రాజ్యాంగ స్ఫూర్తి కొరవడిన పయనం

ABN , First Publish Date - 2022-08-14T05:52:39+05:30 IST

స్వాతంత్ర్య వజ్రోత్సవాలు, స్వాతంత్ర్యానంతర భారతదేశ ప్రగతిని విమర్శనాత్మకంగా పరిశీలించడానికి, అనుభవం మంచి నేర్చుకోవడానికి, ఉపయోగకర అంశాలను గుర్తించి...

రాజ్యాంగ స్ఫూర్తి కొరవడిన పయనం

స్వాతంత్ర్య వజ్రోత్సవాలు, స్వాతంత్ర్యానంతర భారతదేశ ప్రగతిని విమర్శనాత్మకంగా పరిశీలించడానికి, అనుభవం మంచి నేర్చుకోవడానికి, ఉపయోగకర అంశాలను గుర్తించి ముందుకెళ్లడానికి మంచి అవకాశం. ఈ విశ్లేషణకు సరిఅయిన ప్రమాణాలు ఉండాలి. విమర్శను దేశద్రోహంగా భావించే నేటి స్థితిలో విమర్శనాత్మక పరిశీలన కొరవడుతోంది. తన్నుతాను విమర్శనాత్మకంగా పరిశీలించుకునే శక్తిని కోల్పోయిన వ్యక్తులు కాని, సమాజం కాని ముందుకు పోవడం సాధ్యం కాదు. ఈ కారణంగానయినా ఈ వజ్రోత్సవ సందర్భాన్ని దేశ గొప్పతనాన్ని గుర్తించడం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారందరిని స్మరించుకోవడంతో పాటు, మన దేశ సామాజిక నిర్మాణంలో, సాధించిన ప్రగతిలో మంచి, చెడూ ఉన్నాయని గుర్తిస్తూ, మంచిని ఎలా పెంచాలనే దానిపై దృష్టి పెట్టాలి. మంచికి అంతా తామే కారణమని, చెడుకు ప్రత్యర్థులు కారణమనే రాజకీయ నాయకుల పాక్షిక దృక్పథాలను విస్మరించి, స్వాతంత్ర్యానంతర ప్రగతి పథాన్ని దాని స్థూల లక్షణాలను చారిత్రక స్పృహతో విశ్లేషించుకోవాలి.


దేశభక్తి ప్రదర్శనలలో పోటీకంటే (రాజకీయ పార్టీలకు ఇది అవసం కావచ్చు) ప్రగతిపథ విశ్లేషణ కృషి అభినందనీయం. ఈ పరిశీలన ఏ దృష్టితో చేస్తున్నామనేది ముఖ్యం. స్వాతంత్ర్యానంతర భారతదేశం ఏవిధంగా ఉండాలని మనం కాంక్షించాం, నేడు ఏవిధంగా ఉంది అనేది ప్రమాణంగా మన ప్రగతిని పరిశీలించాలి. అంబేడ్కర్‌ చెప్పినట్లుగా న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రమాణాలుగా నూతన సమాజాన్ని నిర్మించడం స్వతంత్ర భారతదేశ లక్ష్యాలుగా మన రాజ్యాంగం నిర్దేశించింది. గడచిన 75 సంవత్సరాలలో ఈ లక్ష్యాల దిశగా ఎంతవరకు పయనించాం, ఆ పయనంలో ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న సమస్యలేమిటి, వాటిని ఎట్లా అధిగమించాలి అనే విశ్లేషణ ఈ వజ్రోత్సవాలను దేశభక్తియుతంగా జరుపుకోవటంలో భాగం కావాలి. వాస్తవ పరిస్థితుల ఆధారంగా చారిత్రక, తులనాత్మక విశ్లేషణ ఉండాలి. పాక్షిక రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ప్రభుత్వ లెక్కల ఆధారంగానో, రాజకీయ నాయకుల, అధికారంలో ఉన్న ప్రభుత్వాల ప్రకటనతో మాత్రమే ఆర్థిక, రాజకీయ పరిణామ క్రమాలను అంచనా వేయలేము. ఆచరణ, వాస్తవాలు ఆధారంగా పరిశీలన జరగాలి.


