ltrScrptTheme3

500 శ్రీకృష్ణ పెయింటింగ్స్ వేసిన ముస్లిం మహిళ..

Sep 28 2021 @ 19:25PM

పఠనంతిట్ట : కేరళలోని కొజిక్కోడ్‌కు చెందిన ఓ ముస్లిం మహిళ జస్న సలీమ్ చాలా సంతోషిస్తున్నారు. తాను వేసిన శ్రీకృష్ణుని పెయింటింగ్‌ను పండలంలోని ఉలనాడు శ్రీకృష్ణ స్వామి దేవాలయంలో ఆ దేవునికే సమర్పించగలగడమే అందుకు కారణం. ఇందుకు అవకాశం కల్పించిన దేవాలయ అధికారులకు ధన్యవాదాలు చెప్తూ, తన సంతోషానికి హద్దులు లేవని ఆమె చెప్పారు. 


జస్న సలీమ్ (28) సుమారు ఆరు సంవత్సరాల నుంచి శ్రీకృష్ణుని చిత్రాలను గీస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 500 శ్రీకృష్ణ పెయింటింగ్స్ వేశారు. తాను వేసిన ఓ శ్రీకృష్ణుని పెయింటింగ్‌ను ఆదివారం ఆమె పండలంలోని ఉలనాడు శ్రీకృష్ణ స్వామి దేవాలయంలో సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శ్రీకృష్ణుని విగ్రహాన్ని దర్శించుకోవడం, తన పెయింటింగ్‌ను ఆయనకు సమర్పించడం తన జీవితంలో పెద్ద కల అని చెప్పారు. తన కల నెరవేరడంతో తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి తనకు మాటలు రావడం లేదని చెప్పారు. దేవాలయం అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. 


శ్రీకృష్ణుని పెయింటింగ్స్‌పై ఆసక్తి ఏర్పడటానికి కారణాన్ని వివరిస్తూ, తమ ఇంటి నిర్మాణం కోసం కొన్ని పాత పేపర్లను కొన్నామని జస్న చెప్పారు. వాటిలో శ్రీకృష్ణుడు, వెన్న కుండ పక్కన ఉన్న ఫొటో తన దృష్టిని ఆకర్షించిందన్నారు. తనను తన తల్లిదండ్రులు ప్రేమగా కన్నా అని పిలిచేవారని, దీంతో శ్రీకృష్ణుని బొమ్మలు గీయడంపై ఆసక్తి ఏర్పడిందని చెప్పారు. తాను గీచిన తొలి చిత్రాన్ని ఓ హిందూ ఫ్రెండ్‌కు ఇచ్చానని, ఆ చిత్రాన్ని తమ ఇంట్లో పెట్టుకున్న తర్వాత తమకు మంచి జరుగుతోందని ఆ కుటుంబం చెప్పిందని తెలిపారు. అప్పటి నుంచి శ్రీకృష్ణుని చిత్రాల కోసం చాలా మంది తనను సంప్రదిస్తున్నారన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ చిత్రం వైరల్ అవడంతో ఇటీవల ఓ భక్త బృందం తనను సంప్రదించిందన్నారు. ఉలనాడు శ్రీకృష్ణ స్వామి దేవాలయంలో సమర్పించడానికి ఓ శ్రీకృష్ణుని పెయింటింగ్ వేయాలని కోరారని చెప్పారు. 


గురువాయూర్ దేవాలయానికి ఆరు సంవత్సరాల నుంచి తాను తన పెయింటింగ్స్‌ను బహుమతిగా ఇస్తున్నానని చెప్పారు. శ్రీకృష్ణుడు, వెన్న కుండ పక్కన ఉన్న చిత్రాన్ని మాత్రమే తాను కచ్చితంగా గీయగలనని తెలిపారు. ఈ చిత్రాన్నే అందరూ డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ చిత్రాన్ని ఏదో ఒక రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా బహుమతిగా ఇవ్వగలనని భావిస్తున్నానని చెప్పారు. 


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.