నోటీసుల కలకలం

ABN , First Publish Date - 2021-11-01T05:40:36+05:30 IST

జిల్లాలో జగనన్న గోరుముద్ద పథకం అభాసుపాలవుతోంది.

నోటీసుల కలకలం

  1. 908 మంది హెచ్‌ఎంలకు షోకాజ్‌ నోటీసులు 
  2. మధ్యాహ్న భోజనానికి అందని గుడ్డు, చిక్కీలు
  3. కుళ్లినవి సరఫరా చేస్తున్నారంటున్న టీచర్లు


కర్నూలు(ఎడ్యుకేషన్‌), అక్టోబరు 31: జిల్లాలో జగనన్న గోరుముద్ద పథకం అభాసుపాలవుతోంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకొచ్చాయి. జగనన్న గోరుముద్ద పథకం జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరుగారిపోతోంది. గుడ్డు, చిక్కీలు సరఫరా కొంత కాలంగా నిలిచిపోయింది. ఈ పథకానికి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. విద్యార్థులకు గుడ్డు, చిక్కీలు ఎందుకు అందించడం లేదో వివరణ ఇవ్వాలని జిల్లాలో 908 మంది ప్రధానోపాధ్యాయులకు కడప ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి అక్టోబరు 30న ఆర్‌సీ.నెం.3936/బీ3/2021న షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. ఇందులో 385 పాఠశాలల్లో విద్యార్థులకు చిక్కీలు, 523 పాఠశాలల్లో గుడ్డు సరఫరా చేయడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. గుడ్లు, చిక్కీలు సరఫరా చేసే ఏజెన్సీలను అవసరమైతే బ్లాక్‌ లిస్టులో పెట్టాలని రాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏజెన్సీలు చాలా వరకు అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో ఉంటాయి. వీటిని బ్లాక్‌ లిస్టులో పడితే వాళ్ల నుంచి ఒత్తిడి వస్తుందని జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ పథకం అమలులో మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల విద్యాశాఖ అధికారులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. జిల్లాలో 2,898 అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 4,22,001 మంది మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నట్లు అధికారులు రికార్డులు చూపుతున్నారు. ఇందులో 2011 ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు 2,26,630 మంది, 377 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు 1,21,912 మంది, ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులు 73,459 మంది ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రోజుకు కుకింగ్‌ చార్జీ కింద రూ.4.97, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.7.45 ప్రకారం వంట ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇది కాకుండా మధ్యాహ్న భోజనానికి బియ్యం, గుడ్డు, చిక్కీలు ఉచితంగా పాఠశాలలకు సరఫరా చేస్తోంది. 


చిన్నసైజు, మురిగిన గుడ్ల సరఫరా


జగనన్న గోరుముద్ద పథకం కింద పాఠశాలలకు గోలిగుండు సైజులో ఉన్న గుడ్లు సరఫరా చేస్తున్నారు. అవీ కుళ్లిపోయినవి ఇస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. కుళ్లిన గుడ్లను వంట ఏజెన్సీలు పారవేస్తున్నాయి. ఈ విషయం మండల, జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి ఉపాధ్యాయులు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యార్థులకు రోజుకు ఒక్కపూటైనా పౌష్టికాహారం అందడం లేదు. 


గుడ్ల సరఫరాలో రాజకీయ జోక్యం


జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా పాఠశాలలకు గుడ్లు సరఫరా చేసే టెండర్లను దక్కించుకునేందుకు అధికార పార్టీ నాయకులు తమలో తాము పోటీ పడుతున్నారు. టెండర్లను దక్కించుకోడానికి జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తీసుకువచ్చి ఎక్కువ ధరలకు కోట్‌ చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన గుడ్ల టెండర్‌ను దక్కించుకోడానికి రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఇనుపరాడ్లు, కత్తులతో పరస్పరం దాడులు చేసుకుని పోలీసు కేసుల దాకా వెళ్లాయి. అప్పటి జిల్లా అధికారులు నాయకుల మధ్య రాజీ కుదిర్చి పాఠశాలలను డివిజన్ల వారిగా విభజించి టెండర్లు అప్పగించారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లను భరించలేక గతంలో ఓ డీఈవో గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరారు. 


నిలిచిన గుడ్డు, చిక్కీల సరఫరా


జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన గుడ్లు, చిక్కీల సరఫరా నిలిచిపోయింది. ఐఎంఎంఎస్‌ యాప్‌ను ప్రామాణికంగా తీసుకుని విద్యార్థులకు గుడ్లు, చిక్కీలు పంపిణీ చేయడం లేదని జిల్లాలోని 908 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కడప ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఇందులో 388 పాఠశాలల్లో చిక్కీలు, 523 పాఠశాలల్లో గుడ్డును సరఫరా చేయడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. 


సక్రమంగా పంపిణీకి చర్యలు


జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు మిడ్‌ డే మీల్స్‌లో భాగంగా గుడ్లు, చిక్కీలు సక్రమంగా పంపిణీ కావడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఏజెన్సీలు చిన్న సైజ్‌, కుళ్లిన గుడ్లను సరఫరా చేయడంతో వాటిని వెనక్కి పంపించాం. వాటి స్థానంలో నాణ్యమైన గుడ్లు, చిక్కీలు సప్లయ్‌ చేయకపోవడంతో విద్యార్థులకు అందించలేకపోయాం. సోమవారం నుంచి గుడ్లు, చిక్కీలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటాం. నాణ్యమైన గుడ్లు సరఫరా చేయాలని ఏజెన్సీలను ఆదేశించాం. మండల విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు పాఠశాలలను పర్యవేక్షిస్తూ మిడ్‌ డే మీల్స్‌ను సక్రమంగా అమలు చేయాలని సూచించాం. 


-వి.రంగారెడ్డి, డీఈవో

Updated Date - 2021-11-01T05:40:36+05:30 IST