‘రచయితల కోఆపరేటివ్స్‌’కి తరుణమిది!

Dec 6 2021 @ 00:19AM

‘తప్పంతా పాఠకుడిపైకి నెట్టేద్దామా!’ శీర్షికతో అనిల్‌ అట్లూరి నవంబర్‌ 22వ తేదీ ‘వివిధ’లో రాసిన వ్యాసానికి కొనసాగింపుగా మరికొన్ని ఆలోచనలను సాహితీ మిత్రులతో పంచుకుంటున్నాను. మంచి పుస్తకాన్ని ఆదరించే పాఠకులు ఇప్పటికీ వేల సంఖ్యలో ఉన్నారు. వాసి గల పుస్తకాలను రాసి, ప్రచురించి, వారి ముంగిటకు చేర్చటమే రచయితల ముందున్న తక్షణ కర్తవ్యం. మంచి రచనలు చేయాలి, పదిమందికి చేర్చాలి అన్న ఆకాంక్ష గల భావసారూప్యత ఉన్న వారంతా రచయితల సహకార సంఘంగా ఏర్పడి ఒక గొడుగు కిందకు వచ్చి సమష్టి కృషి చేపట్టాలి. ప్రక్రియలపరంగా కూడా ఇలాంటి సంఘాలు ప్రారంభించవచ్చు. కవులంతా కలిసి ఒక సంఘాన్ని, కథకులంతా కలిసి ఒక సంఘాన్ని కూడా పెట్టుకోవచ్చు. కొత్త పేచీలు రావనుకుంటే సంఘాన్ని రిజిస్టర్‌ చేయించి, సంఘం పేరిట బ్యాంక్‌ ఖాతాను, దాని నిర్వహణ బాధ్యులను ఎంపిక చేసుకోవచ్చు. 


సంఘం ఉద్దేశాలు, లక్ష్యాలు, ఏమే కార్యక్రమాలు నిర్వహించాలి, ఏ తరహా పుస్తకాలను ప్రచురించాలన్నది స్పష్టంగా నిర్దేశించుకోవాలి. రచయితలు ఎవరికి వారు పుస్తకాలు ప్రచురించుకోకుండా సంఘం తరఫునే రచనల ఎంపిక, ప్రచురణ, పంపిణీ బాధ్యతలు చేపట్టాలి. ఇందుకు కావలసిన మూలధనాన్ని సభ్యత్వ రుసుముతోపాటు ప్రతివారూ సమకూర్చాలి. 


అందరికీ ఆమోదయోగ్యులైన ఇద్దరు ముగ్గురు సీనియర్‌ రచయితలతో పుస్తకాల ఎంపిక, ప్రచురణ కమిటీని నియమించుకోవాలి. ఆ కమిటీ ఆమోదించిన పుస్తకాలను మాత్రమే ప్రచురించాలి. స్ర్కిప్టులో సవరణలు సూచిస్తే మార్పులు చేర్పులు చేయటానికి రచయితలు సిద్ధపడాలి. నాణ్యతను పరిశీలించి ఆ రచన ప్రచురణార్హమో కాదో నిర్ణయించటానికి చేసే ఏర్పాటుతో ఎంతో కొంత కొత్త పుస్తకాల ప్రమాణాలు పెరుగుతాయి.


సభ్యులంతా నెలలో వీలును బట్టి ఒకటి రెండు సార్లు సభ్యులలో ఒకరి ఇంట్లోనో లేదా దగ్గరలోని సమావేశ మందిరం లోనో  కూచుని ఆలోచనలు కలజూసుకోవచ్చు. సాహిత్యంలో ప్రత్యేకించి తెలుగు సాహిత్యంలో వస్తున్న కొత్త ధోరణులను సమీక్షించుకోవచ్చు. అలాగే సభ్యులు రాసిన కవితో, కథో చదివి వినిపిస్తేదాన్ని మెరుగు పరచటానికి సీనియర్లు సలహాలు, సూచనలు చేయవచ్చు. వీలును బట్టి ప్రసిద్ధ కథకుడినో, కవినో ఈ సమావేశాలకు ఆహ్వానించి ఆయన/ ఆమె అనుభవాలను కలబోసుకోమని కోరవచ్చు. వర్ధమాన రచయితలకు ఇలాంటి సమావేశాలు శిక్షణ తరగతులుగా ఉపకరిస్తాయి. 


