పత్తి సాగులో నూతన ఒరవడి

ABN , First Publish Date - 2022-07-02T06:29:45+05:30 IST

పత్తి సాగులో నూతన ఒరవడి

పత్తి సాగులో నూతన ఒరవడి
నెల్లికుదురు మండలంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి విత్తనాలు సాగు చేయిస్తున్న అధికారులు

వినూత్న పద్ధతికి శ్రీకారం 

జిల్లాలో ప్రయోగాత్మకంగా వంద ఎకరాల్లో...

సాగు చేస్తే ప్రభుత్వం నుంచి రూ.4వేలు నజరానా

వ్యవసాయ శాఖ ప్రచారం


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, జూలై 1 : తేలికపాటి భూములు, ఎర్ర నేలలు, చెలక నేలల్లో పత్తిలో అధిక దిగుబడి సాధించేందుకు అధిక సాంద్రత పద్ధతిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందుకోసం అధిక సాంద్రత పత్తిసాగుకు తొలి ప్రయత్నంగా  ప్రయోగాత్మకంగా చేపట్టాలని జిల్లాలో టార్గెట్‌ కేటాయించగా, మహబూబాబాద్‌ జిల్లాలో వందెకరాల్లో పత్తి సాగుకు నిర్ణయించారు. ఎక్కువ మొక్కలు పెట్టి ఎక్కువ కాస్తే దిగుబడి భారీగా వస్తుందని సరికొత్త పద్ధతైన అధిక సాంద్రత పద్ధతిలో పత్తిసాగు చేయడానికి నిర్ణయించారు. ఈ వినూత్న పద్ధతిలో పత్తి సాగు చేయడం వల్ల గులాబీరంగు పురుగు నియంత్రించి తద్వార అధిక దిగుబడి సాధించవచ్చునని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇందుకోసం మహబూబాబాద్‌ జిల్లాలో నాలుగు మండలాలను ఎంపిక చేయగా నెల్లికుదురు మండలం నుంచి పత్తి విత్తనాలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


సాంప్రదాయ పద్ధతిలో...

జిల్లాలో సాంప్రదాయ పద్ధతిలో పత్తిసాగు గత పూర్వ నుంచి కొనసాగుతుంది. మూడు ఫీట్లు ఇన్‌టూ మూడు ఫీట్లు పద్ధతిలో ఎకరానికి 7వేల మొక్కలు (రెండు ప్యాకెట్లు విత్తనాలు ) నాటుతారు. మొక్కకు మొక్కకు మధ్య ఎడం ఉంటుంది. తేలికపాటి భూములు, ఎర్ర నేలలు, చెలక నేలల్లో పత్తి 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, రేగడి నేలల్లో 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జనవరి, ఫిబ్రవరి వరకు ఈపంట కాలం ఉండడంతో గులాబీరంగు పురుగు కూడా ఉధృతంగా ఆశించి పంటను దెబ్బతీస్తుంది. దీంతో భారీగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ప్రభుత్వం ఈ సరికొత్త పద్ధతిలో పత్తి సాగు చేయడానికి ముందుకు వచ్చింది. 


అధిక సాంద్రత పద్ధతిలో..

పత్తి పంటలో రెట్టింపు మొక్కలు పెట్టించి ఎక్కువ కాయలు కాయడం, అధిక దిగుబడి సాధించడంతో రైతులకు ఆర్థిక పుష్టిని పెంపొందించేందుకు అధిక సాంద్రత పద్ధతిని అవలంబించనున్నారు. ఈ పద్ధతిలో జూలై 15 వరకు పత్తి విత్తనాలు నాటుకుంటే నవంబర్‌, డిసెంబర్‌ నెలల కల్లా పత్తి దిగుబడి వస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం నూజివీడుకు చెందిన ఎన్‌సీఎస్‌-2778 బీటీ-2 అర్మిత, ఎన్‌సీఎస్‌927 బీటీ-2 సిరి విత్తనాలు వేసుకోవాలని ప్రభుత్వం జిల్లాకు ఈ రకాలను కేటాయించింది. ఈ నూతన పద్ధతిలో ఎకరానికి 5 ప్యాకెట్లు రెండున్నర కిలోల చొప్పున పడతాయి. ఎర్ర, తేలికపాటి భూముల్లో 90సెంటీమీటర్లు ఇన్‌టూ 22.5 సెంటీమీటర్ల వెడల్పుతో పత్తి విత్తనాలను ఒక ఎకరంలో 25వేల మొక్కలు నాటుకోవాలి. మొపిక్వాట్‌ క్లోరైడ్‌ 5శాతం మందును 45 రోజులకు, 65, 85 రోజులకు వరుసగా 100 మిల్లిలీటర్లు 150, 250 మిల్లిలీటర్ల చొప్పున ఎకరాకు తప్పనిసరిగా పిచికారి చేసినట్లయితే మొక్కలు ఎత్తు పెరగకుండ నియంత్రించడం జరుగుతుంది. దాని వల్ల పురుగు, ఎరువుల మందులు సమర్థవంతంగా కొట్టడం జరుగుతుంది. దాని ఫలితంగా నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లోనే పత్తిపంట చేతికి వస్తుంది. గులాబీ రంగు పురుగు ఉధృతి నుంచి సోకకుండానే తప్పించుకుంటుంది. ఈ పద్ధతి వల్ల రెండో పైరు కూడా వేసుకోవడానికి రైతుకు అనుకూలంగా ఉంటుంది. రెండుసార్లు పైరు పండించడం వల్ల రైతులకు రెట్టింపు ఆదాయం లభిస్తుంది. 


