ఇంటి వద్దకే రేషన్‌ సరుకుల పంపిణీతో నూతన అధ్యాయం

ABN , First Publish Date - 2021-01-22T05:51:17+05:30 IST

చౌక డిపోల ద్వారా ఇచ్చే నాణ్యమైన బియ్యం, ఇతర సరుకులు పేదోడి ఇంటి వద్దకే అందించడం ద్వారా నూతన అధ్యాయం ప్రారంభమైందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

ఇంటి వద్దకే రేషన్‌ సరుకుల పంపిణీతో నూతన అధ్యాయం
వాహనం నడుపుతున్న మంత్రి ముత్తంశెట్టి, పక్కన వాహనాలతో డ్రైవర్లు

మంత్రి కురసాల కన్నబాబు

అట్టహాసంగా వాహనాల ప్రారంభం


విశాఖపట్నం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): చౌక డిపోల ద్వారా ఇచ్చే నాణ్యమైన బియ్యం, ఇతర సరుకులు పేదోడి ఇంటి వద్దకే అందించడం ద్వారా నూతన అధ్యాయం ప్రారంభమైందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం బీచ్‌రోడ్‌లో ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద ఇంటింటికి రేషన్‌ సరుకుల పంపిణీ వాహనాలను జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి ముందే ఎలకా్ట్రనిక్‌ తూకం యంత్రం ద్వారా బియ్యం, ఇతర సరుకులు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పేదవాడికి డిపో డీలర్ల వేధింపులు ఉండవని ఆయన చెప్పారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 12.50 లక్షల పేద వర్గాలకు ఇంటి వద్దకే సరుకులు అందించడానికి 828 వాహనాలను కొనుగోలుచేసి పేద వర్గాలకు అందించామన్నారు. కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ మాట్లాడుతూ రేషన్‌ వ్యవస్థలో ప్రభుత్వం పెనుమార్పులు తీసుకువచ్చిందన్నారు. వాహనాల కొనుగోలులో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏజీఎం వైవీఎస్‌కే రావు సహకరించారని చెప్పారు. ఈ సందర్భంగా జేసీ వేణుగోపాలరెడ్డి, పౌరసరఫరాల శాఖ, ఎస్సీ. బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల అధికారులను ఆయన అభినందించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 2176 చౌకడిపోల పరిధిలో 12.50 లక్షల మంది కార్డుదారులకు ఇంటి వద్దకే సరుకుల పంపిణీలో గుణాత్మకమైన మార్పు తీసుకువస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, యూవీ కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్‌, ఎ.అదీప్‌రాజ్‌, శెట్టి ఫల్గుణుడు, భాగ్యలక్ష్మి, పెట్ల ఉమాశంకర్‌గణేష్‌, జీవీఎంసీ కమిషనర్‌ సృజన, డీసీసీబీ చైర్‌పర్సన్‌ ఇన్‌చార్జి సుకుమారవర్మ, రెల్లి కార్పొరేషన్‌ చైర్మన్‌ మధుసూదన్‌, పౌరసరఫరాల అధికారులు శివప్రసాద్‌, నిర్మలకుమారి, వెంకటరమణ పాల్గొన్నారు. విశాఖ ఆర్డీవో కె. పెంచల కిషోర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన తరువాత మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వాహనం నడిపారు. మంత్రి వెంట మిగిలిన వాహనాలు బారులు తీరారు. అక్కడ నుంచి వాహనాలను పీఎంపాలెంలో సాంకేతిక ఇంజనీరింగ్‌ కళాశాల మైదానానికి తీసుకువెళ్లారు. కాగా ఈ కార్యక్రమం కోసం బీచ్‌ రోడ్డులో గురువారం కేవలం పాదచారులను మాత్రమే అనుమతించారు. అప్ఫుఘర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను పార్కుహోటల్‌ జంక్షన్‌ వద్ద నిలిపి వేయడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.


Updated Date - 2021-01-22T05:51:17+05:30 IST