
‘‘కామెడీ సినిమాలకు ఆదరణ బావుంటుంది. కానీ అవార్డులు రావు’’ అంటున్నారు హీరో అల్లరి నరేష్. ఆయన నటించిన ‘బంగారు బుల్లోడు’ సినిమా శనివారం విడుదల కానున్న నేపథ్యంలో విలేకర్లతో మాట్లాడారు. ఆ విశేషాలు..
గ్రామీణ నేపథ్యంలో కామెడీ సినిమా చేసి చాలా కాలం అయింది. దర్శకుడు గిరి చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నా పాత్ర అంతా బంగారం లోన్ల చుట్టూ తిరుగుతుంది. అందుకే నిర్మాత అనిల్ సుంకర ‘బంగారు బుల్లోడు’ టైటిల్ సూచించారు. హీరోయిన్ పూజా ఝావేరి విలేజ్లో పుట్టి డల్లాస్లోని విల్లాస్లో జీవించాలనే కోరికున్న అమ్మాయిగా విచిత్రమైన పాత్ర పోషించింది.
ఇందులో ‘స్వాతిలో ముత్యమంత ముద్దులా’ అనే హిట్ పాటను రీమిక్స్ చేశాం. సంగీత దర్శకుడు సాయి కార్తీక్, కొరియోగ్రాఫర్ యశ్వంత్ చాలా శ్రద్ధ తీసుకొని ఈ సాంగ్ చేశారు.
జనాలు నా దగ్గర నుంచి కామెడీ కోరుకుంటారు. సీరియస్గా ఏదన్నా చేస్తే మా అమ్మ కూడా ‘నీకెందుకురా ఇవన్నీ.. హాయిగా కామెడీ సినిమాలు చేసుకో’ అని చెబుతుంటుంది. నేను 56 సినిమాలు చేశా. వీటిలో ఎక్కువ కామెడీవే. వీటికి ఆదరణ లభించింది కానీ ఒక్క అవార్డు కూడా రాలేదు. కంటెంట్ ఉన్న కథలు కూడా చేస్తా. తాజాగా చేసిన ‘నాంది’ అలాంటిదే. దీనిలో ఒక న్యూడ్ సీన్ కూడా ఉంది. బంగారు బుల్లోడు ఇంటి భోజనం లాంటిది. నాంది రెస్టారెంట్ భోజనం లాంటిది.
ఎప్పటికైనా డైరక్షన్ చేయాలనేది నా కోరిక. దీని కోసం కొన్ని కథలు కూడా రాశా. ఖాళీ సమయంలో వాటిని డెవలప్ చేస్తుంటా. నేను రాసిన కథలో నేను హీరోగా నటించను. ఒకటి రెండేళ్లలో డైరక్షన్ చేస్తా!