పాడి రైతులకు సువర్ణావకాశం

ABN , First Publish Date - 2020-08-07T06:19:25+05:30 IST

పాడి పరిశ్రమకు మంచి రోజులొచ్చాయి. నేరుగా బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశాలు లభించనున్నాయి.

పాడి రైతులకు సువర్ణావకాశం

కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రుణాలు

కరోనా దెబ్బ నుంచి కోలుకునేందుకు ఆసరా

ఉమ్మడి జిల్లాలో 13000 మంది దరఖాస్తులు

బ్యాంకులకు అందచేసిన విజయ డెయిరీ

రూ.3లక్షల వరకు రుణ సదుపాయం


హన్మకొండ, ఆగస్టు 6 , (ఆంధ్రజ్యోతి): పాడి పరిశ్రమకు మంచి రోజులొచ్చాయి. నేరుగా బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశాలు లభించనున్నాయి. కొవిడ్‌ సంక్షోభం నుంచి రైతులతో పాటు పాడి పరిశ్రమను గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.15వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విజయ డెయిరీ పాలను అందించే రైతులు నేరుగా బ్యాంకుల ద్వారా రుణాలు పొందడానికి అవకాశం కలుగనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో నడిచే మదర్‌, విజయ డెయిరీలకు పాలు విక్రయించే రైతులకు పంట రుణాలతో సంబంధం లేకుండా కొత్త రుణాలు ఇవ్వాలని తలచింది. వ్యవసాయ రైతులకు బ్యాంకు ఇచ్చే కిసాన్‌ క్రెడిట్‌కార్డులను పాడి రైతులకు కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది. ప్రధాన మంత్రి ఆత్మ నిర్బర్‌ భారత్‌ ప్యాకేజీ కింద  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పాడి రైతులకు ఈ ఆర్థిక సాయం అందనుంది.  


కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు

ఈ ప్యాకేజీలో భాగంగా పాడి రైతులందరికీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందించి పాడి ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో తక్కువ వడ్డీకి బ్యాంకు లింకేజి రుణాలు ఇవ్వనున్నారు. పాడి రైతు సహకార సంఘాలు, బ్యాంకర్లు కలిసి పాడి రైతులకు రుణాలు అందించేందుకు లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంది.  ఎలాంటి పూచి కత్తు లేకుండా రూ.1.60లక్షల వరకు రుణాలను అందిస్తారు. రూ.3లక్షల రుణాన్ని అందిచేందుకు రైతులు బ్యాంకు గ్యారంటీకి సంబంఽధించిన పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే పాడి పశువులున్న వారికి బ్యాంకులు ఇచ్చే రుణంతో అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఒకటీ లేదా రెండు పశువులతో డెయిరీకి తక్కువగా పాలు పోసేవారు అదనంగా పాలుపోయడానికి ఆసక్తి కనబరిస్తే రూ.3లక్షల వరకు రుణం అందించనున్నారు. 


పాడిరైతులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విజయ డెయిరీకి పాలను అందించే రైతులు 22,000 మంది ఉన్నారు. వీరందరూ ఏకకాలంలో రుణాలు పొందే సువర్ణావకాశం వచ్చింది. పంటలకు ప్రత్యామ్నాయంగా పాడిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఎంతో మేలు కలుగనున్నది. రైతు వద్ద ఉన్న ఆవులపై రుణం తీసుకునే వెసులుబాటు కల్పించారు. పాడిరైతులు ఏ బ్యాంకులో పంట రుణాలు పొందుతున్నారో అదే బ్యాంకు నుంచి పాడి రుణ సహాయం పొందవచ్చు. విజయ డైయిరీతో ఒప్పందం ఉన్న రైతులకు రూ.3లక్షల వరకు రుణాలు ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. బ్యాంకు అధికారులు ఎలాంటి నిబంధనలు పెట్టకుండా పాడి రుణాలివ్వాల్సి  ఉంది. 


దరఖాస్తులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 436 పాడి సహకార సంఘాలు ఉన్నాయి. ఒక్క జనగామ జిల్లాలోనే 220 సంఘాలు ఉండగా, మిగతా వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 216 సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 22వేల మంది పాడి రైతులు ఉన్నారు. జనగామ జిల్లాలోనే అధికంగా 8800 మంది రైతులు ఉన్నారు. రుణాల కోసం పాడి రైతులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో బుధవారం వరకు 13వేల మంది దరఖాస్తులు  చేసుకున్నారు.


జనగామ జిల్లాలో  అత్యధికంగా 8వేల మంది సమర్పించగా, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 1300 మంది, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 1800 మంది, మహబూబాబాద్‌ జిల్లాలో 1200 మంది, ములుగు జిల్లాలో 300 మంది, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 400 మంది దాఖలు చేశారు. విజయ డెయిరీ అధికారులు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ధరఖాస్తుల దాఖలుకు జూలై 31 చివరి తేదీ. కాగా, ఇంకా ఎక్కువ మంది పాడి రైతులు ఈ రుణ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు వీలుగా గడువును కేంద్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించినట్టు తెలిసింది. దీంతో పాడి రుణాల కోసం దరఖాస్తులు చేసుకునేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పాడి రైతులు రుణం కోసం దరఖాస్తుతో పాటు ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, పట్టాదారు పాస్‌ పుస్తకం,  రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫోటోలు సమర్పించాల్సి ఉంటుంది.  


రుణసదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి..ప్రదీప్‌, డిప్యూటీ డైరెక్టర్‌ విజయ డైయిరీ, వరంగల్‌

ఆత్మ నిర్బర్‌ భారత్‌ కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా ఇవ్వనున్న రుణ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పాడి రైతులు పెద్ద సంఖ్యలో ముందుకువచ్చారు. సుమారు 13వేల  మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారు. వీటిని  పరిశీలించి  అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పెట్టాం. రుణాల  మంజూరీకి జనగామ మినహా మిగతా జిల్లా నుంచి అందిన సుమారు 5వేల దరఖాస్తులను సంబంధిత బ్యాంకులకు పంపించాం. 

Updated Date - 2020-08-07T06:19:25+05:30 IST