Amroha cow deaths: విషాహారం తిని 61 ఆవుల మృతి... దాణాను సరఫరా చేసిన వ్యక్తి అరెస్ట్...

ABN , First Publish Date - 2022-08-11T22:38:23+05:30 IST

ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లోని అమ్రోహా (Amroha) జిల్లాలో

Amroha cow deaths: విషాహారం తిని 61 ఆవుల మృతి... దాణాను సరఫరా చేసిన వ్యక్తి అరెస్ట్...

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లోని అమ్రోహా (Amroha) జిల్లాలో వందలాది ఆవులకు విషాహారం సరఫరా చేసిన మహమ్మద్ తాహిర్‌ (Mohammad Tahir)ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంతాల్‌పూర్ గ్రామంలోని ఓ గోశాలలో ఆవులకు నైట్రేట్, నైట్రైట్ కలిపిన దాణాను ఆయన సరఫరా చేసినట్లు పోలీసులు ఆరోపించారు. ఈ ఆహారం తిన్న 61 ఆవులు ప్రాణాలు కోల్పోయాయని, మరికొన్ని ఆవులు అనారోగ్యంపాలయ్యాయని తెలిపారు. 


మహమ్మద్ ఆచూకీ తెలిపినవారికి రూ.50,000 బహుమతి ఇవ్వనున్నట్లు అంతకుముందు ఉత్తర ప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. ఆయనను సోమవారం సాయంత్రం అదంపూర్ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఆయనతోపాటు అరెస్టయిన 12 మందిలో ఈ గోశాల బాధ్యతలను చూస్తున్న గ్రామ అభివృద్ధి అధికారి మహమ్మద్ అనస్ కూడా ఉన్నారు. 


బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి రేణు కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భారత శిక్షా స్మృతి, గో వధ చట్టం, జంతువుల పట్ల క్రూరత్వాన్ని నిరోధించే చట్టం ప్రకారం ఆరోపణలను నమోదు చేశారు. 


సీఎం యోగి ఆదేశాలు

గోవులు మరణిస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. గోశాలకు వెళ్ళి పరిస్థితిని తెలుసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి ధరంపాల్ సింగ్‌ను కోరారు. దోషులపై జాతీయ భద్రత చట్టాన్ని ప్రయోగిస్తామని రాష్ట్ర మంత్రి గులాబో దేవి చెప్పారు. 


రెండు విషపూరిత రసాయనాలు

దర్యాప్తులో వెల్లడైన అంశాలను ఓ అధికారి జాతీయ మీడియాకు తెలిపారు. ఈ గోశాలలోని ఆవులకు నైట్రేట్, నైట్రైట్ అనే రెండు విషపూరిత రసాయనాలను మితిమీరిన స్థాయిలో కలిపారని చెప్పారు. 


సరఫరాదారు మార్పు ఎందుకు?

తాహిర్ గత వారమే 3,000 కేజీల దాణాను ఈ గోశాలకు సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు మరొకరు దాణాను సరఫరా చేసేవారని, గ్రామ ప్రధాన్ రామవతార్ సింగ్‌తో సంప్రదించి వీడీవో మహమ్మద్ అనస్ ఆ వ్యక్తితో ఒప్పందాన్ని రద్దు చేశారని చెప్పారు. కొత్త వ్యక్తిని నియమించడంపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. 


ఉత్తర ప్రదేశ్ పశుసంవర్ధక శాఖ స్పందిస్తూ, గోశాలల్లో ఆవులకు అందించవలసిన దాణాపై మార్గదర్శకాలను జారీ చేసింది. 


Updated Date - 2022-08-11T22:38:23+05:30 IST