Rahul Video: అసలు విషయం తెలియక పప్పులో కాలేసిన బీజేపీ ఎంపీ.. ట్విట్టర్‌లో అభాసుపాలు..

ABN , First Publish Date - 2022-07-02T20:59:04+05:30 IST

సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక ఫేక్ న్యూస్ విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో నిజమేదో, అబద్ధమేదో తెలుసుకోలేనంత..

Rahul Video: అసలు విషయం తెలియక పప్పులో కాలేసిన బీజేపీ ఎంపీ.. ట్విట్టర్‌లో అభాసుపాలు..

న్యూఢిల్లీ: సోషల్ మీడియా (Social Media) అందరికీ అందుబాటులోకి వచ్చాక ఫేక్ న్యూస్ (Fake News) విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో నిజమేదో, అబద్ధమేదో తెలుసుకోలేనంత గందరగోళం నెలకొన్న ఘటనలు చాలానే చూశాం. కొంతమంది ఆ ఫేక్ వీడియోలనే నిజమని నమ్మి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తీరా అది ఫేక్ వీడియో అని తెలిశాక అభాసుపాలవుతుంటారు. ఇలాంటి పరిస్థితి చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. కానీ.. ఏకంగా కేంద్ర మాజీ సమాచార మరియు ప్రసార శాఖ మంత్రే అలాంటి ఫేక్ వీడియోలను పోస్ట్ చేస్తే, అది కూడా ఆ వీడియో విషయంలో సదరు వార్తా ఛానల్ తప్పయిపోయిందని క్షమాపణ చెప్పాక కూడా ట్విట్టర్‌లో ఆ వీడియోను ట్వీట్ చేస్తే.. తాజాగా అదే జరిగింది.



కేంద్ర మాజీ సమాచార, ప్రసార శాఖ మంత్రి, బీజేపీకి చెందిన ముఖ్య నేత రాజ్యవర్ధన్ రాథోర్ (Rajyavardhan Rathore) ఒక ఫేక్ వీడియోను తన ట్విట్టర్‌లో (Twitter) పోస్ట్ చేసి అభాసుపాలయ్యారు. ఆ వీడియో ప్రసారం చేసిన న్యూస్ ఛానలే తప్పు జరిగిపోయిందని క్షమాపణ చెబితే.. ఆ విషయం తెలియని ఈ జైపూర్ రూరల్ ఎంపీ (Jaipur Rural MP) ఆ ఛానల్ క్షమాపణ చెప్పిన 45 నిమిషాల తర్వాత కూడా మళ్లీ అదే వీడియోను పోస్ట్ చేసి రాహుల్ గాంధీపై రాజకీయ అస్త్రంగా ఆ వీడియోను వాడుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన కొందరు జర్నలిస్టులు ఈ మాజీ మంత్రి తీరును తప్పుబట్టారు. ఆ వార్తా సంస్థే తప్పు జరిగిందని క్షమాపణ చెబితే.. కనీసం ఆ విషయం తెలుసుకోకుండా సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మళ్లీ ఆ వీడియోను పోస్ట్ చేయడం ఏంటని అదే ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ మహిళా జర్నలిస్ట్ Anita Joshua మంత్రి పోస్ట్ చేసిన ఆ వీడియోపై ట్వీట్ చేశారు. మాజీ మంత్రి ఇలా ఫేక్ వీడియోను పోస్ట్ చేశారన్న విషయాన్ని తెలిపారు.



అసలు ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని తన పార్లమెంట్ నియోజకవర్గమైన వయనాడ్ పర్యటనలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వయనాడ్‌లోని (wayanad rahul office) రాహుల్ గాంధీ కార్యాలయాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై విచారణ చేయగా.. ఆ దాడికి పాల్పడిన వారిలో ఒకరు సీపీఎం (CPM) కార్యకర్తగా పోలీసులు గుర్తించారు. వయనాడ్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీని ఈ ఘటనపై మీడియా ప్రశ్నించగా.. హింస అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదని.. ఇలాంటి హింసాత్మక ఘటనకు ఎవరూ పాల్పడకూడదని.. ఇది ఒక బాధ్యతరాహిత్య ప్రవర్తన కలిగిన వారు చేసిన చర్యగా రాహుల్ చెప్పారు. అయితే.. తనకు ఈ దాడికి పాల్పడిన వారి మీద ఎలాంటి కోపం లేదని వ్యాఖ్యానించారు. తన కార్యాలయంపై దాడి చేసిన వాళ్లు తెలిసీతెలియని పిల్లలని రాహుల్ అన్నారు.



రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలను ఉదయ్‌పూర్‌లో (Udaipur Killing) జరిగిన టైలర్ హత్యకు (Tailor Murder) ఆపాదించి ఒక ప్రముఖ హిందీ న్యూస్ ఛానల్ వార్త ప్రసారం చేసింది. ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను హత్య చేసిన వాళ్లు పిల్లలని రాహుల్ అన్నట్టుగా ఆ వీడియోలో తప్పుగా ఉంది. ఆ ఛానల్‌లో వార్త చదివిన సదరు యాంకర్ కూడా రాహుల్.. టైలర్ హంతకులని చిన్నపిల్లలని అన్నట్టుగా చదివేశారు. కాంగ్రెస్ ఈ ఫేక్ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మీడియా సంస్థపై న్యాయపరమైన చర్యలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఆ వీడియోపై అసలు విషయాన్ని గ్రహించిన సదరు మీడియా సంస్థ క్షమాపణ చెప్పింది. ఇందుకు బాధ్యత వహిస్తూ ఆ మీడియా సంస్థలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి రాజీనామా చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇంత జరిగిన తర్వాత కూడా నిజం తెలియని రాజ్యవర్ధన్ రాథోర్ ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అభాసుపాలయ్యారు.

Updated Date - 2022-07-02T20:59:04+05:30 IST