కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న పండ్ల వ్యాపారి అరెస్ట్

ABN , First Publish Date - 2021-05-09T17:18:50+05:30 IST

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న కోవిడ్-19 మహమ్మారిని

కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న పండ్ల వ్యాపారి అరెస్ట్

ముంబై : ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న కోవిడ్-19 మహమ్మారిని కొందరు స్వార్థపరులు చాకచక్యంగా ఉపయోగించుకుంటున్నారు. వైద్య రంగంలో ఎటువంటి ప్రవేశం లేనివారు సైతం కోవిడ్‌కు మందులు ఇస్తామంటూ ప్రజలను దోచుకుంటున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో అలాంటి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పండ్లు అమ్ముకునే ఆ వ్యక్తి వైద్యుడిగా అవతారమెత్తి కోవిడ్-19 వ్యాధిగస్థులను మోసం చేస్తున్నట్లు ఆరోపించారు. 


పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, నాగపూర్‌లోని కమఠి ప్రాంతంలో నివసిస్తున్న చందన్ నరేశ్ చౌదరి పండ్లు, ఐస్ క్రీమ్ అమ్ముకునేవారు. ఆయన ఎలక్ట్రీషియన్‌గా కూడా చేస్తూ ఉంటారు. ఆయన ఐదేళ్ళ నుంచి ఓం నారాయణ మల్టీపర్పస్ సొసైటీ పేరుతో ఓ చారిటబుల్ డిస్పెన్సరీని నడుపుతున్నారు. ఈ డిస్పెన్సరీకి వచ్చే రోగులకు ఆయుర్వేద మందులు ఇస్తూ ఉంటారు. ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితిని ఆసరాగా తీసుకుని, ఆయన రోగులకు చికిత్స చేస్తున్నట్లు ఆయనతో సన్నిహితంగా మెలిగే ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


ఈ డిస్పెన్సరీలో పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో బూటకపు వైద్యుడి గుట్టు రట్టయింది. ఇక్కడి నుంచి ఆక్సిజన్ సిలిండర్లు, సిరంజిలు, ఇతర మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర ప్రాక్టీషనర్స్ యాక్ట్ ప్రకారం చౌదరిని అరెస్టు చేశారు. 


Updated Date - 2021-05-09T17:18:50+05:30 IST