జీలుగ సాగుతో లాభాలెన్నో

ABN , First Publish Date - 2022-07-07T06:00:25+05:30 IST

ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. వరినార్లు పోసుకోవడానికి ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేశారు.

జీలుగ సాగుతో లాభాలెన్నో
నల్లగొండ జిల్లా కట్టంగూరులో జీలుగ సాగును పరిశీలిస్తున్న అధికారులు

 జిల్లాలో ఆశజనకంగా కురుస్తున్న వర్షాలు

 జీలుగ, పిల్లిపెసర, జనుము సాగుకు అనువైన సమయం 

 మంచి ఫలితాలు ఉంటాయంటున్న అధికారులు

సూర్యాపేట సిటీ, జూలై 6: ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. వరినార్లు పోసుకోవడానికి ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేశారు. ఈ తరుణంలో భూసారం పెంచే సాంప్రదాయ ఎరువులైన జీలుగ, పచ్చిరొట్ట, పిల్లిపెసర ఉపయోగానికి సరైన సమయమని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు వేసవితాపంతో ఉన్న భూమిలో వర్షపు నీళ్లు ఇంకిపోవడంతో భూమి చల్లబడింది. ఈ సమయంలోనే జీలుగ విత్తనాలు సాగు చేయడం వల్ల భూసారం పెరగడంతోపాటుగా, పంటలు ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశముందని వ్యవసాయాధికారులు తెలిపారు. జీలుగ, పచ్చిరొట్ట, పిల్లిపెసర వంటి వాటిని వరినారు వేసే నాటి వరకూ భూమిలో వేసుకోవడం వల్ల అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర విత్తన ఉత్పత్తి సంస్థ (టీఎస్‌ సీడ్స్‌) ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పీఏసీఎస్‌, ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాల ద్వారా సబ్సిడీ ధరలపై జీలుగు, జనుము, పిల్లిపెసర విత్తనాలు పంపిణీ చేస్తోంది. విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు ఇప్పటికే  భూముల్లో చల్లుకుంటున్నారు. విత్తిన రోజు నుంచి 25రోజుల్లో పంట పెరు గుతుందని రైతులు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14,169 క్వింటాళ్ల విత్తనాలను ఆయా పీఏసీఎస్‌, ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రం సెంటర్లకు సరఫరా చేసినట్లు తెలంగాణ సీడ్స్‌ ప్రాంతీయ అధికారులు తెలిపారు. ఇప్ప టి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10 క్వింటాళ్లకు పైగా జీలుగ విత్తనాలు రైతులు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. అవసరమున్న సెంటర్లకు విత్తనాలను సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు టీఎస్‌ సీడ్స్‌ అధికారులు పేర్కోంటున్నారు.


25 నుంచి 30 రోజుల్లో పంట చేతికి 

ఏకవార్షిక మొక్కల్లో ప్రఽథమస్థానం జీలుగదే. విత్తనాలు భూమిలో చల్లిన రోజు నుంచి 25 లేది 30 రోజుల్లోనే పంట ఏపుగా పెరుగుతుంది. ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు సిద్ధం చేసుకుంటే సరిపోతుంది. దుక్కిలో 20నుంచి 30కిలోల యూరియా వేసి ఆపై విత్తనాలను చల్లుకోవాలి. బిందుసేద్యం ద్వారా అయితే సాళ్లలో విత్తుకోవాలి. మొక్కలు బాగా పెరిగేం దుకు క్రమపద్ధతిలో తడులు ఇవ్వాలి. 25 నుంచి 30రోజులకు మొక్క ఏపుగా పెరిగి పూతదశకు చేరుకుంటుంది. ఆ సమయంలో మొక్కలను మొదళ్ల వద్ద కత్తిరించాలి లేదా రోటోవేటర్‌ సహాయంతో కలియ దున్నాలి. దున్నిన తర్వాత 100కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్పేటు దుక్కిలో వేయాలి. సూపర్‌ ఫాస్పేట్‌ వల్ల మొక్కల అవశేషాలు బాగా కుళ్లి పచ్చిరొట్ట ఎరువులు తయారవుతాయి. కుళ్లేదశలో నీటిని సక్రమంగా అందివ్వాలి.


