పెట్రో మంట

ABN , First Publish Date - 2021-07-25T06:15:55+05:30 IST

జిల్లాలో వివిధ చమురు సంస్థల పెట్రో బంకులు 280 వరకు ఉన్నాయి. ఒక్కో బంకులో రోజుకు సగటున పెట్రోలు 1,500 లీటర్లు, డీజిల్‌ 2,000 - 2,500 లీటర్ల వరకు అమ్ముతున్నారు. ఈ లెక్కన జిల్లాలో రోజుకు 4.20 లక్షల లీటర్లకు పైగా పెట్రోలు, 5.50 - 7 లక్షల లీటర్ల

పెట్రో మంట
పెట్రోలు పోయించుకుంటున్న వినియోగదారులు

లీటరు పెట్రోల్‌ రూ.107.03-107.96

డీజిల్‌ రూ.98.14-99.25

పైపైకి పెట్రో ధరలు

రవాణా రంగంపై తీవ్ర ప్రభావం

చుక్కలు తాకుతున్న నిత్యవసర సరుకుల ధరలు

సామాన్యులు గగ్గోలు


పెట్రో ధరల మంటలో సామాన్యులు బుగ్గి అవుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కులు తాకాయి. సామాన్య ప్రజలకు నొప్పి తెలియకుండా చమురు సంస్థలు రోజురోజు పైసల రూపంలో పెంచుతున్నాయి. పెట్రోల్‌ లీటరు ధర సెంచరీ దాటితే.. డీజిల్‌ అందుకు చేరువలో ఉంది. శుక్రవారం లీటరు పెట్రోల్‌ రూ.107.10 ఉంటే.. డీజిల్‌ రూ.98.14కు చేరింది. డీజిల్‌ ధరలు పెరగడంతో నిత్యవసర సరుకుల రవాణా ఖర్చు పెరిగి.. ఆ భారం సామాన్యులపై పడుతోంది. నిత్యవసర సరుకుల ధరలు 40 శాతానికి పైగానే పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. కరోనా వల్ల అసలే పనులు లేక తల్లడిల్లుతున్న ప్రజలను ధరలు హడలెత్తిస్తున్నాయి. రాకెట్‌లా దూసుకుపోతున్న పెట్రో ధరలు.. సామాన్య ప్రజల ఇక్కట్లపై ప్రత్యేక కథనం.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ చమురు సంస్థల పెట్రో బంకులు 280 వరకు ఉన్నాయి. ఒక్కో బంకులో రోజుకు సగటున పెట్రోలు 1,500 లీటర్లు, డీజిల్‌ 2,000 - 2,500 లీటర్ల వరకు అమ్ముతున్నారు. ఈ లెక్కన జిల్లాలో రోజుకు 4.20 లక్షల లీటర్లకు పైగా పెట్రోలు, 5.50 - 7 లక్షల లీటర్ల వరకు డీజిల్‌ విక్రయిస్తున్నారు. గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభణకు ముందు లీటరు పెట్రోలు రూ.77.50 ఉంటే.. డీజిల్‌ 71.20 ఉండేది. తాజాగా పెట్రోల్‌ ధర రూ.107.10లకు చేరితే.. డీజిల్‌ రూ.98.14లకు చేరింది. ఇప్పటికే పెట్రోల్‌ సెంచరీ దాటితే.. త్వరలో డీజిల్‌ కూడా సెంచరీ దాటే అవకాశం ఉందని పెట్రో పంపుల డీలర్లు అంటున్నారు.


రెండేళ్లలో రూ.30.52 పెంపు

కడప నరగంలో 2014 జూలై నెలలో లీటరు పెట్రోల్‌ రూ.71.50 ఉండేది. 2019 జూలై నాటికి రూ.76.52లకు చేరింది. అంటే.. ఐదేళ్లలో లీటరుపై రూ.5.02 పెరిగింది. ప్రస్తుతం రూ.107.10లకు చేరింది. 2019 జూలై ధరతో పోలిస్తే ఈ రెండేళ్లలో పెట్రోల్‌ ధర లీటరుపై రూ.30.52 పెరగడం కొసమెరుపు. డీజిల్‌ ధరలదీ అదే పరిస్థితి. 2014 జూలైలో డీజిల్‌ ధర సుమారుగా రూ.55.50 ఉంటే.. 2019 నాటికి రూ.70.83లకు చేరింది. ఈ ఏడాది శుక్రవారం ధర రూ.98.14కు చేరింది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో డీజిల్‌పై రూ.15.33 పెరిగితే.. తాజాగా కేవలం రెండేళ్లలో రూ.27.31 పెరగడంతో ప్రజలు భగ్గుమంటున్నారు. జిల్లాలో రాజంపేట, బద్వేలు, రైల్వేకోడూరు, ప్రొద్దుటూరు, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు.. ఇలా అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇదే ధరలు ఉన్నాయి.


