ltrScrptTheme3

రెండు తరాల హీరోలకు సరిజోడి..

Oct 24 2021 @ 04:10AM

హీరోలతో పోల్చితే హీరోయిన్లకు సుదీర్ఘమైన కెరీర్‌ తక్కువే. కొత్త హీరోయిన్ల పోటీని తట్టుకుంటూ కొంతమంది హీరోయిన్లు మాత్రం అరుదైన ఘనతను సాధించారు. టాలీవుడ్‌లో హీరోలైన తండ్రీ కొడుకులు...మామా అల్లుళ్లు... బాబాయి అబ్బాయి... ఇలా ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాల అగ్ర హీరోలతో ఆడిపాడారు. 

అమ్మడూ కుమ్ముడూ

హీరోయిన్‌గా తన కెరీర్‌ ఆరంభంలో ‘మగధీర’, తర్వాత ‘ఎవడు’, ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రాల్లో రామ్‌చరణ్‌తో జతకట్టారు కాజల్‌ అగర్వాల్‌. మగధీరలో మిత్రవిందగా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేశారు. ఆ సినిమా చేసిన కొన్నాళ్లకు చిరంజీవి కమ్‌బ్యాక్‌ మూవీ ‘ఖైదీ నంబర్‌ 150’లోనూ కథానాయికగా నటించారు. ఆ చిత్రంలో ఓ పాటలో తండ్రీ కొడుకులిద్దరితో కలసి స్టెప్పులేసి ఫ్యాన్స్‌ను ఖుషీచేశారు. ఇప్పుడు మరోసారి ఈ ముగ్గురి కాంబో ‘ఆచార్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. రామ్‌చరణ్‌, చిరంజీవి తొలిసారి పూర్తిస్థాయి పాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజల్‌ కనిపించనున్నారు. చరణ్‌కి జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ’లో పవన్‌తో జతకట్టారు. ఇలా మెగా ఫ్యామిలీలో రెండు తరాల నటులకు కథానాయికగా నటించిన ఘనతను కాజల్‌ దక్కించుకున్నారు. 

చిరుతో లెక్క సరిచేస్తారా?

దశాబ్దకాలంపాటు టాలీవుడ్‌లో అగ్రతారగా కొనసాగిన తమన్నా భాటియా కూడా మెగా ఫ్యామిలీలో రెండు తరాల హీరోలతో నటించారు. బాబాయి పవన్‌కల్యాణ్‌తో ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’లో కనిపించారు. అబ్బాయి రామ్‌చరణ్‌తో ‘రచ్చ’ చేశారు. అంతేనా మెగా మేనల్లుడు అల్లు అర్జున్‌తో ‘బద్రీనాథ్‌’ చిత్రంలో నటించారు. ఇలా పవన్‌, చరణ్‌, అర్జున్‌ సరసన హీరోయిన్‌గా అలరించిన తమన్నా చిరంజీవితో నటిస్తే ఆ కిక్కే వేరు అంటున్నారు ఫ్యాన్స్‌. ఇప్పుడు ‘భోళాశంకర్‌’ చిత్రంలో మెగాస్టార్‌తో ఆమె జతకట్టనున్నారని టాలీవుడ్‌ సమాచారం. 

పవన్‌తో పూజా 

టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు పూజాహెగ్డే. మెగా హీరో వరుణ్‌తేజ్‌తో ‘ముకుంద’ ‘గద్దల కొండ గణేష్‌’ చిత్రాల్లో, రామ్‌చరణ్‌తో ‘రంగస్థలం’లో ప్రత్యేకగీతంలో, అల్లు అర్జున్‌తో ‘డీజే’, ‘అల వైకుంఠపురం’ చిత్రాల్లో పూజాహెగ్డే జోడీ కట్టారు. ఇప్పుడు ‘ఆచార్య’లో మరోసారి జతకడుతున్న పూజా త్వరలో పవన్‌ కల్యాణ్‌తో జోడీ కట్టబోతున్నారని టాలీవుడ్‌ టాక్‌. అదే నిజమైతే పూజా కూడా రెండు తరాల మెగా హీరోలతో జోడీ కట్టినట్టే. 

రెండు తరాల శ్రుతి

శ్రుతీహాసన్‌ మెగా ఫ్యామిలీలో పవన్‌కల్యాణ్‌తో ‘గబ్బర్‌సింగ్‌’ మూవీ చేశారు. ‘ఎవడు’లో రామ్‌చరణ్‌తో, ‘రేసుగుర్రం’లో బన్నీతో స్టెప్పులేశారు. తిరిగి ‘వకీల్‌సాబ్‌’తో పవన్‌తో మరో హిట్‌ ఖాతాలో వేసుకున్నారు.

నందమూరి అందగాళ్లతో 

‘సింహ’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహ’ చిత్రాల్లో బాలకృష్ణతో నయనతార నటించారు. అబ్బాయి జూనియర్‌ ఎన్టీఆర్‌తో ‘అదుర్స్‌’ చేశారు. అలాగే ‘నా అల్లుడు’ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటించిన శ్రియ బాలకృష్ణతో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’, ‘పైసా వసూల్‌ చిత్రాలు చేశారు. రామానాయుడు ఫ్యామిలీలో బాబాయి వెంకటేష్‌, అబ్బాయి రానాతో నయనతార ఆడిపాడారు. వెంకటే్‌షతో నయనతార ‘బాబు బంగారం’, ‘లక్ష్మీ’, ‘తులసి’ చిత్రాల్లో నటించారు. రానాతో ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ చేశారు. అలాగే తమిళంలో మామా అల్లుళ్లు రజనీకాంత్‌, ధను్‌షతోనూ ఆమె పలు చిత్రాల్లో నటించారు. 


వెంకీతో జోడీ రానాతో డీ

గతంలో అనుష్క వెంకటే్‌షతో ‘చింతకాయల రవి’, ‘నాగవల్లి’ చిత్రాల్లో నటించారు. రామానాయుడు ఫ్యామిలీలో రెండో తరం హీరో రానాతో కలసి ‘బాహుబలి’లో నటించారు. ఆ చిత్రంలో రానాతో జోడీ కట్టకపోయినా యువరాణిగా ధీటుగా ఉండే పాత్రలో రానాతో పోటీపడి ఆకట్టుకున్నారు. 

బాబాయి, అబ్బాయితో

‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ సరసన ఆకట్టుకున్నారు సమంత. ఆ తర్వాత ఆమె మెగా ఫ్యామిలీలో రెండో తరం జనరేషన్‌ అల్లు అర్జున్‌తో ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’,  ‘రంగస్థలం’ సినిమాలో రామ్‌చరణ్‌తో జోడీకట్టి మెప్పించారు. 

అక్కినేని ఫ్యామిలీలో...

గతంలో శ్రీదేవి అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున ఇద్దరితో కథానాయికగా నటించిన ఘనతను సొంతం చేసుకున్నారు. అయితే ఈ జనరేషన్‌ హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఆ ఘనతను సొంతం చేసుకున్నారు. మన్మథుడితో ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంలో నటించిన లావణ్య నాగ్‌ తనయుడు నాగచైతన్యతో ‘యుద్ధం శరణం’ చేశారు. అలాగే రకుల్‌ ప్రీత్‌సింగ్‌ చైతన్యతో ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమా చేశారు. నాగార్జునతో ‘మన్మథుడు 2’లో నటించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.