బురదమయమైన ఐవోసీ ప్రాంగణం

ABN , First Publish Date - 2022-08-08T05:20:40+05:30 IST

భారీ వర్షానికి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) ప్రాంగణం జలమయమైంది.

బురదమయమైన ఐవోసీ ప్రాంగణం
శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బురదమయమైన ఐవోసీ ప్రాంగణం

వాన నీటిలో మునిగిపోయిన పలు ద్విచక్ర వాహనాలు

సమస్య పరిష్కారానికి జీవీఎంసీ అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు వేడుకోలు

మల్కాపురం, ఆగస్టు 7: భారీ వర్షానికి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) ప్రాంగణం జలమయమైంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఐవోసీ ప్రాంగణమంతా నీట మునిగింది. దీంతో ఇక్కడ పార్కింగ్‌ చేసిన పలువురి కార్మికుల ద్విచక్ర వాహనాలు వాన నీటిలో మునిగిపోవడంతో మరమ్మతులకు గురయ్యాయి. అలాగే ఐవోసీ కంపెనీలోని చమురు లోడింగ్‌ విభాగంలోకి వర్షపు నీరు చేరడంతో ఈ ప్రాంగణమంతా బురదమయంగా మరింది. దీంతో చమురు లోడింగ్‌కు పూర్తిగా విఘాతం కలిగింది. హెచ్‌పీసీఎల్‌ యజమాన్యం ఐవోసీ కంపెనీకి ఎదురుగా కాలువ నిర్మాణం చేపట్టక ముందు ఎంత వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బందులు వుండేవి కావు. కాలువ నిర్మించాకే ఈ దుస్థితి నెలకొందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా భారీ వర్షం కురిస్తే సాధారణంగా మోకాల్లోతులో నీరు వస్తుంది. కానీ ఇక్కడ  ఏకధాటిగా వాన కురిస్తే మాత్రం పీకల్లోతు వరకు వరద నీరు నిలిచిపోతోంది. ఈ కారణంగా ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగిపోవడంతో ఇంజన్లు పాడైపోతున్నాయి. ఈ పరిస్థితిని  చక్కదిద్దాలని పలుమార్లు ఐవోసీ అధికారులకు, హెచ్‌పీసీఎల్‌ అధికారులకు లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జీవీఎంసీ అధికారుల దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లినా ఫలితం శూన్యంగా మారిందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఐవోసీ అధికారులకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్పందించి ఇక్కడి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 




Updated Date - 2022-08-08T05:20:40+05:30 IST