శుభఫలాలు ఇచ్చే మాసం

ABN , First Publish Date - 2021-03-19T05:30:00+05:30 IST

ఇస్లాం మాసాల్లో ఎనిమిదవది షాబాన్‌. ఏడాదిలోని పన్నెండు మాసాల్లో షాబాన్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ‘ఇది నా మాసం’ అని మహా ప్రవర్త మహమ్మద్‌ స్వయంగా ప్రకటించారు

శుభఫలాలు ఇచ్చే మాసం

ఇస్లాం మాసాల్లో ఎనిమిదవది షాబాన్‌. ఏడాదిలోని పన్నెండు మాసాల్లో షాబాన్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ‘ఇది నా మాసం’ అని మహా ప్రవర్త మహమ్మద్‌ స్వయంగా ప్రకటించారు. ‘‘షాబాన్‌ నా మాసం. రజబ్‌ అల్లాహ్‌ మాసం. రమజాన్‌ నా జాతి మాసం. షాబాన్‌ మాసం మానవులను పాపాల నుంచి దూరం చేస్తుంది. రమజాన్‌ మాసం పరిశుద్ధులను చేస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.


షాబాన్‌ మాసం గురించి మహా ప్రవక్త ఒక నెల రోజుల ముందు నుంచే ప్రార్థన చేసేవారు. ‘‘ఓ అల్లాహ్‌! మాకు రజబ్‌, రమజాన్‌ మధ్య ఉన్న నెల షాబాన్‌. ప్రజలు దీని ప్రాధాన్యం తెలుసుకోవడంలో అలక్ష్యంతో ఉన్నారు. దాసుల కృత్యాల వివరాలను అల్లాహ్‌ దగ్గరకు ఈ నెలలో తీసుకొని వెళ్ళే సమయంలో... ఉపవాస దీక్ష పాటించడాన్ని నేను ఇష్టపడతాను’’ అని ఆయన అనేవారు. షాబాన్‌ మాసంలో ప్రత్యేక ఉపవాసాలను మహా ప్రవక్త పాటించేవారు. ‘‘రమజాన్‌ నెలలో తప్ప మొత్తం నెలంతా మహా ప్రవక్త ఉపవాసం ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. 


అలాగే షాబాన్‌ మాసంలో పాటించినంత ఎక్కువగా ఉపవాసాలు చేయడం కూడా నేను చూడలేదు’’ అని ప్రవక్త సన్నిహితురాలు హజ్రత్‌ ఆయిషా వెల్లడించారు. ‘‘షాబాన్‌ మాసంలో సగం రోజుల తరువాత ఉపవాసాలు చేయకూడదు. అంటే, నెలలో చివరి పదిహేను రోజులూ ఉపవాసాలు చేయకూడదు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ముస్లింలు నన్నే అనుసరించి, ఎక్కువ రోజులు ఉపవాసం ఉంటే... శరీరం బలహీనపడుతుంది. తరువాత వచ్చే రమజాన్‌ మాసంలో ఉపవాసాలకు అవసరమైన శక్తి లోపిస్తుంది’’ అని మహా ప్రవక్త స్పష్టం చేశారు. రమజాన్‌ మాసంలో ఉపవాసాలు విధిగా పాటించాల్సి ఉంటుంది. తన జాతి గురించి ఎల్లప్పుడూ, ప్రతిక్షణం తపించే మహా ప్రవక్త మహమ్మద్‌ రమజాన్‌ నెల ఉపవాసాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా.... షాబాన్‌ ఉపవాసాల పరిమితి గురించి ప్రకటన చేశారు. దీని ప్రకారం షాబాన్‌ మాసంలో మొదటి పదిహేను రోజులూ ఉపవాసాలు చేయాలి. మిగిలిన పదిహేను రోజులూ విరమించాలి.


హజ్రత్‌ ఆయిషా వద్దకు ఒక మహిళ వచ్చి, రజబ్‌ మాసంలో ఉపవాసాల గురించి ప్రస్తావించింది. ‘‘ఒకవేళ నీకు రమజాన్‌ ఉపవాసాల తరువాత... వేరే మాసంలో ఉపవాసాలు చేయాలనే ఆసక్తి ఉంటే... షాబాన్‌ మాసంలో ఉపవాసాలు పాటించు. ఎందుకంటే ఈ మాసం ఎన్నో శుభాలు కలిగిన మాసం’’ అని ఆయిషా చెప్పారు. అదే విధంగా ఈ మాసం విశిష్టతను హజ్రత్‌ అబ్దుల్‌ ఖాదర్‌ జిలానీ వెల్లడిస్తూ- ‘‘ఈ నెలలో శుభాలనూ, పుణ్య ఫలాలనూ అల్లాహ్‌ సమృద్ధిగా ప్రసాదిస్తాడు. పాపాలను దూరం చేస్తాడు. కాబట్టి తెలివైన ప్రతి విశ్వాసి ఈ మాసాన్ని ఎలాంటి నిర్లక్ష్యం చెయ్యకూడదు. అశ్రద్ధ వహించకూడదు. రమజాన్‌ నెలను స్వాగతించడానికి తనను తాను సన్నద్ధం చేసుకోవాలి. చేసిన పనులకు పశ్చాత్తాపం చెందారి. ఎక్కువ ప్రార్ధనలు చేసి దైవ సామీప్యాన్ని పొందాలి’’ అని సూచించారు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2021-03-19T05:30:00+05:30 IST