తిరుమల, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఏనుగుల గుంపు సంచారం మరోసారి కలకలం సృష్టించింది. ఈ నెల్లోనే మొదటి ఘాట్‌లోని ఏడో మైలు వద్ద ఏనుగుల సంచారం పలుమార్లు టీటీడీ అధికారులను నిద్రలేకుండా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం రాత్రి సుమారు ఏడు ఏనుగుల గుంపు పాపవినాశన మార్గంలో పార్వేటమండపం వద్ద సంచరించినట్టు కొందరు టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. సాయంత్రం తర్వాత ఈ మార్గంలో భక్తులకు అనుమతి లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయినప్పటికీ ఏనుగులు తిరుమలవైపునకు రాకుండా అడవిలోకి తరిమేలా శబ్దాలు చేశారు. అలాగే ఎలాంటి వాహనాలు ఆ మార్గంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.