జాతీయ గీతాన్ని మమత అవమానించారు : బీజేపీ నేత

ABN , First Publish Date - 2021-12-02T20:46:05+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మహారాష్ట్ర

జాతీయ గీతాన్ని మమత అవమానించారు : బీజేపీ నేత

ముంబై : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మహారాష్ట్ర పర్యటనలో జాతీయ గీతాన్ని అవమానించారని ముంబై బీజేపీ నేత ఒకరు ఆరోపించారు. ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులకు లేఖ రాశారు. అయితే ఏ కార్యక్రమంలో ఆమె ఈ నేరానికి పాల్పడ్డారో ఆయన స్పష్టంగా పేర్కొనలేదు. ఆమె మంగళ, బుధవారాల్లో ముంబైలో శివసేన, ఎన్‌సీపీ నేతలను కలిశారు. 


ముంబై నగర పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రలేకి బీజేపీ నగర శాఖ కార్యదర్శి వివేకానంద గుప్తా ఓ లేఖ రాశారు. మమత బెనర్జీ అర్థాంతరంగా జాతీయ గీతాన్ని నిలిపేయించారని, ఆమెపై కేసు నమోదు చేయాలని కోరారు. ఆమె చర్య జాతీయ గీతాన్ని తీవ్రంగా అవమానించడమేనని తెలిపారు. జాతీయ ఆదర్శ చిహ్నాలకు అవమానాన్ని నిరోధించే చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఆమె నేరానికి పాల్పడ్డారని ఆరోపించారు. జాతీయ గీతాన్ని ఆలపించేటపుడు, వినిపించేటపుడు ప్రేక్షకులు సావధానంగా నిల్చోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2015లో ఇచ్చిన ఆదేశాలు చెప్తున్నాయన్నారు. ఈ నిబంధనలన్నిటినీ ఉల్లంఘించిన మమత బెనర్జీపై కేసు నమోదు చేయాలని గుప్తా కోరారు. 


ఇదిలావుండగా, మమత బెనర్జీ ఏ కార్యక్రమంలో పాల్గొన్నపుడు ఈ విధంగా జాతీయ గీతాన్ని అవమానించారో గుప్తా నిర్దిష్టంగా పేర్కొనలేదు. 


Updated Date - 2021-12-02T20:46:05+05:30 IST