
గ్రేటర్ నోయిడా : ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా సమీపంలో ఉన్న కనర్సి గ్రామస్థులు ఓ వ్యక్తిని శుక్రవారం విపరీతంగా కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆ వ్యక్తి ఆ గ్రామంలోని నరేష్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఐదు నెలల పసికందును అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారకులైనవారి కోసం గాలింపు జరుగుతోందని, త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నరేశ్ ఇంట్లోకి నేపాల్‌కు చెందిన నన్‌కు గురువారం రాత్రి 11 గంటలకు చొరబడ్డాడు. ఐదు నెలల పసికందు ఏడుపు విని కుటుంబ సభ్యులు మేలుకున్నారు. అప్పటికే నన్‌కు ఆ పసికందును తీసుకుని పారిపోయాడు. అనంతరం ఆ గ్రామస్థులు కొందరు అతనిని వెంబడించి, పట్టుకుని, ఓ చెట్టుకు కట్టేసి, నిర్దాక్షిణ్యంగా చావగొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిని కొత్వాలికి తీసుకెళ్ళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించారు. అక్కడి వైద్యులు అతనిని జిల్లా ఆసుపత్రికి తరలించాలని చెప్పారు. ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో అతను మరణించినట్లు అదనపు డీసీపీ విశాల్ పాండే చెప్పారు.
నన్‌కు సోదరుడు పంచ్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేశ్, ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్థులపై ఆరోపణలు చేశారు. పోలీసులు నరేష్‌ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.
ఇవి కూడా చదవండి