రైతు నెత్తిన విత్తన భారం

ABN , First Publish Date - 2022-07-02T06:16:04+05:30 IST

రైతు నెత్తిన విత్తన భారం

రైతు నెత్తిన విత్తన భారం

రాయితీ లేక ప్రైవేటుగా కొనుగోలు

జిల్లాలో ఆరు లక్షల ఎకరాల్లో పంటల సాగు

ఖమ్మం వ్యవసాయం, జూలై 1: వానాకాలం వచ్చేసింది. అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ ఏడాది మరో సమస్య అన్నదాతకు భారంగా మారుతోంది. ఒకవైపు వానాకాలానికి సంబంధించిన పెట్టుబడి సాయం ఇప్పుడిప్పుడే అందుతోంది. దీనికి తోడు ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేసే విత్తనాలకు స్వస్తి పలకడంతో ప్రైవేటు మార్కెట్‌లో వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. తొలకరిలో దుక్కులు దున్ని ఏ క్షణాన్నైనా వర్షాలు కురుస్తాయని వరుణుడిపై ఆశలు పెట్టుకుని రైతులు విత్తనాల కోసం దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. తీరా విత్తనాల ధరలు విని నీరుగారిపోతున్నారు. ధరలు ఆకాశాన్నంటితే సాగుచేసేదెలా అంటూ ఆందోళన చెందుతున్నారు. 


ఇష్టారాజ్యంగా ధరలు..

విత్తనాలు, ఎరువుల ధరలను వ్యాపారులు ఇష్టారాజ్యంగా పెంచేశారు. జిల్లా కేంద్రంతోపాటు మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారులు విత్తన సంచుల మీద ముద్రిత గరిష్ఠ చిల్లర ధరకు మించి ఎక్కువకు విక్రయిస్తున్నారు. అదేమని ఎవరైనా ప్రశ్నిేస్త విత్తనాల కొరత ఉందని, రెండు రోజులైతే ఇవీ కూడా దొరకవని బలవంతంగా కొనిపిస్తున్నారు. ఈసారి పత్తి విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినా విత్తన ధరలు పెరగడంతో కొనబోతే కొరివిలా మారిందని రైతులు భయపడుతున్నారు. అర కిలో పత్తి విత్తనాల సంచి ధర రూ.810 చొప్పున విక్రయించాల్సి ఉండగా వ్యాపారులు రూ.100 నుంచి రూ.150 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. వానాకాలంలో ప్రధానంగా బీపీటీ రకం వరిని ఎక్కువగా సాగుచేస్తారు. వీటి ధర పాతిక కిలోల సంచి మీద రూ.15 వరకు పెంచారు. మొక్కజొన్న, కంది, ఇతర పంటల విత్తనాలదీ అదే పరిస్థితి. ఇదిలా ఉంటే వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన విత్తనాలు కాకుండా తమ వద్ద ఉన్న విత్తనాలే వ్యాపారులు అంటగడుతుండడంతో రైతులు రెండు విధాలా నష్టపోతున్నారు.


ఆరు లక్షల ఎకరాల్లో పంటల సాగు 

ఖమ్మం జిల్లాలో మొత్తం 6లక్షల 23వేల 749 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయడానికి విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. వరి విత్తనాలు 64,500 క్వింటాళ్లు, మొక్కజొన్న 400క్వింటాళ్లు, 8లక్షల వరకు పత్తి విత్తన ప్యాకెట్లు, 2వేల క్వింటాళ్ల పెసర, 2వేల క్వింటాళ్ల కంది, 100 క్వింటాళ్ల మిరప విత్తనాలు సిద్ధం చేశారు.  

Updated Date - 2022-07-02T06:16:04+05:30 IST