మంగళూరు మసీదు క్రింద హిందూ దేవాలయం వంటి నిర్మాణం

ABN , First Publish Date - 2022-04-22T18:14:34+05:30 IST

కర్ణాటకలోని మంగళూరు శివారు ప్రాంతంలో ఓ మసీదు

మంగళూరు మసీదు క్రింద హిందూ దేవాలయం వంటి నిర్మాణం

బెంగళూరు : కర్ణాటకలోని మంగళూరు శివారు ప్రాంతంలో ఓ మసీదు క్రింద హిందూ దేవాలయం వంటి ఆర్కిటెక్చరల్ డిజైన్ కనిపించినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. గంజిమఠ్ గ్రామ పంచాయతీ పరిధిలోని మలాలీ మార్కెట్ మసీదు ప్రాంగణంలో దీనిని గుర్తించినట్లు తెలిపింది. జుమా మసీదు ఆధునికీకరణ పనులు జరుగుతుండగా గురువారం (ఏప్రిల్ 21) మధ్యాహ్నం ఇది కనిపించినట్లు తెలిపింది. 


మసీదులోని కొంత భాగం కూలిపోవడంతో ఆధునికీకరణ పనులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ హిందూ దేవాలయం వంటి గుర్తులు కనిపించడంతో హిందూ సంఘాలు రంగంలోకి దిగాయి. ఇక్కడ దేవాలయం ఉండేదేమోననే అనుమానం వ్యక్తం చేశాయి. దస్తావేజులను పరిశీలించాలని అధికారులను హిందూ సంఘాలు, మరికొందరు కోరారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులు ఈ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. 


ఈ మసీదు ప్రదేశానికి సంబంధించిన దస్తావేజులను పరిశీలించే వరకు ఆధునికీకరణ పనులను నిలిపేయాలని అధికారులను విశ్వహిందూ పరిషత్ నేతలు కోరారు. తదుపరి ఆదేశాలను జారీ చేసే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని దక్షిణ కన్నడ కమిషనరేట్ ఆదేశించింది. భూమి రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. రికార్డుల తనిఖీ పూర్తయ్యే వరకు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరారు. 


దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర మాట్లాడుతూ, ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం తనకు అందిందని చెప్పారు. పాత భూమి రికార్డులను జిల్లా పరిపాలనా యంత్రాంగం పరిశీలిస్తోందని చెప్పారు. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్, వక్ఫ్ బోర్డు రిపోర్టులను కూడా పరిశీలిస్తామన్నారు. అతి త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 


Updated Date - 2022-04-22T18:14:34+05:30 IST