కొంతకాలం తర్వాత ఈ కృషిని ఆపై స్థాయికి కూడా తీసుకువెళ్లవచ్చు. సాహితీవేత్తలు కూపస్థ మండూకాల్లా మిగిలిపోకుండా దేశ విదేశీ భాషల్లో వివిధ ప్రక్రియల్లో వస్తున్న పోకడలను ధోరణులను, ఇతివృత్తాలను కనీసం రేఖామాత్రం గానైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తొలి విడతలో దక్షిణాది భాషలయిన తమిళం, కన్నడం, మలయాళంలో ఏ తరహా కథలు, నవలలు, కవితలు, వ్యాసాలు వస్తున్నాయి, ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు? ఇంత స్మార్ట్‌ ఫోన్ల కాలంలోనూ అక్కడి ప్రజలకు సాహిత్యాభిలాష, పఠనాసక్తులు తగ్గకపోవటానికి దోహదపడుతున్న అంశాలేమిటి? రచయితలుగా మనం ఎలా మారాలి? మన ఆలోచనలను, రచనా పద్ధతులను ఎలా మార్చుకోవాలి? పాఠకుల అభిరుచి, ఆకాంక్షలకు దీటుగా ఉత్తమ సాహిత్యాన్ని వారి ముంగిటకు ఎలా చేర్చాలి? అని ఆలోచించాలి. ఈ దిశగా విస్తృత స్థాయి కృషి అవసరమైనప్పుడు రచయితల సంఘాలన్నీ నెట్‌ వర్క్‌ ఏర్పాటు చేసుకుని సమాఖ్యగా కూడా అవతరించవచ్చు. సమాఖ్య తరఫున వివిధ దేశ విదేశీ సాహితీవేత్తలను ఆహ్వానించి అక్కడి సాహిత్య పోకడలు, సమాజ స్థితిగతులు, పాఠకుల ధోరణులను తెలుసుకోవడానికి సదస్సులు, వర్క్‌షాప్‌లు, శిక్షణ శిబిరాలు నిర్వహించవచ్చు. ముందే చెప్పుకున్నట్లు రచయితల సంఘమే పుస్తక ప్రచురణతోపాటు పంపిణీ బాధ్యతలను చేపట్టాలి. సంఘం తరఫున ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌ల ద్వారా గ్రూప్‌లను ఏర్పాటు చేసి పుస్తకాన్ని ప్రమోట్‌ చేయాలి. గూగుల్‌ పే, ఫోన్‌ పే ద్వారా డబ్బు పంపినవారికి నేరుగా పుస్తకాలను రిజిస్టర్‌ పోస్టులో పంపవచ్చు. 


భారీ డిస్కౌంట్‌లు అడుగుతున్న పుస్తక విక్రేతలను పూర్తిగా దూరం పెట్టాలి. డిస్కౌంట్‌ భారం లేనందున పుస్తకం ఉత్పత్తి వ్యయాన్ని, పోస్టేజి ఇతరత్రా నిర్వహణ ఖర్చులను కలిపి పుస్తకం ధరను లాభాపేక్ష లేకుండా నిర్ణయించి పాఠకుడి ఆదరణ పొందవచ్చు. 


కొత్తగా విడుదలైన పుస్తకం గురించి మొబైల్‌ గ్రూపులోనే సమీక్షలు, పరిచయాలు చేయాలి. పాఠకుల క్లబ్‌లను కూడా ప్రమోట్‌ చేసుకోవచ్చు. పాఠకుల ఫోన్‌ నంబర్లు, వారు కోరుకునే పుస్తకాలు, అభిరుచులతో డేటా బ్యాంక్‌లను ఏర్పాటు చేసుకొని కొత్త పుస్తకం రాగానే సమా చారం వారికి చేరేలా చూడాలి. ఆన్‌లైన్‌లోనే పుస్తక మేళాలు నిర్వహించి పూర్తి సెట్‌ కొన్నవారికి, లేదా కాపీలు ఎక్కువగా ఉన్న పుస్తకాలకు ప్రత్యేక రాయితీలను ప్రకటించి ఏడాదికోమారు స్టాక్‌ను క్లియర్‌ చేసుకోవచ్చు. రచయితల సంఘం వివిధ ప్రక్రియల్లో వాసిగల పుస్తకా లను ప్రచురిస్తూ పోతే, కాలక్రమంలో ఆ సంఘానికి పాఠక లోకంలో బ్రాండ్‌ ఇమేజి కూడా వస్తుంది. అలా పేరు తెచ్చుకోగలిగితే, వారు ప్రచురించిన పుస్తకాలకు గిరాకీ కూడా పెరుగుతుంది. 


కాపీరైట్‌ రచయితకు ఉండాలా? సంఘానికి ఉండాలా? అనే ప్రశ్న కూడా తలెత్తక మానదు. సంకలనాలు మినహా ఆయా రచయితల పేరుతో ప్రచురించే పుస్తకాలకు కాపీరైట్‌ రచయితకు ఇవ్వడమే సముచితం. సంఘం ఉమ్మడిగా ప్రచురిస్తున్న మూలధనాన్ని రచయితే సమకూరుస్తున్నా డన్న సంగతి మరవకూడదు. అలాగే మొదటి ముద్రణ కాపీలు అమ్ముడయ్యాక, రీప్రింట్‌కు డిమాండ్‌ ఉండదని సంఘంలోని మెజారిటీ సభ్యులు భావించవచ్చు. చేతిలోని కొత్త పుస్తకాలు ప్రచురించాకే కొంత కాలం తర్వాత రీప్రింట్స్‌ చేపడదామనుకోవచ్చు. ఏ నిర్ణయంలోనైనా అంతిమంగా రచయితల ప్రయోజనాలే సంఘానికి శిరోధార్యం కావాలి. ఒక పుస్తకం బాగా అమ్ముడవుతూ పెట్టుబడిపోను మిగులు తేలితే రచయితకు సంఘం తరఫున పారితోషికం కూడా చెల్లించవచ్చు.  


చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిదన్న మాటనే నినాదాన్నే స్ఫూర్తిగా తీసుకుని రచయితలు కార్యాచరణకు దిగాలి. 

గోవిందరాజు చక్రధర్‌

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.