మున్సిపల్ భవనంపై ఎగిరిన జెండా

ABN , First Publish Date - 2022-08-13T06:49:43+05:30 IST

స్వాతంత్ర్యోద్యమంలో పెదనందిపాడు భూమిశిస్తు నిరాకరణోద్యమం ఒక మహోజ్వల ఘట్టం. అది బ్రిటిష్ ప్రభుత్వ పునాదులను కదిలించివేసింది.

మున్సిపల్ భవనంపై ఎగిరిన జెండా

స్వాతంత్ర్యోద్యమంలో పెదనందిపాడు భూమిశిస్తు నిరాకరణోద్యమం ఒక మహోజ్వల ఘట్టం. అది బ్రిటిష్ ప్రభుత్వ పునాదులను కదిలించివేసింది. ఈ కీర్తి సాధించిన యువకిశోరాలు పర్వతనేని వీరయ్య చౌదరి, బారిస్టర్ నడింపల్లి నరసింహారావు గార్లు. నరసింహారావును గుంటూరు వాసులు ఆప్యాయంగా యన్‌విఎల్ అని పిలుస్తారు. ఆయన 1913లో ఇంగ్లండు వెళ్ళి బారెట్లా, ఎడింబరో యూనివర్సిటీనుంచి యల్‌యల్‌బి డిగ్రీలు పొందారు. తరువాత మూడేళ్ళపాటు మద్రాసులో ప్రకాశం గారి శిష్యుడై హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. 1920లో గుంటూరు చేరి ప్రాక్టీసుతో పాటు రాజకీయాలలో ప్రవేశించారు. 1920లోనే కొత్తపేట నుండి గుంటూరు మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికైనారు. ఆ హోదాలో పుల్లరి సత్యాగ్రహం చేస్తున్న మహానాయకులు ఉన్నవ లక్ష్మీనారాయణగారికి సహకరించారు.


గాంధీగారి పిలుపుమేరకు పెదనందిపాడు ఫిర్కా రైతులు శిస్తునిరాకరణ ఉద్యమం చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. దేశభక్త కొండా వెంకటప్పయ్య గారు యన్‌విఎల్ గారిని బార్దోలి పంపి-, పెదనందిపాడు ఉద్యమానికి మహాత్ముని అనుమతి తీసుకొని రమ్మన్నారు. గాంధీజీ అనుమతి తీసుకొని వచ్చిన యన్‌విఎల్ విస్తృతంగా ఆ ఉద్యమానికి దోహదం చేశారు. ఆ సందర్భంగా ఆయన రెండునెలలు గుంటూరు సబ్ జైలులో ఉండవలసి వచ్చింది. విచారణ చేసిన కలెక్టర్ రూథర్ ఫర్డ్ నేరాన్ని నిరూపించలేక, పరువు కాపాడుకొనేందుకు యన్‌విఎల్‌కు వెయ్యిరూపాయల జరిమానా విధించారు. పెదనందిపాడు ఉద్యమ తీరు గమనించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మోతీలాల్ ప్రభృతులను గుంటూరుకు పంపింది. గుంటూరు మున్సిపల్ కమిషన్ ఆ బృందానికి పౌరసన్మానం చేయాలని తీర్మానించింది. 1922 ఆగస్టు 1వ తేదీన మోతీలాల్ బృందం గుంటూరుకు వచ్చినప్పుడు, గుంటూరు కలెక్టర్ రూథర్ ఫర్డ్ పట్టణంలో 144వ సెక్షన్ విధించి, కాంగ్రెస్ బృందానికి స్వాగతం పలకడానికి వచ్చిన ఉన్నవ లక్ష్మీనారాయణ ప్రభృతులను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ తీవ్ర నిర్బంధ వాతావరణంలో గుంటూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పరారయ్యారు.


