకత్వంలో విజయవాడలో 2020 జనవరిలో జరిగిన పార్టీ మహాసభలో ఆమోదించిన తీర్మానంలోని కొన్ని అంశాలు ఆయన భావజాలానికి అద్దం పడతాయి. ‘‘సమాజ పురోభివృద్ధికి ఆధిపత్య కుల అస్తిత్వమా? లేక, అణచబడ్డ కుల అస్తిత్వం ప్రధానమైన ఆటంకమా? చారిత్రకంగా చూస్తే, అమానుష కుల వ్యవస్థలో పూర్తి ఆధిపత్యం చెలాయించింది, ఆధిపత్య కుల అస్తిత్వవాదులే. ప్రస్తుతం కూడా అభివృద్ధి నిరోధకానికి ప్రాతినిధ్యం వహించేది ఆధిపత్య కుల అస్తిత్వాలే. సమాజ పురోభివృద్ధికీ, వామపక్ష ఉద్యమాలు వెనకపట్టు పట్టడానికీ అణచబడ్డ కుల అస్తిత్వాలు కారణం కాదు. అసలు కారణం ఆధిపత్య కుల అస్తిత్వమే. కులం వలన గౌరవం, సదా సంపదలు పొందేవారు ఉంటారు. వారికి కుల బాధితులు పొందే అవమానాలు, బాధలు అర్థం కావు. వీరు పెట్టే సంఘాలు, పార్టీలకు ఆధిపత్య కుల అస్తిత్వం ఉండటం సహజం. వీరు ఆధిపత్య కుల అస్తిత్వవాదులు’. పార్టీ తీర్మానంలో ఇంకా ఇలా చెప్పారు: ‘భారత బూర్జువా వర్గమే కుల దురభిప్రాయాలను పెంచి పోషిస్తుంది. కుల వ్యవస్థకు, దళితుల అణచివేతకు వ్యతిరేకంగా ఐక్యత సాధించినపుడే కార్మిక వర్గ ఐక్యత ఏర్పడుతుంది. ఎందుకంటే, దళిత జనాభాలో అత్యధికులు శ్రామిక వర్గాలకు చెందినవారే. కుల వ్యవస్థ నిర్మూలనకై పోరాటం ప్రజాతంత్ర విప్లవంలో ముఖ్యమైన భాగం. ఆధిపత్య కులవాదానికి ప్రతినిధులుగా వున్న పరివార్‌ని ఎదిరించాలంటే, నిలువరించాలంటే, ఆర్థిక దోపిడీదారులకు వ్యతిరేకంగా, ఆధిపత్య కుల అస్తిత్వవాదులకు వ్యతిరేకంగా కూడా ఏక కాలంలో ఐక్యంగా కమ్యూనిస్టు, వామపక్ష, ప్రజాతంత్ర పార్టీలు, సామాజిక న్యాయం కొరకు పోరాడే శక్తులు, సంస్థలు, పార్టీలు పోరాడాలి’’ అని ఆ తీర్మానానికి ముగింపు పలికారు. 


సామాజిక ప్రజాస్వామ్యం, సోషలిజం కులరహిత సమాజ స్థాపన లక్ష్యాలుగా కుల- వర్గ దృక్పథంతో ఒక తీర్మానం రూపంలో ఇంత స్పష్టంగా సి.పి.ఐ. గానీ, సి.పి.ఎం. గానీ, లీగల్‌గా పనిచేస్తోన్న ఎం.ఎల్‌. పార్టీలు గానీ ఇప్పటి వరకూ చెప్పి ఉండలేదు. ఇండియాలో 80 శాతంగా గల బహుజనుల విముక్తికీ, పేదరికం, అసమానతల నిర్మూలనకీ, మొత్తం దేశ పురోగమనానికీ దోహదపడే కుల-వర్గ విధానాన్ని రూపొందించి, కార్యాచరణకి ఉపక్రమించడంలో ఎం.సి.పి.ఐ.(యు) ప్రధాన కార్యదర్శిగా, మహ్మద్‌ గౌస్‌ పాత్ర కీలకమైనది. తెలంగాణ రాష్ట్రంలో సి.పి.ఎం. ఆర్భాటంగా ప్రారంభించి ఆ తర్వాత వదలి వేసిన బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ని గౌస్‌ మార్గదర్శకత్వంలో ఎం.సి.పి.ఐ.(యు) కొనసాగిస్తోంది. దేశీయ వాస్తవిక పరిస్థితులకి మార్క్సిజాన్ని అన్వయించి, ఫూలే, అంబేడ్కర్‌ల భావజాలాన్ని ఇముడ్చుకొని, నూతన సిద్ధాంత రూపకల్పనలో, కార్యాచరణలో నిమగ్నుడై జీవిత తుది ఘడియల వరకూ పోరాడిన గౌస్‌కి ఇవ్వగల నిజమైన నివాళి–ఆయన ఆశయ సాధనలో భాగస్వాములు కావడమే. 

వై.కె

సీనియర్‌ న్యాయవాది

Updated Date - 2021-04-23T05:34:10+05:30 IST