సమావేశంలో మాట్లాడుతున్న చైర్పర్సన్ యశోధ
ప్రభుత్వానికి ఏఎంసీ పాలకవర్గం తీర్మానం
అనకాపల్లి టౌన్, జూన్ 29 : జిల్లా కేంద్రమైన అనకాపల్లికి రైతు బజారు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం మార్కెట్ కమిటీ పాలకవర్గం తీర్మానం చేసింది. చైర్పర్సన్ పలకా యశోధ అధ్యక్షతన జరిగిన తొలి సమావేశంలో రైతాంగానికి అవసరమయ్యే పలు అంశాలపై చర్చించారు. అనకాపల్లి జిల్లా ఏర్పాటైనందున రైతు బజారు ఎంతో అవసరమని చైర్పర్సన్ అభిప్రాయపడ్డారు. జిల్లాలో రైతులు పండించిన పంటలను విశాఖనగరంలోని రైతు బజార్లకు తీసుకెళ్లడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చెప్పారు. జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు పాలకవర్గం సమావేశం నిర్ణయించింది. అలాగే మార్కెట్‌యార్డులో పడిపోయిన రక్షణ గోడల పునర్నిర్మాణంతో పాటు మరిన్ని అభివృద్ధి పనులకు రూపొందించిన అంచనాలను ప్రభుత్వం మంజూరు చేయాలని తీర్మానంలో ప్రభుత్వాన్ని కోరినట్టు చైర్పర్సన్ తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి బి.రవికుమార్, వైస్ చైర్మన్ కరక సోమునాయుడు, డైరెక్టర్లు పాల్గొన్నారు.