కౌలు రైతులను పట్టించుకోని ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-07-07T04:53:49+05:30 IST

సొంత భూములు లేక కౌలుపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులను ప్రభుత్వం గుర్తించడం లేదు. పంటసాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం నుంచి సహకారం అందక, పండించిన పంట అధికారికంగా అమ్ముకోలేక నానా ఇబ్బం దులు పడుతున్నారు.

కౌలు రైతులను పట్టించుకోని ప్రభుత్వం
దుక్కి దున్నుతున్న కౌలు రైతు

- ఏళ్లుగా ఇదే పరిస్థితి

- అందని ప్రభుత్వ సాయం

- పంటలు అమ్ముకోవడానికీ ఇబ్బందే

- అప్పులివ్వని బ్యాంకులు.. వ్యాపారులే దిక్కు

చింతలమానేపల్లి, జూలై 6: సొంత భూములు లేక కౌలుపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులను ప్రభుత్వం గుర్తించడం లేదు. పంటసాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం నుంచి సహకారం అందక, పండించిన పంట అధికారికంగా అమ్ముకోలేక నానా ఇబ్బం దులు పడుతున్నారు. భూ యజమానులకు మాత్రతం ముందుగానే చేతికి అందుతోంది. కష్టపడి పనిచేసే రైతులకు ఎక్కడా సహాయం అందడం లేదు. వ్యవసాయమే తప్ప ఇతర పని చేయలేని కౌలు రైతులు ఏడాదంతా కష్టపడి పండించిన పంట తీసుకున్న అప్పులు, వాటి వడ్డీకే సరిపోతోంది.

జిల్లాలో 20వేల పైగా కౌలు రైతులు

జిల్లాలో 20వేలపైగా కౌలు రైతులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర రంగాలకు చెందిన వారికి వ్యవసాయం చేసే ఆసక్తి లేకపోవడంతో పాటు సాగు కష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు లేక తమ భూములను కౌలుకు ఇచ్చేస్తుంటారు. ప్రభుత్వం ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు విడతలుగా అందిస్తున్న రైతు బంధు సాయం పట్టాదారైన రైతుల ఖాతాల్లోనే జమ అవుతోంది. పంటను సాగు చేసిన కౌలు రైతు పేరు ఎక్కడా లేకుండా పోయింది. ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధులో కౌలు రైతు ఊసే లేకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పంటలు సాగు చేసి ఎరువులు, కలుపు తీయాల్సిన పరిస్థితుల్లో పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకులు సైతం కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. గతంలో కౌలు రైతులకు రుణ అర్హత కల్గిన కార్డులను జారీ చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా భూములన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేసింది. కొత్తగా జారీ చేసిన డిజిటల్‌ పాస్‌ పుస్తకాల్లో పట్టాదారు పేరు మినహా ఇతర కాలం ఎక్కడా లేదు. దీంతో కౌలు రైతులకు శాశ్వతంగా అడ్డుకట్టపడింది. 

పెరుగుతున్న పెట్టుబడులు

రోజురోజుకూ పంట పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఒక ఎకరంలో పత్తి పంట వేయాలంటే రూ.20వేలు, వరి పొలానికి రూ. 20నుంచి 25 వేలు, మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేయాలంటే రూ. 20వేల వరకు ఖర్చు అవుతోంది. కౌలు డబ్బులు కాకుండా రైతు కుటుంబ సభ్యుల కష్టం పోనూ ఎరువులు, విత్తనాలకు అధికంగా  పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఎంత కష్టపడినప్పటికీ ఎకరానికి రూ. 10వేల నుంచి 15వేలు కూడా మిగిలే పరిస్థితి లేదు. ఈ వానాకాలం సీజన్‌లో అయినా కౌలు రైతులను గుర్తించి అర్హత కార్డులు ఇచ్చి ప్రభుత్వం బ్యాంకు రుణాలు అందించేలా చూడాలని కౌలు రైతులు కోరుతున్నారు. 

అమ్ముకోవడానికి సైతం తిప్పలు

కౌలు రైతులకు పంట అమ్ముకోవడానికీ తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం ప్రతీ సీజన్‌లో ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటలు సాగు చేస్తున్నారు. అనే వివరాలను వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. అధికారులు సైతం పట్టా పాసు పుస్తకం ఉన్న రైతుల వివరాలను మాత్రమే ఆన్‌లైన్‌ చేస్తున్నారు. తమకు రైతు బంధు సాయం ఎక్కడ రాదో అన్న భయంతో పంట సాగు చేయ కుండా పట్టా పాసు పుస్తకం ఉన్న భూ యజమానులు సైతం కౌలు రైతు పంటను తమపేరున నమోదు చేసుకుంటున్నారు. వివరాలు అన్ని భూ యజమాని పేరిట ఉండడంతో కౌలు రైతు పండించిన పంట విక్రయించే సమయానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కౌలు రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలు, సీసీఐ కేంద్రాల వద్ద విక్రయించేటప్పుడు భూయజమాని వివరాలు ముందస్తుగా ఉండడంతో వారి ఖాతాల్లో పంట విక్రయానికి సంబంధించి సొమ్ము జమ అవుతోంది. తిరిగి వారి ఖాతాల్లో నుంచి తీసుకోవడానికి  నానా అవస్థలు పడాల్సి వస్తోంది. దీంతో కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం జరిగినా పరిహారం సైతం కౌలుకు ఇచ్చిన భూ యజమానికే వర్తిస్తుందని కౌలు రైతులు చెబుతున్నారు. 

కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

- సమ్మయ్య, కౌలు రైతు

కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. పండిన పంటను విక్రయించాలన్నా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బ్యాంకులు సైతం రుణాలు ఇవ్వడం లేదు. ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు మంజూరు చేసి కౌలు రైతులను ఆదుకోవాలి.

Updated Date - 2022-07-07T04:53:49+05:30 IST