ఒక్క అబద్ధంతో 6రోజులు లాక్‌డౌన్.. నిజం తెలియడంతో..

ABN , First Publish Date - 2020-11-21T00:12:11+05:30 IST

ఒకే ఒక్క అబద్దం కారణంగా ఆ రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్ విధించాల్సి వచ్చింది. ప్రజలంతా భయంతో వణికిపోయారు.

ఒక్క అబద్ధంతో 6రోజులు లాక్‌డౌన్.. నిజం తెలియడంతో..

ఇంటర్నెట్ డెస్క్: ఒకే ఒక్క అబద్దం కారణంగా ఆ రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్ విధించాల్సి వచ్చింది. ప్రజలంతా భయంతో వణికిపోయారు. ఇళ్లలోంచి ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వ అధికారులు ప్రకటనలు చేశారు. షాపులు మూసేశారు. ఆ ప్రాంతం మొత్తం కలకలం రేగింది. ఇదంతా ఆస్ట్రేలియాలోని సౌత్ ఆస్ట్రేలియా స్టేట్‌లో జరిగింది. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ఇంత కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయలేదు. కానీ ఓ వ్యక్తి చెప్పిన అబద్ధం కారణంగా అలా చేయాల్సి వచ్చింది


సౌత్ ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతన్ని ఎవరెవరు కలిశారో తెలుసుకోవడానికి అధికారులు వెళ్లారు. వారందర్ని కూడా ఐసోలేషన్‌లో ఉంచాలని అధికారులు భావించారు. అతనికి కరోనా ఎలా సోకిందా? అని ఆరా తీసే క్రమంలో ఓ పిజ్జా షాపు పేరు బయటకు వచ్చింది. తాను పిజ్జా కొనుక్కోవడానికి దగ్గరలోని ఓ షాపుకు వెళ్లానని ఆ వ్యక్తి చెప్పాడు. అయితే అప్పటికే అక్కడ పనిచేస్తున్న ఓ వ్యక్తికి కరోనా సోకి ఉంది. దీంతో ఒక్కసారి షాపుకు వెళ్తేనే కరోనా సోకిందంటే.. ఈ మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తోందని అధికారులు ఆందోళన చెందారు.



ఈ విషయం తెలుసుకున్న అక్కడి ప్రభుత్వం వెంటనే లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించుకుంది. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తోందని, కావున ఎవరూ బయటకు వచ్చి వైరస్ బారిన పడొద్దని హెచ్చరికలు జారీ చేసింది. అయితే చివరికి తేలిందేంటంటే.. అధికారులతో మాట్లాడిన వ్యక్తి అబద్ధం చెప్పాడు. అతను పిజ్జా కొనుక్కోవడానికి ఒక్కసారి వెళ్లానన్న షాపులోనే అతను కూడా పనిచేస్తున్నాడు. అంటే కరోనా సోకిన కొలీగ్‌తో చాలా రోజులుగా పని చేయడం వల్లే అతనికి కరోనా సోకింది.




ఈ విషయాన్ని సదరు బాధితుడు దాచి పెట్టి అబద్ధమాడాడు. దీన్ని నమ్మేసిన అధికారులు వైరస్ తీవ్రత ఎక్కువైపోయిందని వణికిపోయారు. అసలు విషయం తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. దీనిపై సౌత్ ఆస్ట్రేలియా ప్రీమియర్ స్టీవెన్ మార్షల్ మాట్లాడుతూ.. ‘నాకు అతనిపై ఉన్న కోపాన్ని.. కోపం అంటే సరిపోదు. అంత పిచ్చి కోపం ఉంది’ అని చెప్పారు. సదరు బాధితుడు చెప్పిన మాటలు ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉన్నాయని, దాంతో అనుమానం వచ్చిన ట్రేసింగ్ టీమ్ దర్యాప్తు చేసిందని అధికారులు చెప్పారు. ఈ దర్యాప్తులోనే అసలు విషయం బయటపడింది.


ఇలా అబద్ధం చెప్పి సమాజంలో భయాందోళనలకు కారణమైన అతనికి ఎటువంటి శిక్ష వేస్తారని అధికారులను ప్రశ్నిస్తే.. వాళ్లు మాత్రం పెదవి విరుస్తున్నారు. ప్రస్తుత చట్టాల ప్రకారం ఇలా కరోనా విషయంలో అబద్ధాలు ఆడే వారికి ఎటువంటి శిక్షా లేదని, కానీ ఈ అంశాన్ని పునఃపరిశీలించి కొత్త చట్టం చేసే అవసరం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. కరోనా సోకిన వ్యక్తి నిజం చెప్తే అసలు ఇంత గొడవ ఉండేదే కాదని చెప్పారు. లాక్‌డౌన్‌ను త్వరగా ముగిస్తామని, షాపులు గట్రా తెరుచుకోవడానికి అనుమతులు కూడా ఇస్తామని ప్రకటించారు. అనవసరంగా ఆరురోజుల పాటు లాక్‌డౌన్ విధించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

Updated Date - 2020-11-21T00:12:11+05:30 IST