ఒక వాస్తవం... రెండు పుస్తకాలు!

ABN , First Publish Date - 2022-09-16T06:26:44+05:30 IST

హైదరాబాద్‌ రాజ్యం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైన క్రమం గురించి, అప్పుడు జరిగిన చర్చల గురించి, వివిధ ఘటనల గురించి వాటిల్లో పాల్గొన్న ఇద్దరు ప్రముఖులు...

ఒక వాస్తవం... రెండు పుస్తకాలు!

హైదరాబాద్‌ రాజ్యం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైన క్రమం గురించి, అప్పుడు జరిగిన చర్చల గురించి, వివిధ ఘటనల గురించి వాటిల్లో పాల్గొన్న ఇద్దరు ప్రముఖులు రెండు పుస్తకాలు రాశారు. ఒక పుస్తకం అప్పటి రాష్ర్టాల వ్యవహారాల శాఖ క్యాబినెట్‌ సెక్రటరీగా పనిచేసిన, సర్దార్‌ పటేల్‌కు అత్యంత విశ్వసనీయుడు అయిన వీపీ మీనన్‌ వ్రాసిన “The story of the integretion of the indian states”.. ఇందులోని హైదరాబాద్‌ భాగాన్ని ‘‘అసఫ్‌ జాహీ సంస్థానం విలీనగాథ ‘‘అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. రెండవది హైదరాబాద్‌ చివరి ప్రధానమంత్రి మీర్‌ లాయక్‌ అలీ రాసిన “TRAJEDY OF HYDERABAD”. దీన్ని ‘‘హైదరాబాద్‌ విషాదం’’ పేరుతో అనువదించారు. ఈ రెండు పుస్తకాలను తెలుగులోకి అనువాదం చేసింది ఏనుగు నరసింహారెడ్డి. సాహిత్య సృజనకారుడిగా తెలంగాణ ప్రజలకు ఆయన సుపరిచితుడే.


మీనన్‌ ట్రావెన్‌కోర్‌కు చెందినవాడు. బ్రిటిష్‌ వారి వద్ద సివిల్‌ సర్వెంట్‌గా చాలా కాలం పని చేసినవాడు. కాబట్టి ఆయన దేశం దృష్టితో హైదరాబాదును చూస్తాడు. మీర్‌ లాయక్‌ అలీ హైదరాబాద్‌కు చెందినవాడు. మాంచెస్టర్‌ యూనివర్సిటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చేశాడు. పారిశ్రామికవేత్త. భారత–హైదరాబాద్‌ల మధ్య చర్చలు ప్రారంభం అయ్యాక, కష్టకాలంలో అనివార్యంగా హైదరాబాద్‌కు ప్రధాని అయ్యాడు. ఆయన హైదరాబాద్‌ దృష్టి నుంచి భారత్‌ను చూస్తాడు. భారత్‌ – హైదరాబాద్‌ల మధ్య జరిగిన అన్ని ప్రధాన చర్చలలో వీరిద్దరూ పాల్గొన్నారు. ముఖ్య పాత్రను పోషించారు. మీనన్‌ తన పుస్తకం ప్రారంభంలోనే ఇలా చెబుతాడు. ‘‘భారతదేశం భౌగోళిక ఏకత్వం ఉన్న దేశం. సుదీర్ఘమైన చరిత్ర ఉన్నప్పటికీ భారత్‌లో రాజకీయ ఐక్యత ఎప్పుడూ సాధ్యం కాలేదు.’’ ‘‘భారతదేశంలో రాజకీయ ఏకీకరణ చేయడం కంటే గొప్ప పని బ్రిటిష్‌ వారేదిచేయలేదు. ఈ సాఫల్యం వల్ల, జాతీయోద్యమ స్ఫూర్తి వల్ల స్వతంత్ర భారతదేశం దేశీయ సంస్థానాలను శాంతియుతంగా భారత్‌లో కలిపే ప్రయత్నాలను విజయవంతంగా చేపట్టగలిగింది’’. ఇది మీనన్‌ దృష్టి. మీర్‌ లాయక్‌ అలీకి సహజంగానే హైదరాబాద్‌ చరిత్ర, రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులపై పట్టు ఎక్కువ ఉన్నందున వాటిని ఎక్కువగా వివరిస్తాడు. ‘‘అల్ప సంఖ్యాకులైన ముస్లింలు, పెద్ద సంఖ్యలో ఉన్న హిందువులు భారతదేశంతో కలిసి ఉంటూ, సాధ్యమైనంత వరకు స్వతంత్ర రాష్ట్రంగా మనుగడ సాగించాలని కోరుకున్నారు.’’.... ‘‘చరిత్రాత్మకంగా అటు హిందూ రాజుల పాలనలోనైనా, ఇటు ముస్లిం రాజుల పాలనలోనైనా హైదరాబాద్‌ ఒక స్వతంత్ర దేశంగానే ఉండింది. కొద్ది కాలాలు తప్ప.. రాష్ట్రంలోని హిందువులు స్వేచ్ఛాప్రియులు’’ అని మీర్‌ లాయక్‌ అలీ అన్నాడు.


