కుంగిపోతున్న కుడివైపు గట్టు

ABN , First Publish Date - 2022-08-08T06:01:39+05:30 IST

భైరవానతిప్ప ప్రాజెక్టుకు కుడివైపు గట్టు కరిగిపోతోంది. నాలుగేళ్ల క్రితం పడిన పైపింగ్‌ మరమ్మతు ప్రదేశంలోనే గట్టు కుంగిపోతోంది

కుంగిపోతున్న  కుడివైపు గట్టు
మరమ్మతులు చేపట్టేందుకు ఇసుక బస్తాలను సిద్ధం చేస్తున్న దృశ్యం

బీటీపీకి పొంచి ఉన్న ముప్పు

తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన అధికారులు

మూడున్నరేళ్లుగా పట్టించుకోకపోవడమే కారణమా.?

రాయదుర్గం : భైరవానతిప్ప ప్రాజెక్టుకు కుడివైపు గట్టు కరిగిపోతోంది. నాలుగేళ్ల క్రితం పడిన పైపింగ్‌ మరమ్మతు ప్రదేశంలోనే గట్టు కుంగిపోతోంది. అప్పట్లో వేసిన మట్టి బస్తాలు ఒక్కొక్కటిగా కరిగిపో యి నీటిలో చేరుతున్నాయి. దీంతో జలాశయం వరదనీటితో నిండి వున్న నేపథ్యంలో అలల తాకిడికి గట్టు కోతకు గురవుతోంది. జలాశయం రెండు టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగి వుండగా ఇప్పటికే  1.8 టీఎంసీల నీరు చేరి వున్నాయి. దీంతో అలలు తాకిడికి గట్టు కోతకు గురవుతోంది. ఆదివారం తెల్లవారుజామున నుంచి హుటాహుటిన ఇంజనీరింగ్‌ అధికారులు మట్టిని, ఖాళీ బస్తాలను తరలించి కోతను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా గట్టు బలహీనంగా వుండటంతో ఏ క్షణంలోనైనా కోతకు గురై గండి పడే అవకాశముందని చర్యలకు పూనుకున్నారు. ప్రధానంగా నాలుగేళ్ల క్రితం పడిన పైపింగ్‌ ప్రాంతంలో గట్టు పటిష్ట పరచి రివిట్‌మెంట్‌ ఏర్పాటు చేసేందుకు రూ. 4 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఇరిగేషన డీఈ వెంకటరమణ స్పష్టం చేశారు. కాగా ఆ ప్రతిపాదనలపై ఇప్పటివరకు ఎలాంటి చలనం లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా ఈ యేడాది కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి ఊహించని రీతిలో వరదనీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. కనీసం తాత్కాలిక మరమ్మతులు చేపట్టి నీటి నిల్వకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం పూర్తిగా  గాలికొదిలేసి చిల్లిగవ్వకూడా ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం వున్న నీటిని కాపాడుకునేందుకు అధికారులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి దాపురించింది. ముందస్తుగా పసిగట్టి గట్టు బలహీనతను నివారించి పటిష్ట పరచి వుంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వుండేది కాదని భావిస్తున్నారు. ఇప్పటికే జలాశయంలోని నీటిని సంరక్షించుకునేందుకు పెద్దఎత్తున చర్యలు చేపట్టినప్పటికీ పరిస్థితులు మాత్రం ప్రతికూలంగా వున్నట్లు అంచనాలు వేస్తున్నారు. కుడి వైపు గట్టు మాత్రం ఎప్పటికైనా ప్రమాదాన్ని సూచిస్తోందని అధికారులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. 



తుంగభద్రకు పోటెత్తిన వరద 

రాయదుర్గం, ఆగస్టు 7 : తుంగభద్ర జలాశయానికి ఆదివారం వరద పోటెత్తింది. జలాశయం పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదనీరు పెద్దఎత్తున చేరుతోంది. 1,05,509 క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి జలాశయంలో చేరుతోంది. డ్యామ్‌కు వున్న క్రస్ట్‌ గేట్లలో 20 గేట్లను 2.5 అడుగులు, పది గేట్లను 1.5 అడుగులు ఎత్తి నదికి 1,09,106 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 1631.88 అడుగుల మేరకు 101.300 టీఎంసీల నీరు నిల్వ వున్నాయి. మూడు రోజుల క్రితం 50 వేల క్యూసెక్కుల నీటి ఇనఫ్లో వుండగా శనివారం నుంచి ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు భారీ ఎత్తున చేరుతుండటంతో జలాశయానికి వున్న 33 గేట్లలో 30 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నట్లు బోర్డు కార్యదర్శి నాగమోహన తెలిపారు. జలాశయంలో నీటి చేరిక కారణంగా ఎప్పటికప్పుడు జలాశయం భద్రతను ఎస్‌ఈ శ్రీకాంత రెడ్డి నేతృత్వంలో పర్యవేక్షిస్తున్నారు.


ఉధృతంగా ప్రవహిస్తున్న వేదవతి 

బీటీపీ నుంచి వేదవతి హగరి నదికి ఆదివారం నీరు విడుదల చేశారు. దీంతో గంగలాపురం, కళేకుర్తి, మాల్యం, బ్రహ్మస ముద్రం, ఉడేగోళం, బెణకల్లు  గ్రామాల పరిధిలో ఉధృతంగా ప్రవహిస్తోంది. హగరిలో సాగు చేసిన దాదాపు 500 ఎకరాల వరి పంట నీట మునిగింది. అలాగే వ్యవసాయ బోర్లు, విద్యుత మోటార్లు మునిగిపోయాయి.  - కణేకల్లు 

Updated Date - 2022-08-08T06:01:39+05:30 IST