40 శాతానికి పైగా పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు

పెట్రో ధరలు పెరగడంతో లారీ రవాణా బాడుగులూ పెరిగాయి. అది నిత్యవసర సరుకుల ధరలపై తీవ్రప్రభావం చూపుతోంది. రెండేళ్ల క్రితం సనఫ్లవర్‌ వంట నూనె నాణ్యతను బట్టి లీటరు రూ.85-95 ఉంటే.. అదే నూనె నేడు రూ.160-165లకు పైగా విక్రయిస్తున్నారు. అంటే లీటరుపై రూ.70 పెరిగింది. వేరుశనగ నూనె రూ.100-110 నుంచి రూ.180-190లకు చేరింది. కందిపప్పు కిలో రూ.75-85లు ఉంటే.. తాజాగా రూ.120-125లు పైమాటే. ఒక్కటేమిటి ప్రతి నిత్యవసర సరుకు ధరా 40-45 శాతం పెరిగింది. 25 ఏళ్లకుపైగా కిరాణా వ్యాపారం చేస్తున్నానని, గతంలో ఈ స్థాయిలో ధరలు పెరిగిన దాఖలాలు లేవని, 4-5 శాతం పెరిగేవని, రెండేళ్లలో 40 శాతానికిపైగా పెరగడం ఇప్పుడే చూస్తున్నానని కడప నగరానికి చెందిన వ్యాపారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కూరగాయల పరిస్థితి దాదాపు ఇదే. ఏ కూరగాయ కొన్నా కిలో రూ.40-80 పలుకుతోంది. దీనికంతటికీ ప్రధాన కారణం డీజిల్‌ ధరలు పెరుగుదలే అంటున్నారు. అసలే కరోనా వల్ల పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు చుక్కలు తాకిన నిత్యవసరాలు, పెట్రో ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు శూన్యం. 


బైక్‌ అమ్మాలి అనిపిస్తోంది

- పవనకుమార్‌, చిరువ్యాపారి, కడప

పెట్రోలు ధరలు ఆర్థిక మంట పుట్టిస్తోంది. లీటరు రూ.107 దాటింది. ఇంతటితో స్థిరంగా ఉంటుందనే గ్యారెంటీ లేదు. ఈ స్థాయిలో ధరలు పెరగడం ముందెప్పుడూ చూడలేదు. బైక్‌ అమ్మేద్దాం అనిపిస్తోంది. బైక్‌ లేకపోతే పనులు జరగడం లేదు. అత్యవసరమైతేనే బైక్‌ బయటకు తీస్తున్నాం.


ఈ ప్రభుత్వాలు మారాలి

- రాజగోపాల్‌, వ్యాపారి, కడప

పెట్రో ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. కరోనా వల్ల పనులు లేక ఇల్లు గడవడమే కష్టంగా మారింది. సామాన్యుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బైక్‌ నిత్యవసరం అయింది. రోజుకు లీటరు పెట్రోలు కావాలి. అంటే.. రూ.107లకు పైగా ఖర్చు పెట్టాలి. ఈ ప్రభుత్వాలు మారితేనైనా ధరలు దిగివస్తాయేమో..!


పెట్టుబడి పెరిగినా.. కమిషన పెంచలేదు

- రామచంద్రారెడ్డి, పెట్రో పంపు డీలరు, కడప

పెట్రో ధరలు ఈ స్థాయిలో పెరగడం మునుపెన్నడూ లేదు. రెండేళ్ల క్రితం 12 కిలో లీటర్ల పెట్రోల్‌కు రూ.7.50 లక్షల పెట్టుబడి వచ్చేది. ప్రస్తుతం రూ.12 లక్షలకు చేరింది. పెట్టుబడి పెరిగింది. ఆ స్థాయిలో మాకు కమిషన పెంచలేదు. చమురు సంస్థలకు పెట్రో పంపుల అసోసియేషన రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌కృష్ణ ద్వారా లేఖలు రాసినా స్పందన లేదు.


నాడు-నేడు జూలై నెలలో పెట్రో ధరలు సుమారుగా (లీటరు రూ.లల్లో)

--------------------------------------------------------------------------------------

నియోజకవర్గం పెట్రోలు డీజిల్‌

--------------------------------------------------------------------------------------

2014 2019 2021 2014 2019 2021

-------------------------------------------------------------------------------------

కడప 71.50 76.52 107.10 55.50 70.83 98.14

రాజంపేట 72.50 79.00 107.25 56.50 70.85 99.10

బద్వేలు 71.44 78.75 107.75 55.48 69.98 99.18

మైదుకూరు 72.00 79.24 107.28 56.60 70.96 99.25

జమ్మలమడుగు 71.50 76.79 107.66 57.25 70.96 99.25

రైల్వేకోడూరు 70.98 74.34 107.96 57.25 69.18 99.32

రాయచోటి 70.50 74.00 107.41 58.50 68.00 98.86

ప్రొద్దుటూరు 73.60 77.24 107.03 56.50 71.06 98.76

పులివెందుల 72.53 74.20 107.63 62.07 69.13 99.23

----------------------------------------------------------------------------------------


నాడు-నేడు నిత్యవసర సరుకుల ధరలు కిలో రూ.లల్లో

----------------------------------------------------------------

సరుకులు 2019 2021

---------------------------------------------------------------

వంట నూనె(ఎ్‌సఎఫ్‌) 85-95 160-170

వేరుశనగ నూనె 100-110 180-190

కందిపప్పు 80 120

చక్కెర 32 40-45

గోధుమ పిండి 45 55-60

చింతపండు 85-100 160-180

ఉద్దులు 80 120

బెల్లం 35-40 60-65

శనగపిండి 55-60 95-100

ఉప్మారవ్వ 40-45 50-55

ఇడ్లీరవ్వ 30 40-45

Updated Date - 2021-07-25T06:15:55+05:30 IST