ఈ రెండు పుస్తకాలలో చాలా విషయాలు చర్చించారు. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలను తీసుకుంటాను. అందులో హైదరాబాద్‌ రాజ్యాన్ని పాకిస్థాన్‌లో కలపడానికి నిజాం ప్రయత్నించాడు అనేది ఒకటి. అటువంటిదేమీ లేదని వీపీ మీనన్‌ పుస్తకంలోనే ఎన్నో సందర్భాలలో కనిపిస్తుంది. ‘‘1947 జూన్‌ 3 నాటి బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రకటనను అనుసరించి అటు భారత్‌ రాజ్యాంగ సభకు కానీ పాకిస్థాన్‌ రాజ్యాంగ సభకు గానీ సభ్యులను పంపకుండా ఫర్మాన జారి చేశాడు నిజాము. 15 ఆగస్టు నాడు ఏ దేశంలోనూ కలవకుండా హైదరాబాద్‌ స్వతంత్ర దేశంగా ఉంటుందని ప్రకటించాడు’’ నిజాం పాకిస్థాన్‌లో కలవాలని అనుకుంటే పాకిస్థాన్‌ రాజ్యాంగ సభకు సభ్యులను పంపి ఉండేవాడు. నిజాంకు హైదరాబాద్‌ భౌగోళికంగా ఎక్కడ ఉన్నదో స్పష్టంగా తెలుసు. చుట్టూ భారత భూభాగంతో చుట్టివేయబడి ఉన్న ఒక రాజరిక రాజ్యం పాకిస్థాన్‌లో చేరటం సాధ్యం కాని విషయం అని నిజాంకు చాలా స్పష్టంగా తెలుసు. అందుకే స్వతంత్రంగా ఉంటాను అని ప్రకటిస్తూనే, భారతదేశంతో మాత్రం ఒక ఒప్పందానికి సిద్ధమని ప్రకటించాడు. 1947 జూలై నెల నుంచే అంటే 15 ఆగస్టుకు ముందు నుంచే భారత ప్రతినిధి బృందం హైదరాబాద్‌ రాజ్య ప్రతినిధి బృందం మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కూడా, ‘‘ఆగస్టు 8న నిజాం లార్డ్‌ మౌంట్‌ బాటెన్‌కు ఒక ఉత్తరం రాస్తూ కలగూరగంపగా జతగూడుతున్న భారత్‌లో కాని పాకిస్థాన్‌లో కాని హైదరాబాద్‌ను విలీనం చేయనని తెలిపాడు. అయితే భారత్‌తో ఒక ఒప్పందం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు’’ అని మీనన్‌ పేర్కొన్నాడు. (మీనన్‌ పుస్తకం 44 పేజి). మీర్‌ లాయక్‌ అలీ, గాంధీని కలిసినప్పుడు కూడా ఇదే విషయం చెబుతాడు హైదరాబాద్‌ పాకిస్థాన్‌లో కలవాలనుకోవడం లేదని చెప్పాను.  ‘‘పాకిస్థాన్‌లో కలవడం జరగదని గాంధీజీకి స్పష్టంగానే చెప్పాను అని లాయక్‌ అలీ తెలిపాడు. (హైదరాబాద్‌ విషాదం 140 పేజి). చర్చల సందర్భంగా హైదరాబాద్‌ రాజ్య ప్రతినిధి బృందంతో స్వయంగా వీపీ మీనన్‌ కూడా ఇలా చెప్పాడు. ‘‘భారతదేశం మొత్తంలో ఐక్యత ఇప్పుడు భారత ప్రభుత్వ లక్ష్యమని దాన్ని సాధించడంలో నిజాం సహకరిస్తే నిజాం కోరికలను నెరవేర్చడానికి భారత్‌కు అభ్యంతరం ఉండదు అన్నాను.’’ అంటే ఇరుపక్షాలకు తెలుసు... హైదరాబాద్‌ రాజ్యం పాకిస్థాన్‌లో కలవడం సాధ్యం కాదని.


