ఓ పద్ధతి... ఓ ప్రణాళిక... ఓ ముందుచూపు!

Jun 16 2021 @ 01:56AM

ఓ పద్ధతి... షెడ్యూల్స్‌ వేయడంలో!

ఓ ప్రణాళిక... చిత్రీకరణ చేయడంలో!

ఓ ముందుచూపు... విడుదల విషయంలో!

తెలుగు చిత్ర పరిశ్రమకు ఒకటికి రెండుసార్లు...

కరోనా మహమ్మారి కాటు బలంగా తగిలింది.

అందుకని, ఇప్పుడు మరింత జాగ్రత్త పడుతోంది.

పద్ధతి, ప్రణాళిక, ముందుచూపుతో వ్యవహరిస్తోంది.


హిందీ చిత్ర పరిశ్రమలో కదలిక వచ్చింది. చిత్రీకరణలు మొదలయ్యాయి. అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్‌, అక్షయ్‌కుమార్‌ వంటి అగ్ర హీరోలు సెట్స్‌కు వచ్చారు. మరి, తెలుగు చిత్ర పరిశ్రమలో చిత్రీకరణలు ఎప్పుడు మొదలవుతాయి? అగ్ర తారలు సెట్స్‌కు ఎప్పుడొస్తారు? అంటే... ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అతి త్వరలో రానుంది. నితిన్‌ ‘మాస్ట్రో’ చిత్రీకరణ మొదలుపెట్టారు. సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో ఓ సినిమా తెరకెక్కుతోంది. చిన్నాచితకా చిత్రాలు ఐదారు సెట్స్‌ మీద ఉన్నట్టు వినికిడి. ఈ నెలాఖరు నుంచి మరికొన్ని చిత్రాలు మొదలు కానున్నాయి. అందులో పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒకటి.


ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఈ నెలాఖరున సెట్స్‌కు రావడానికి సిద్ధమవుతున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ చిత్రం ఒక్కటే కాదు... ఈ నెల 24న ‘శాకుంతలం’, ‘నరుడి బ్రతుకు నటన’, 26న ‘ఖిలాడి’, జూలై తొలి వారంలో ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్‌’, ‘ఎఫ్‌ 3’, ‘పక్కా కమర్షియల్‌’ సెట్స్‌ మీదకు రానున్నాయి. అంటే... నాగచైతన్య, రవితేజ, 


చిరంజీవి, ప్రభాస్‌, వెంకటేశ్‌, గోపీచంద్‌, వరుణ్‌ తేజ్‌ వంటి హీరోలు సెట్స్‌కు వస్తారన్నమాట. సమంత, రాశీ ఖన్నా, పూజా హెగ్డే తదితర హీరోయిన్లు కూడా! ఇంతమంది తారలొస్తున్నారు సరే! ఓ పద్ధతిగా షెడ్యూల్స్‌ వేసుకొస్తున్నారు ఓ.కె.! మరి, కరోనా జాగ్రత్తల మాటేమిటి? - ఈ ప్రశ్న తలెత్తడం ఖాయం. ఈ విషయంలో కూడా తెలుగు చిత్ర పరిశ్రమ పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోంది.


కరోనా రెండో దశ ప్రారంభానికి ముందు కొన్ని భారీ సినిమాల చిత్రీకరణ అర్ధాంతరంగా నిలిపివేయడానికి కారణం యూనిట్‌లో కీలక సభ్యులు కొందరు కరోనా బారిన పడటమే. అందుకని, ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా ముందుగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని టాలీవుడ్‌ పెద్దలు చేపట్టారు. నిర్మాణ సంస్థలు, హీరోలు తమ చిత్రాలకు పని చేస్తున్న సభ్యులకు వ్యాక్సిన్లు వేయించాయి. చిరంజీవి నేతృత్వంలోని కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ) ఆధ్వర్యంలో సినీ కార్మికులకు వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. చిత్రీకరణలో పాల్గొనే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ పక్కాగా వేయించుకున్నవారే ఉండాలనే నియమాన్ని పెట్టుకున్నారట.

