Infectious Diseases : తీవ్రమైన వాతావరణ మార్పులతో అంటువ్యాధుల విజృంభణ

ABN , First Publish Date - 2022-08-10T00:21:01+05:30 IST

వాతావరణ మార్పులు (Climate Change), అంటువ్యాధుల (Infectious Diseases)

Infectious Diseases : తీవ్రమైన వాతావరణ మార్పులతో అంటువ్యాధుల విజృంభణ

న్యూఢిల్లీ : వాతావరణ మార్పులు (Climate Change), అంటువ్యాధుల (Infectious Diseases) మధ్య సంబంధం ఉందని పరిశోధకులు నిర్థరించారు. వాతావరణంలో విపరీతమైన మార్పుల వల్ల మనకు తెలిసిన అంటువ్యాధుల్లో 58 శాతం వరకు తీవ్రమవుతున్నట్లు గుర్తించారు. కోవిడ్-19 మహమ్మారి, మంకీపాక్స్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో ఈ నివేదిక విడుదలైంది.


యూరోప్‌లోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. దావానలాలతో అమెరికా ఇబ్బందులుపడుతోంది. వందలాది ఎకరాల్లో అడవులు కాలిపోయాయి. లక్షలాది మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోవలసి వచ్చింది. ఇలాంటి పరిణామాలకు కారణం విపరీతమైన వాతావరణ పరిస్థితులేనని పరిశోధకులు చెప్తున్నారు. 


ఈ అధ్యయన నివేదిక నేచర్ క్లైమేట్ ఛేంజ్ అనే జర్నల్‌ (Nature Climate Change)లో ప్రచురితమైంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు 1,006 మార్గాల్లో అంటువ్యాధులను వ్యాపింపజేస్తున్నాయని వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు. గ్రీన్‌హౌస్ గ్యాస్ (Greenhouse Gas) ఉద్గారాలను తగ్గించవలసిన అవసరం చాలా ఉందని తమ అధ్యయనం వెల్లడించిందని చెప్పారు. వాతావరణ మార్పులకు ఈ ఉద్గారాలే మూలమని తెలిపారు. 


విస్కన్సిన్-మేడిసన్ విశ్వవిద్యాలయంలోని గ్లోబల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌ డాక్టర్ జొనాథన్ మీడియాతో మాట్లాడుతూ, మానవుడి ఆరోగ్యంపై వాతావరణం ప్రభావం గురించి తమ అధ్యయనం వివరించినట్లు చెప్పారు. వాతావరణం మారుతూ ఉంటే, ఈ అంటువ్యాధుల వల్ల కలిగే నష్టం స్థాయి కూడా మారుతోందన్నారు. ఈ అధ్యయనంలో అన్ని రకాల రోగాలను పరిశీలించామని, ఆస్త్మా, అలర్జీలు, జంతువులు కాటు వేయడం వంటి అంటువ్యాధులు కానివాటిని కూడా పరిశీలించామని చెప్పారు. రకరకాల వ్యాధులకు వాతావరణ మార్పులతో ఎలాంటి సంబంధం ఉందో చూసినట్లు తెలిపారు. 286 రోగాలను విశ్లేషించామని, వీటిలో 223 రోగాలు తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల మరింత దయనీయ స్థితికి చేరినట్లు గుర్తించామని చెప్పారు. 


ఎమోరీ యూనివర్సిటీ ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ కార్లోస్ డెల్ రియో మాట్లాడుతూ, ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. మానవ రోగ కారకాలపై వాతావరణ మార్పుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్తున్నాయన్నారు. అంటువ్యాధులు, మైక్రోబయాలజీ రంగంలోనివారు వాతావరణ మార్పులను తమ ప్రాధాన్యతాంశాల్లో చేర్చుకోవాలన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న విపత్తును నిరోధించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పారు. 


Updated Date - 2022-08-10T00:21:01+05:30 IST