భారత ప్రభుత్వాన్ని సైనికంగా ఎదుర్కొని స్వతంత్ర దేశంగా ఉండాలని నిజాం అనుకోలేదు. భారత్‌తో ఒప్పందం చేసుకుని, ఓ మేర స్వతంత్ర రాజ్యంగా ఉండాలని అనుకున్నాడు. భారత ప్రభుత్వం కూడా నిజాంను అధికారం నుంచి తొలగించాలని అనుకోలేదు. నిజాంతో ఒక ఒప్పందం చేసుకుని ఆయన రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేసుకోవాలని అనుకున్నది. అయితే ఒప్పందం విషయాల దగ్గరనే సమస్య వచ్చింది. అది యుద్ధం వరకు తెచ్చింది. యుద్ధం తరువాత ఒప్పందానికి వచ్చారు. తేడా అంతే. అయితే యుద్ధంలో గెలిచినవారు ఒప్పందంలో తమకు అనుకూలమైన విషయాలను చేర్చారు. అంతేకాని నిజాం పాలన నుంచి తెలంగాణను విమోచన చేయడానికి యుద్ధం జరగలేదని ఈ పుస్తకాలు చదివితే ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. యథాతథ ఒప్పందం అమలులో ఉన్నా, చర్చలు నెమ్మదిగానే అయినా జరుగుతున్నా యుద్ధం వరకు ఎందుకు వచ్చింది ? యుద్దం తరువాత ఒప్పందం చేసుకోగలిగినవారు ముందే ఎందుకు చేసుకోలేదు? ఇది అర్థం కావాలంటే మీనన్‌ పుస్తకంలోని ఈ పంక్తులను చదవాలిసిందే. ‘‘ఈ ప్రతిష్టంభన (చర్చలలో) రెండు పక్షాలకూ లాభం చేయకపోగా రజాకార్లు, కమ్యూనిస్టులు బలపడడానికి ఉపయోగపడుతుంది. రెండు ప్రభుత్వాల మధ్య సహకారం లేకపోవడం వల్ల అటు హైదరాబాద్‌ కానీ ఇటు భారత్‌ కానీ వాళ్ల చర్యలను నియంత్రించలేక పోతున్నాయి. రోజూ వచ్చే నివేదికలు చదువుతూ ఉండడం వల్ల నాకు విలీనం, బాధ్యతాయుత ప్రభుత్వం కంటే కూడా కమ్యూనిస్టులు, రజాకార్లు తలపెడుతున్న చర్యల మీద అధికంగా బెంగ మొదలయింది.’’ ‘‘రాష్ట్ర చిత్ర పటాన్ని చూస్తే ద్వీపకల్పానికి దక్షిణభాగంలో మధ్యలో ఉంటుంది. ఒక వేళ నిజాం ప్రయత్నాలు ఫలించినా, కమ్యూనిస్టులు విజయం సాధించినా ఉత్తరాది నుండి దక్షిణాది వేరయే ప్రమాదం ఉండింది.’’ నిజానికి భారత ప్రభుత్వం, నిజాం, రజాకార్ల గురించి ఎక్కువగా ఆలోచించలేదు. వారి శక్తి ఏంటో భారత్‌కు స్పష్టంగా తెలుసు. భయం అంతా కమ్యూనిస్టుల గురించే.


ఇక రెండవ విషయం నిజాం, బారత్‌తో యుద్ధం చేయడానికి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడనేది. ఈ విషయం గురించి రెండు పుస్తకాలలోనూ ప్రచారంలో ఉన్న దానికి భిన్నంగానే ఉన్నది. యథాతథ ఒప్పందంలో భారతదేశం, హైదరాబాద్‌కు ఆయుధాలు సరఫరా చేస్తానని ఒప్పుకున్నది. గతంలో బ్రిటిష్‌వారు సరఫరా చేసేవారు. ఒకవేళ భారత్‌ సరఫరా చేయలేకపోతే వేరే దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసుకుంటామని నిజాం ముందే తెలియచేస్తాడు కూడా. అయితే భారత్‌ ఇచ్చిన మాట ప్రకారం ఆయుధాలు సరఫరా చేయదు. అప్పుడు నిజాం బయటి నుంచి ఆయుధాలు కొనడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాని భారత్‌తో యుద్ధం చేయడానికి కాదు. అయినా భారత్‌ ప్రతినిధి బృందమే మళ్లీ అభ్యంతరం చెబుతుంది. మీనన్‌ పుస్తకంలో అది స్పష్టంగా ఉంది. ఈ రెండు పుస్తకాలలోనూ మనకు తెలియని, మన చరిత్ర ఎంతో ఉంది. భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, వాదాలూ వివాదాలూ ఉన్నాయి. హైదరాబాద్‌, భారత్‌ మధ్య జరిగిన జరిగిన చర్చలు, చేసుకున్న ఒప్పందాలు, రాసుకున్న ముసాయిదాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ లేదా వాటి సారాంశం విద్యార్థుల చరిత్ర పుస్తకాలలోకి ఎక్కాల్సి ఉంది. లేకపోతే ఎవరి మిరియాలు వారు చరిత్రగా నూరి జనం మీద చల్లుతారు. తమ చరిత్ర తమకే తెలియని ప్రజలు భవిష్యత్తు చరిత్రను సరిగ్గా నిర్మించుకోలేరు.

లంకా పాపిరెడ్డి

Updated Date - 2022-09-16T06:26:44+05:30 IST