అక్కడ లావుగా ఉన్న వాళ్లను అద్దెకిస్తారట.. ఎందుకో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2021-06-13T02:37:07+05:30 IST

లావుగా ఉన్న వ్యక్తులు శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా ఎంతో బాధపడుతుంటారు.

అక్కడ లావుగా ఉన్న వాళ్లను అద్దెకిస్తారట.. ఎందుకో తెలిస్తే షాక్!

లావుగా ఉన్న వ్యక్తులు శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా ఎంతో బాధపడుతుంటారు. తమ శరీరాన్ని చూసి ఆత్మన్యూనతకు గురవుతుంటారు. అలాంటి భావనను దూరం చేసుకోవాలంటే లావుగా ఉన్న వాళ్లు ఏం చేయాలి? తన కంటే లావుగా ఉన్న వాళ్ల పక్కన నిల్చోవాలి. పెద్ద గీత పక్కన అంత కంటే పెద్ద గీత గీస్తే.. మొదటిది చిన్నది అయిపోతుంది కదా. అదే ఫార్ములాను జపాన్‌కు చెందిన బ్లిస్ అనే వ్యక్తి ఉపయోగించాడు. `దెబుకారీ` పేరుతో సంస్థను స్థాపించి ఊబకాయులను అద్దెకిస్తున్నాడు.


కాస్త లావుగా ఉండే వ్యక్తులు ఎవరైనా ఫంక్షన్‌కో, మీటింగ్‌కో, షాపింగ్‌కో వెళుతున్నప్పుడు తమతో పాటు ఈ సంస్థ పంపిన ఊబకాయులను తెసుకెళితే చాలు. వారిలో అత్మన్యూనతా భావం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే బరువు తగ్గించే ఫిట్‌నెస్ సంస్థలు, న్యూట్రిషన్ సంస్థలు, జిమ్ సెంటర్లు తమ ప్రకటనల కోసం ఈ ఊబకాయులను వాడుకోవచ్చు. అలాగే లావుగా ఉన్న బంధువులెవరికైనా దుస్తులు తీసుకోవాలనుకుంటే వీరిని షాపింగ్‌కు తీసుకెళ్లవచ్చు. వీరి అద్దె గంటకు 200 జపాన్ యెన్లు (1315 రూపాయలు) మాత్రమే. 


నిజానికి బ్లిస్ మొదట లావుగా ఉండే వారి కోసం `క్యూ జిల్లా` పేరుతో 2017లో ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించాడు. అయితే ప్రకటన కోసం లావుగా ఉండే మోడ్సల్ కోసం వెతికితే ఎవరూ దొరకలేదట. దీంతో తన కస్టమర్లలోనే లావుగా ఉండే వారితో ట్యాలెంట్ హంట్ నిర్వహించి కొందరిని ఎంపిక చేశాడు. అనంతరం అతనికో వినూత్న ఆలోచన వచ్చింది. లావుగా ఉండే వారిని అద్దెకిస్తే ఎలా ఉంటుందనేదే ఆ ఐడియా. 


`దెబుకారీ` సంస్థను ప్రారంభించి 100 కేజీల బరువు దాటిన అమ్మాయిలను, అబ్బాయిలను ఉద్యోగులుగా తీసుకున్నాడు. అద్దె పూర్తిగా ఉద్యోగికే చెందుతుంది. సంస్థ కేవలం కన్సల్టేషన్ ఫీజు మాత్రమే తీసుకుంటుంది. ఇప్పటికే ఈ సంస్థకు జపాన్‌లో టోక్యో, ఒసాకా, అయిచీ వంటి నగరాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయి. నిజానికి మనుషులను అద్దెకిచ్చే కంపెనీలు జపాన్‌లో ఎప్పట్నుంచో ఉన్నాయి. అయితే అలాంటి అవకాశాలు ఆకర్షణీయంగా, నాజూకుగా ఉన్నవారికే వస్తాయి. తాజాగా బ్లిస్ ఆ సంప్రదాయాన్ని మార్చి ఊబకాయులకు కూడా అవకాశాలిచ్చాడు. 

Updated Date - 2021-06-13T02:37:07+05:30 IST