నాకున్న కొద్దిపాటి అనుభవంతో విద్యారంగాన్ని ఏవిధంగా విశ్లేషించాలో కొంత వివరిస్తాను. గత 75 సంవత్సరాలలో మనం నిస్సందేహంగా విద్యారంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించాం. సంఖ్యరీత్యా, అవకాశలరీత్యా ఎంతో పెరుగుదల ఉంది. నాణ్యత, ప్రమాణాలను ఎంతవరకు కాపాడుకోగలిగామో ఆలోచించాలి. అందరికి సమాన అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఆలోచించాలి. 2020 జూలైలో జాతీయ విద్యావిధానాన్ని (ఎన్‌ఇపి–2020) కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ఈ విధానాన్ని రాజ్యాంగ స్ఫూర్తితో విశ్లేషించాలి. ఆ విధానపత్రాన్ని చదివితే నాకు పెద్దగా అభ్యంతరాలు కనిపించలేదు. కాని అక్కడితో ఆగిపోవడం సరిఅయిన విశ్లేషణ కాదు. విధానం ఆచరణలో అమలవుతున్న తీరును పరిశీలించి అంచనా వేయాలి. విధాన పత్రంలో ఎన్నో ఆదర్శాలను పేర్కొన్నారు. విద్యా వ్యవస్థల లక్ష్యం సమసమాజ నిర్మాణం, విద్యార్థుల సంపూర్ణ వికాసం అని, విద్య సామాజిక సంపద అని, విద్య వ్యాపారీకరణ అనంగీకారమని, విద్యను ‘భారతీయీకరణ’ చేయాలని, మన సంప్రదాయ విజ్ఞానాన్ని గౌరవించి, ఉపయోగించుకోవాలని, విధాన పత్రంలో పేర్కొన్నారు. పెద్దగా విభేదించాల్సిన అంశాలు వీటిలో లేవు. గత కొన్ని సంవత్సరాల అనుభవాన్ని పరిశీలిస్తే ఈ విధాన పత్రంలో చెప్పినవన్నీ ఆచరిస్తారా అనేది అనుమానమే. వ్యాపారీకరణ పెరుగుతోంది. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల సంఖ్య నాలుగు వందలకు చేరింది. భారతీయ భాషల అభివృద్ధి హిందీ, సంస్కృత భాషల అభివృద్ధికే పరిమితమయింది. విద్యార్థుల సంపూర్ణ వికాసం, నైపుణ్యాల అభివృద్ధికే పరిమితమయింది. విధాన పత్రంలో భారతీయతను నిర్వచించలేదు. ప్రాచీన భారతీయ విజ్ఞాన భావనలో స్పష్టతలేదు. భారతీయత, ప్రాచీన భారతీయ విజ్ఞానం పేరుతో అగ్రవర్ణ భావజాలాన్ని ప్రోత్సహించే ప్రమాదాన్ని గుర్తించాలి. విద్యారంగంలో మార్పులను నిశితంగా పరిశీలిస్తున్న అనేక మంది ఈ రంగంలో పెరుగుతున్న అసమానతలను గూర్చి, విశ్వవిద్యాలయాల్లో స్వేచ్ఛాయుత వాతావరణం లేకపోవడాన్ని గూర్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆచరణకూ, చెప్పేదానికి ఎంత తేడా ఉందో విద్యారంగ స్థితిగతులు ఒక ఉదాహరణ. ఈ స్థితిగతులే మనకు అన్ని రంగాలలో కన్పిస్తాయి.


