Uttar Pradesh : ఒసామా బిన్ లాడెన్ ఫొటో పెట్టిన అధికారి సస్పెన్షన్

ABN , First Publish Date - 2022-06-02T21:25:21+05:30 IST

అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ఫొటోను

Uttar Pradesh : ఒసామా బిన్ లాడెన్ ఫొటో పెట్టిన అధికారి సస్పెన్షన్

లక్నో : అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయంలో పెట్టి, ఆ ఉగ్రవాదిని గొప్ప ఇంజినీరు అని పొగిడిన ప్రభుత్వాధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ అధికారిపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయంలో లాడెన్ ఫొటో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఉన్నతాధికారులు ఈ చర్యలను చేపట్టారు. 


ఓ వార్తా సంస్థ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం, ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూకాబాధ్‌లో ఉన్న దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్‌లో సబ్ డివిజినల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ తన కార్యాలయంలో ఒసామా బిన్ లాడెన్ ఫొటోను పెట్టారు. దాని క్రింద ‘‘గౌరవనీయ ఒసామా బిన్ లాడెన్, ప్రపంచపు అత్యుత్తమ జూనియర్ ఇంజినీరు’’ అని రాశారు. 


లాడెన్ ఫొటో ప్రభుత్వ కార్యాలయంలో ఉందనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో ఉన్నతాధికారులు స్పందించారు. గౌతమ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేయడంతోపాటు లాడెన్ ఫొటోను తొలగించారు. 


ఫరూకాబాద్ జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ సింగ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగం లిమిటెడ్‌‌లో ఎస్‌డీవోగా పని చేస్తున్న రవీంద్ర ప్రకాశ్ గౌతమ్‌ను ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సస్పెండ్ చేసినట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి దర్యాప్తు నివేదికను పంపిస్తామన్నారు. 


ఇదిలావుండగా, సస్పెన్షన్‌కు గురైనప్పటికీ గౌతమ్‌లో మార్పు రాలేదు. ఒసామా బిన్ లాడెన్ ప్రపంచంలో అత్యుత్తమ జూనియర్ ఇంజినీరు అని మరోసారి చెప్పారు. కార్యాలయం నుంచి లాడెన్ ఫొటోను తొలగించినప్పటికీ, తన వద్ద చాలా కాపీలు ఉన్నాయన్నారు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన అంశాల ప్రకారం గౌతమ్ ఓ పుస్తకాన్ని చదివిన తర్వాత ఈ విధంగా వ్యవహరించినట్లు తెలిసింది. 


Updated Date - 2022-06-02T21:25:21+05:30 IST