నాలుగు మండలాల ఎంపిక..

అధిక సాంద్రత పద్ధతిలో జిల్లాలలో పత్తి సాగు చేయడానికి వంద ఎకరాలు ప్రయోగాత్మకంగా పండించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌ విధించింది. అందులో భాగంగా నెల్లికుదురు, కురవి, గూడూరు, మహబూబాబాద్‌ మండలాల్లో ఈ సరికొత్త పద్ధతిన సాగు చేయడానికి జిల్లా వ్యవసాయాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో నెల్లికుదురు మండలంలో ఈ నూతన పద్ధతి ద్వారా పత్తి విత్తనాలు పెట్టడం ప్రారంభించారు. అనంతరం మిగతా మండలాల్లో విత్తనాలు పెట్టడం ఆరంభిస్తారు. ఈ నూతన పద్ధతి అమలు చేయడానికి హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన శిక్షణ శిబిరాల్లో జిల్లా వ్యవసాయ శాఖ నుంచి డివిజన్‌ సహాయ సంచాలకులు ఎం.లక్ష్మినారాయణ శిక్షణ పొంది వచ్చారు.


రూ.4వేల నజరానా..

ఈ విధానంలో పత్తి సాగు చేయాల నుకున్న రైతు ముందుగా ఏఈవోకు దరఖాస్తు చేసుకోవాలి. ఏఈవో రైతు భూమి వద్దకు వెళ్లి తేలిక భూములా... ఎర్ర, చెలక నేలలు ఉంటే ఓ ఫారంలో రైతు వివరాలు, బ్యాంకు అకౌంట్‌ రాసి రైతుకు ఇస్తారు. రైతు తన సొంత డ బ్బులతో నూజివీడు కంపెనీకి చెందిన ఐదు ప్యాకెట్ల విత్తనాలు ఖరీదు చేసు కోవాలి. ఈ విత్తనాల కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ అందదు. వి త్తనం పెట్టుకుంది మొదలు పంట ది గుబడి చేతికి వచ్చేంత వరకు వ్యవసా యాధికారులు చెప్పిన క్రిమిసంహారిక మందులు పిచికారి చేసి పద్ధతిలో సాగు చేస్తే దశలవారీగా పంటల వివ రాలను ఫొటోల ద్వారా ప్రభుత్వ ప్రత్యే క యాప్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తా రు. పత్తిని ప్రత్యక్షంగా సాగుచేస్తున్న రైతు గానీ, కౌలు రైతుగానీ ఉన్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా రూ.4 వేలు రైతుల ఖాతాల్లోకి ఆన్‌లైన్‌ ద్వారా జమ అవుతాయని వ్యవసాయాధికారి తెలిపారు. 


అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తే లాభదాయకం :ఎం.లక్ష్మీనారాయణ, డివిజన్‌ వ్యవసాయ సహాయ సంచాలకుడు, మహబూబాబాద్‌ 

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లాలో తేలికపాటి భూములు, ఎర్ర, చెలక నేలల్లో అ ధిక సాంద్రత పద్ధతిన పత్తిసాగు చేయడం జరుగుతోంది. ప్రయోగాత్మకంగా గాను ఈ పద్ధతిన జిల్లాల్లో నాలుగు మండలాల్లో వంద ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది. ఎకరాకు 25 వేల మొక్కలు పెట్టడం వల్ల ఎక్కువ మొక్కలతో ఎక్కువగా కాయలు కాసి ఎక్కువ దిగుబడి వస్తుంది. దీంతో రైతులు లాభసాటిగా మారుతారు. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లోనే ఖాతా రావడంతో గులాబీరంగు పురుగును అరికట్టవచ్చు. ఈ పద్ధతిన సాగు చేసిన రైతుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేల నజరానా ఇస్తుంది. 

Updated Date - 2022-07-02T06:29:45+05:30 IST