భౌతిక దూరం కన్నా మాస్క్‌తో సత్ఫలితాలు

ABN , First Publish Date - 2021-12-07T22:06:47+05:30 IST

నేను మాస్క్ ధరిస్తే నీకు రక్ష, నువ్వు మాస్క్ ధరిస్తే నాకు రక్ష

భౌతిక దూరం కన్నా మాస్క్‌తో సత్ఫలితాలు

న్యూఢిల్లీ : ‘నేను మాస్క్ ధరిస్తే నీకు రక్ష, నువ్వు మాస్క్ ధరిస్తే నాకు రక్ష’ అనేది గొట్టింజెన్, కార్నెల్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల అధ్యయనంలో రుజువైంది. మాస్క్ ధరించడం వల్ల భౌతిక దూరం పాటించడం కన్నా ఎక్కువ సత్ఫలితాలు ఉంటాయని తేలింది. ముఖానికి బిగుతుగా లేని మాస్క్‌తోనైనా మంచి ఫలితాలు కనిపించినట్లు పేర్కొంది. ఈ అద్యయన నివేదిక పీఎన్ఏఎస్ (ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్) జర్నల్‌లో ప్రచురితమైంది. 


ఈ అధ్యయనంలో భాగంగా ఏడుగురిని ఈ శాస్త్రవేత్తలు పరిశీలించారు. వీరు ముక్కు ద్వారా సాధారణంగా ఊపిరి తీసుకుని, వదిలేవారు. వీరిని కోవిడ్-19 వైరల్ లోడ్‌కు గురి చేసినపుడు, వీరు, కోవిడ్-19 సోకినవారు ఒకరికొకరు దాదాపు 10 అడుగుల దూరంలో ఉన్నప్పటికీ, కొద్ది నిమిషాలపాటు మాట్లాడుకుంటే, ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం 90 శాతం ఉంటుందని నిర్ధరణ అయింది. 


ముఖానికి మాస్క్‌ ధరించిన వ్యక్తి, కోవిడ్-19 సోకిన వ్యక్తి సుమారు 5 అడుగుల దూరంలో ఉంటూ, మాట్లాడుకుంటే ఎదురయ్యే పరిస్థితిని పరిశీలించారు. సర్జికల్ మాస్క్ ధరించినట్లయితే 30 నిమిషాలపాటు మాట్లాడుకుంటే, ఈ వ్యాధి సోకే అవకాశం 90 శాతం ఉంటుందని నిర్ధరణ అయింది. FFP2 మాస్క్ ధరించినట్లయితే, ఓ గంటసేపు మాట్లాడుకున్న తర్వాత ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం 20 శాతం ఉంటుందని తేలింది. సాధారణ వ్యక్తితోపాటు కోవిడ్ సోకిన వ్యక్తి కూడా సర్జికల్ మాస్క్ ధరించినపుడు, ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి ఓ గంటసేపు మాట్లాడిన తర్వాత సాధారణ వ్యక్తికి ఈ వ్యాధి సోకే అవకాశం 30 శాతం ఉందని వెల్లడైంది. ఇరువురూ ముఖానికి బిగుతుగా ఉండే FFP2 మాస్క్‌లను ధరించి, మాట్లాడుకుంటే, ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం 0.4 శాతం మాత్రమేనని వెల్లడైంది. 


చివరికి ఈ పరిశోధన బృందం నిర్థరించినది ఏమిటంటే, సమూహంలో ఉన్నపుడు సరైన మాస్క్‌లను ధరించడం వల్ల ధరించినవారికి, ఇతరులకు అద్భుతమైన రక్షణ లభిస్తుంది. భౌతిక దూరం పాటించడానికి ప్రాధాన్యం తగ్గుతుంది. FFP2/N95 మాస్క్‌లను సర్జికల్ మాస్క్‌లతో పోల్చినపుడు, FFP2/N95 మాస్క్ ధరించడం వల్ల దాదాపు 100 రెట్లు ఎక్కువ రక్షణ లభిస్తుంది. 


డెన్వర్ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ, ఏరోసోల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ అలెక్స్ హఫ్‌మన్ ఈ ఫలితాలను ట్విటర్ వేదికగా వివరించారు. 


Updated Date - 2021-12-07T22:06:47+05:30 IST