 

అలాగే, సినిమాల విడుదల విషయంలో టాలీవుడ్‌ తొందరపడటం లేదు. జూలై తొలివారంలో తెలంగాణ రాష్ట్రంలో థియేటర్లు తెరుచుకుంటాయని ప్రచారం జరుగుతోంది. యాభై శాతం సీటింగ్‌ సామర్థ్యంతో అనుమతి ఇవ్వడానికి కేసీఆర్‌ సర్కారు సుముఖంగా ఉందట. పవన్‌కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’ను రీ-రిలీజ్‌ చేస్తారనేది ఓ టాక్‌. నిర్మాతలు ఇంకా ఏమీ చెప్పలేదు. ఉత్తరాదిలో సల్మాన్‌ఖాన్‌ ‘రాధే: మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ను రెండు థియేటర్లలో విడుదల చేశారు. వసూళ్లు ఏమంత ఆశాజనకంగా లేవు. మరోవైపు ఏపీలోని విశాఖలో రవితేజ ‘క్రాక్‌’ను రీ-రిలీజ్‌ చేస్తే... ప్రేక్షకుల స్పందన అంతంతమాత్రమే. ఇవన్నీ ఓటీటీల్లోనూ వచ్చేసిన చిత్రాలు. వీటిని కాకుండా థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల చేస్తే ప్రేక్షకులు ఎంతమేరకు వస్తారనేది కీలకం. అందుకని, నిర్మాతలు పరిస్థితులను చాలా నిశితంగా గమనిస్తున్నారు. సాధారణంగా సెకండ్‌ షో వసూళ్లు ఎక్కువగా ఉంటాయి. అందుకని, తెలంగాణలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తేసిన తర్వాతే కొత్త చిత్రాలు విడుదల చేయాలనుకుంటున్నారట. థియేటర్లలో ప్రదర్శనలకు అనుమతులు ఇచ్చిన వెంటనే తొందరపడకూడదని ముందుచూపుతో వ్యవహరిస్తోంది.


‘‘రెండు పాటలు తీస్తే... ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. జూన్‌ నెలాఖరు నుంచి వాటిని తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నాం. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ చేస్తాం’’.- ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మాత డీవీవీ దానయ్య ‘


మేం ఇంతకు ముందే 50 శాతం సినిమా పూర్తి చేశాం. ఈ నెల(జూన్‌) చివరి వారంలో చిత్రీకరణ పునఃప్రారంభిస్తాం. మా ‘శాకుంతలం’లో నటీనటులు, సాంకేతిక నిపుణులకు వ్యాక్సిన్లు వేయించాం. ఇంతకు ముందు చిత్రీకరణ చేసినట్టే... ప్రతిఒక్కరికీ తరచూ కొవిడ్‌-19 పరీక్షలు చేయిస్తూ, తక్కువమందితో పని చేస్తాం. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే సమంత ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయాలనుకుంటున్నాం.’’ 

‘శాకుంతలం’ నిర్మాత, చిత్రదర్శకుడు గుణశేఖర్‌ కుమార్తె నీలిమా గుణ


‘‘తెలంగాణలో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినా... ప్రస్తుతం నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రిపూట కర్ఫ్యూ పూర్తిగా తొలగించిన తర్వాతే ఎవరైనా సినిమా విడుదల విషయం ఆలోచిస్తారు. మూడు ప్రదర్శనలతో థియేటర్లు నడిపించడానికి ఎవరూ ముందుకు రారు. అలాగే, సినిమా నిర్మాతలూ తమ సినిమాలను విడుదల చేయాలనుకోరు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితులు హాళ్లు తెరవడానికి అనుకూలంగా ఉండాలి కదా! జూలై రెండో వారానికి పరిస్థితులు సాధారణస్థితికి వస్తాయని ఆశిస్తున్నాం. ఒకవేళ థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు లభించినా... రాత్రిపూట కర్ఫ్యూ తీసేసిన తర్వాతే కొత్త సినిమాలు విడుదల చేస్తారు. మా ‘లవ్‌ స్టోరి’ చిత్రాన్నీ నైట్‌ కర్ఫ్యూ తీసిన వారం తర్వాత విడుదల చేయాలని అనుకుంటున్నాం.’’

నిర్మాత, ఎగ్జిబిటర్‌ ‘ఏసియన్‌’ సునీల్‌ నారంగ్‌

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.