జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ కోర్టు ఆదేశాలు

ABN , First Publish Date - 2022-04-20T21:54:11+05:30 IST

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు

జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ కోర్టు ఆదేశాలు

లండన్ : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు అధికారిక ఆదేశాలను బ్రిటన్ కోర్టు బుధవారం జారీ చేసింది. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాలకు సంబంధించిన రహస్య పత్రాలను బహిరంగంగా వెల్లడించి, ప్రచురించినందుకు విచారణను అమెరికాలో ఎదుర్కొనేందుకు వీలుగా ఆయనను ఆ దేశానికి అప్పగించాలని ఆదేశించింది. 


బ్రిటన్ ఇంటీరియర్ మినిస్టర్ ప్రీతి పటేల్ ఈ ఆదేశాలపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఆమె ఆయనను అమెరికాకు అప్పగించేందుకు ఆమోదం తెలిపినప్పటికీ, ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టుకు అపీలు చేసే అవకాశం ఉంటుంది. 


అసాంజే అప్పగింత కోసం బ్రిటన్ కోర్టుల్లో చాలా కాలం నుంచి పోరాటం జరుగుతోంది. సెంట్రల్ లండన్‌లోని ఓ మేజిస్ట్రేట్ బుధవారం ఇచ్చిన ఆదేశాలతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలావుండగా అసాంజే తరపు న్యాయవాదులు మాట్లాడుతూ, తాము ప్రీతి పటేల్‌కు వినతి పత్రాలను సమర్పిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇతర అంశాలపై అపీలు కూడా చేస్తామని చెప్పారు. 


బ్రిటన్ సుప్రీంకోర్టుకు అపీలు చేసేందుకు అసాంజేకు గత నెలలో అనుమతి రాలేదు. అమెరికాకు ఆయనను అప్పగిస్తే జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది. 


ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాలకు సంబంధించిన దాదాపు 5 లక్షల రహస్య సైనిక ఫైళ్ళను ప్రచురించినందుకు అసాంజేపై విచారణ జరిపేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. 


Updated Date - 2022-04-20T21:54:11+05:30 IST