మోతీలాల్ నెహ్రూ మహాజనులను ఉద్దేశించి ‘మీ మున్సిపల్ చైర్మన్ పరారయ్యారు. ఆయన స్థానంలో యన్‌విఎల్ గారిని చైర్మన్‌గా నియమిస్తున్నాను. మీకు సమ్మతమేనా?’ అని ప్రశ్నించారు. అశేష ప్రజానీకం హర్షధ్వానాలు చేయడంతో యన్‌విఎల్ నియామకం జరిగిపోయింది. మోతీలాలకు యన్‌విఎల్ పౌరసన్మాన పత్రం సమర్పించారు. జిల్లా కలెక్టరు నిశ్చేష్డుడైనాడు. యన్‌విఎల్‌ను అరెస్టు చేసే సాహసం చేయలేకపోయాడు.


1922 డిసెంబరు 5న క్రమబద్ధంగా మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన యన్‌విఎల్ మరునాడే గుంటూరు మున్సిపల్ భవనంపై కాంగ్రెస్ పతాకాన్ని ఆవిష్కరించారు. పట్ణణంలో ఇది గొప్ప సంచలనం సృష్టించింది. కలెక్టర్ రూథర్ ఫర్డ్ ఈ మారు కూడా యన్‌విఎల్‌ను అరెస్టు చేయడానికి సాహసించలేకపోయారు. భారతదేశం మొత్తంమీద అలా మున్సిపల్ భవనంపై మువ్వన్నెల జెండా రెపరెపలాడిన గౌరవం గుంటూరుకే దక్కింది. ఈ విషయమై బ్రిటిష్ పార్లమెంటులో చర్చ జరిగింది. కలెక్టర్ రూథర్ ఫర్డ్ నామినేటెడ్ సభ్యులైన కాలేజీ ప్రిన్సిపాల్, హైస్కూలు హెడ్ మాస్టర్‌ను పిలిపించుకొని పతాకావిష్కరణకు మీరు ఎలా సమ్మతించారని ప్రశ్నించారు. మేమంతా చైర్మన్ గారి సాహసానికి గర్విస్తున్నామని వారు సమాధానం చెప్పారు. యన్‌విఎల్ 1922 నుండి 1936 వరకూ, మధ్యలో కొంతకాలం జైలుకు వెళ్ళిన సందర్భాన్ని మినహాయిస్తే, చైర్మన్‌గా ఉంటూ ప్రజారంజకంగా, సర్వస్వతంత్రంగా పాలన చేశారు. బేయర్స్ అనే కలెక్టరు తన వద్దకు తలపై ఆచ్ఛాదనతో రావాలని నడింపల్లివారిని ఆదేశించినప్పుడు, అదే తమ నిర్ణయమైతే, ఇదే తమరి ఆఖరిదర్శనం అంటూ ఆయన అక్కడనుంచి వెంటనే వెళ్ళిపోయారు. 1928లో సైమన్ కమిషన్ గుంటూరు వచ్చిన వేళ, ప్రజలెవ్వరినీ వీధుల్లోకి రావద్దని యన్‌విఎల్ ఆదేశించారు. ఇది అప్రకటిత కర్ఫ్యూ అని గమనించిన సైమన్ కమిషన్ ‘ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం లేదు, గుంటూరు యన్‌విఎల్ జాగీరు’ అని వ్యాఖ్యానించింది.


1930లో ఉప్పు సత్యాగ్రహం గుంటూరు చరిత్రలో మరో మహత్తరమైన ఘట్టం. వాడరేవు, నిజాంపట్నం నుండి సముద్రపు నీరు తెచ్చి గుంటూరు కొత్తపేటలోని యడవల్లి వారి సత్రంలో నూరుపొయ్యిలు, బ్రాడీపేటలోని దేశభక్త భవనంలో మరో నూరు పొయ్యిలు ఏర్పాటు చేసి, ఉప్పును తయారు చేశారు. ఈ ఉద్యమానికి యన్‌విఎల్ రెండు వేలమంది వాలంటీర్లను నియమించారు. ముప్పైవేల రూపాయల నిధులు సేకరించారు. మున్సిపల్ కార్యాలయంలోని ఉద్యోగులందరినీ ఇందుకు వినియోగించారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఇలాంటి ఉద్యమం జరగలేదు.


– -రావినూతల శ్రీరాములు

Updated Date - 2022-08-13T06:49:43+05:30 IST