30 కేజీల బస్తా రూ.664 

జీలుగ విత్తనాలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు అందజేస్తుంది. 30 కేజీలు ఉండే బస్తా ఖరీదు రూ. 1,897.50లు ఉండగా ప్రభుత్వం రూ.1,233.30 విత్తన ఉత్పత్తి సంస్థకు చెల్లిస్తుంది. మిగిలిన రూ.664.20లు రైతులు చెల్లిస్తే సరిపోతుంది. జీలుగ విత్తనాతో పాటుగా ఇతర విత్తనాలైన జనుము, పిల్లిపెసర వంటి విత్తనాలకు సైతం సబ్సిడీపై రైతులకు ప్రభుత్వం అందజేస్తుంది. 40కేజీలు ఉండే ఒక బస్తా జనుము రూ.1,166 లు, 20 కేజీలు కలిగిన పిల్లిపెసర బస్తాకు రూ.620లకు అందజేస్తారు.

జీలుగ పంట ప్రయోజనాలు

 పొలంలో జీలుగను కలియదున్ని తర్వాత అవి నేలకు, ఆపై వేసే పంటలకు విశేషమైన లాభాలు అందిస్తుంది.

 ప్రధాన పంటకు ముందస్తుగా నేలను తయారు చేస్తుంది

 జీలుగ సాగు వల్ల మూడు టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. 

 మొక్కలకు రెండు శాతం నత్రజని, సూపర్‌ ఫాస్పేట్‌ను అదనంగా అందిస్తాయి.

 జింక్‌, మాంగనీసు, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మధాతువులను పంటకు చేకూర్చుతాయి.

 నేలలో కరగని మూలకాలను పంటకు  అనుకూలంగా మార్చుతాయి 

 నీటి నిల్వ సామర్థ్యం పెంచుతాయి.

 నేల సహజ మిత్రులైన వానపాముల ఉత్పత్తికి దోహదం చేస్తాయి.

 లెగ్యూ జాతికి చెందిన మొక్క కావడంతో వేర్లతో నత్రజని స్థిరీకరణ అధికంగా ఉంటుంది.

 తుంగ, గరక వంటి కలుపు మొక్కలను అడ్డుకుంటుంది.


జీలుగ విత్తనాలు అందుబాటులో ఉంచాం

రైతులకు అవసరమైన జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలను అందుబాటులో ఉంచాం. వర్షాలు ఎక్కువ పడు తుండటంతో  రైతులు జీలుగ విత్తనాలు అడుగుతున్నారు. రైతులు సమీపంలో ఉన్న పీఏసీఎస్‌, ఆగ్రో రైతు సేవా  కేంద్రాలకు జీలుగ విత్తనాలు సరఫరా చేశాం. నాట్లు వేసే వరకు జీలుగ పైరు పెరుగుతుంది. పొలంలో కలియ దున్నితే పచ్చిరొట్ట ఎరువుగా మారి పంటకు మేలు చేస్తుంది.

కృష్ణవేణి, తెలంగాణ విత్తన సంస్థ ఉమ్మడి జిల్లా ప్రాంతీయ మేనేజర్‌


జీలుగ సాగుకు అనువైన సమయం

జిల్లాలో కురుస్తున్న వర్షాలు కొంత ఆశజనకంగా ఉన్నాయి. ఈ తరణంలో భూసారం పెంపుదల చేసుకోవడం కోసం రైతులు భూమిలో జీలుగు, పిల్లిపెసర, జనుము  వంటి విత్తనాలను చల్లుకుంటే పంటల దిగుబడి పెరుగుతుంది. సూర్యాపేట జిల్లాలో సెప్టెంబరు మాసం వరకు నాట్లు వేసుకోవచ్చు. నాట్లు వేసుకునే నాటి వరకు ముందస్తుగా భూమిలో జీలుగ విత్తనాలను చల్లుకుంటే మంచి ఫలితం వస్తుంది.

డి. రామారావునాయక్‌, సూర్యాపేట జిల్లా వ్యవసాయాఽధికారి.

Updated Date - 2022-07-07T06:00:25+05:30 IST