Haryana: పోలీసులు, వ్యాపారుల దోపిడీ ముఠా గుట్టు రట్టు

ABN , First Publish Date - 2022-05-27T23:19:08+05:30 IST

హర్యానా (Haryana)లోని పంచకుల జిల్లా, దాని పరిసరాల్లో దోపిడీలకు

Haryana: పోలీసులు, వ్యాపారుల దోపిడీ ముఠా గుట్టు రట్టు

న్యూఢిల్లీ : హర్యానా (Haryana)లోని పంచకుల జిల్లా, దాని పరిసరాల్లో దోపిడీలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో పోలీసులు, వ్యాపారులు ఉన్నారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేయగా, అరెస్టయినవారిలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కస్టడీ నుంచి తప్పించుకుపోయారు. పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుపోయినందుకు మరొక కేసును నమోదు చేశారు. 


పంచకుల పోలీస్ కమిషనర్ డాక్టర్ హనీఫ్ ఖురేషీ, డీసీపీ సురీందర్ పాల్ సింగ్, ఏసీపీ విజయ్ కుమార్ శుక్రవారం మీడియాకు ఈ కేసు వివరాలను తెలియజేశారు.  పంచకులలో ఉంటున్న సంజీవ్ గార్గ్ తమకు ఓ ఫిర్యాదు చేశారని చెప్పారు. విదేశీయానం కోసం రుణం మంజూరు కోసం తన వద్ద నుంచి రూ.45 లక్షలు అనిల్ భల్లా తీసుకున్నారని ఈ ఫిర్యాదులో ఆరోపించారు. రుణం మంజూరు కాకపోవడంతో తాను తన సొమ్మును తిరిగి ఇవ్వాలని కోరానని తెలిపారు. దీంతో అనిల్ భల్లా తనను బెదిరించారని, తనను చంపుతానని, తనను తప్పుడు కేసులో ఇరికిస్తానని హెచ్చరించారని తెలిపారు. ఈ ఫిర్యాదుపై ఏసీపీ విజయ్ కుమార్ దర్యాప్తు జరిపారు. ఫిర్యాదులోని ఆరోపణలు నిజమేనని వెల్లడైంది. దీంతో పంచకులలోని సెక్టర్ 5 పోలీస్ స్టేషన్‌లో కేసును నమోదు చేశారు. భారత శిక్షా స్మృతి (IPC) సెక్షన్లు 193, 212, 384, 406, 409, 420, 467, 468, 471, 506 , 120-B ప్రకారం ఈ కేసును నమోదు చేశారు. 


ఇదిలావుండగా, నిందితుడు అనిల్ భల్లా పోలీసు సిబ్బందితో కుమ్మక్కయి సంజీవ్ గార్గ్‌పై ఓ తప్పుడు కేసును దాఖలు చేశారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే పెద్ద మొత్తంలో నగదు, లగ్జరీ కార్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పారు. ఓ కారుకు సంబంధించిన బూటకపు దస్తావేజులను కూడా సృష్టించారన్నారు. 


ఖురేషీ మాట్లాడుతూ, అనిల్ భల్లాపై 2016-17 నుంచి ఇప్పటి వరకు 180 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఏఎస్ఐ గుర్మేజ్ సింగ్ పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నారని, ఆయనపైనా, మరొక ఇద్దరిపైనా వేరొక కేసును నమోదు చేశామని చెప్పారు. ఆయనతోపాటు హెడ్ కానిస్టేబుల్ రాజ్‌బిర్ సింగ్, నరేశ్ కుమార్‌లను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. నాలుగో నిందితుడు ఆకాశ్ భల్లా పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. 


అనిల్ భల్లా ఈ ముఠాకు నాయకుడని పోలీసులు తెలిపారు. అనిల్ ఓ ఫైనాన్షియర్ అని, ఆయన మోసాలకు పాల్పడుతున్నట్లు చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. రుణాలిస్తానని చెప్పి, ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని, ఆస్తులను కాజేస్తున్నాడని, ప్రశ్నిస్తే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపిస్తున్నారని చెప్పారు. అరెస్టు చేయిస్తానని బెదిరించి కార్లు, డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని చెప్తున్నారని తెలిపారు. 


Updated Date - 2022-05-27T23:19:08+05:30 IST