స్వాతంత్ర్యానంతర రాజకీయ పరిణామక్రమంలో నేడు మనమొక విచిత్ర స్థితిలో ఉన్నాం. ప్రతి రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యానికి నిబద్ధమైనట్లు అవినీతి రహిత పాలన తమ లక్ష్యమైనట్లు ప్రకటిస్తున్నాయి. ఇది ఒకవిధంగా ప్రజాస్వామ్య ప్రస్థానంలో గుర్తించదగ్గ విజయమే. అయితే ఆచరణలో అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య విలువలను మరిచిపోతున్నారు. రాజ్యాధికారంతో నియంతృత్వపోకడలు ఎక్కువవుతున్నాయి. మళ్లీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడే వారికి ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుంది. రాజకీయ పార్టీల ఈ ద్వంద్వ స్వభావానికి మన సామాజిక వ్యవస్థలో ఉన్న ఆధారాలేమిటో తెలుసుకోవాలి. గున్నార్‌ మిర్థాల్‌ 1960లోనే తన పుస్తకం Asian Dramaలో మన సమాజంలోని హిపోక్రసీకి ఉన్న మూలాలను గురించి విశ్లేషించాడు. గత 75 సంవత్సరాలుగా రాజకీయ రంగంలో ఈ హిపోక్రసి విషవృక్షంగా పెరిగి ప్రజలను రాజకీయంగా అయోమయానికి గురిచేస్తోంది. నేను ఢిల్లీలో ఇందిరాగాంధీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు మిత్రులు ఢిల్లీ రోడ్ల మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించేవారు. ఎందుకంటే ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ బస్సులు Left Indication చూపిస్తూ రైట్‌ టర్న్‌ తీసుకుంటాయని జోక్‌ చేస్తుండేవారు. ఇది మన రాజకీయ పార్టీలకు చాలావరకు వర్తిస్తుంది. రాజకీయ నాయకులు చెప్పేదానిని వారు అధికారంలోకి వచ్చినప్పుడు ఆచరించే విధంగా చేయడమెట్లా అనేది నేడు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది. వ్యక్తి శ్రేయస్సుకు, సమాజ ప్రగతికి మన ఆలోచనలకు, చెప్పే మాటలకు, ఆచరించే చర్యలకు అవినాభావ సంబంధం ఉండాలని మహాత్మాగాంధీ ఏనాడో చెప్పారు. మనం మహాత్మాగాంధీని ఏనాడో మరిచిపోయాంకద. స్వాతంత్ర్య రజతోత్సవాలలో ఎందరో మహనీయులను స్మరించుకుంటున్నాం. సంతోషించాల్సిన విషయమే. కాని వారి ఆశయాలను, విలువలను పాటించలేకపోతున్నాం. పార్లమెంటు భవనాన్ని ముద్దుపెట్టుకుంటున్నాం. పార్లమెంటరీ సంప్రదాయాలను గౌరవించలేకపోతున్నాం. జాతీయ జెండాలను ఎగరేసుకుంటున్నాం. జాతీయ జెండా విలువలను గుర్తించలేకపోతున్నాం. అహింసాయుతంగా స్వాతంత్ర్యాన్ని సిద్ధించుకున్నాం అని గర్విస్తున్నాం. అదే సందర్భంలో దేశ విభజన జరిగిందని, అనేక వేలమంది మతఘర్షణలలో చనిపోయారనే విషయాలను మరిచిపోతున్నాం. ఈ 75 సంవత్సరాలలో ఏ సామాజిక పరిస్థితులు, మార్పులు నేటి సామాజిక స్థితిగతులకు కారణమయ్యాయో, వాటిని ఎట్లా మనం ఆశించే నూతన సమాజ నిర్మాణానికి అవసరం అయ్యేవిధంగా మార్చుకోవాలో చర్చించుకోవడానికి, విశ్లేషించుకోవడానికి స్వాతంత్ర్య వజ్రోత్సవాలు తోడ్పడతాయని ఆశిద్దాం.

వి.యస్‌. ప్రసాద్‌

సామాజిక శాస్త్రవేత్త

Updated Date - 2022-08-14T05:52:39+05:30 IST