పాప విముక్తి కలిగించే రాత్రి!

ABN , First Publish Date - 2021-03-26T05:42:12+05:30 IST

కరుణామయుడైన సృష్టి కర్త అల్లాహ్‌ సమస్త జీవరాశుల మీదా అమితమైన దయావర్షం కురిపిస్తాడు. అంతులేని శుభాలను ప్రసాదిస్తాడు.

పాప విముక్తి కలిగించే రాత్రి!

కరుణామయుడైన సృష్టి కర్త అల్లాహ్‌ సమస్త జీవరాశుల మీదా అమితమైన దయావర్షం కురిపిస్తాడు. అంతులేని శుభాలను ప్రసాదిస్తాడు. మానవుల కోరికలు తీర్చడానికీ, వారికి పుణ్యఫలాలను అందజేయడానికీ కొన్ని సువర్ణావకాశాలను ఆయన కల్పిస్తున్నాడు. ఆ అవకాశాలను వినియోగించుకొని... ఆయనను వేడుకున్న వారి కష్టాలను దూరం చేస్తాడు. దీని కోసం ఏడాదిలో కొన్ని రాత్రులను ఆరాధనల కోసం అల్లాహ్‌ ప్రత్యేకించాడు. అలాంటి పవిత్ర రాత్రులలో ముఖ్యమైనవి రమజాన్‌ మాసంలోని పెద్ద రాత్రి, మహిమాన్వితమైన రాత్రి ‘లైలతుల్‌ ఖద్ర్‌’ కాగా, షాబాన్‌ మాసంలోని ‘షబేబరాత్‌’ రెండవది.


షబేబరాత్‌ సమయంలో పశ్చాత్తాప భావంతో, నిర్మలమైన హృదయంతో దైవ సాన్నిధ్యంలో, భక్తితత్పరతతో గడిపి, తన పూర్వ అపరాధాలన్నిటికీ క్షమాపణ కోరితే... వాటిని అల్లాహ్‌ మన్నిస్తాడని పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. అరబ్‌ భాషలో ‘షబ్‌’ అంటే రాత్రి అనీ, ‘బరాత్‌’ అంటే ‘విముక్తి’ లేదా ‘విడుదల’ అనీ అర్థం. అంటే నరకం నుంచి, పాప కార్యాల నుంచీ విముక్తి. ఈ రాత్రి విశ్వాసులకు శుభాలను ప్రసాదించే రాత్రి. అల్లాహ్‌ తన భక్తుల కోరికలు తీర్చే రాత్రి. షబే బరాత్‌ ప్రాధాన్యం గురించి మహా ప్రవక్త అనేక హదీసుల్లో వివరించారు.


హజ్రత్‌ ఆయిషా ఒక సందర్భాన్ని వివరిస్తూ... ‘‘ఒకసారి మహా ప్రవక్త మా ఇంటికి విచ్చేశారు. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఉపక్రమించారు. కొద్దిసేపటికే మళ్ళీ లేచారు. బయటకు వెళ్ళారు. నాకు ఆందోళన మొదలయింది. నేను ఆయనను అనుసరించాను. ఆయన నేరుగా జన్నతుల్‌ బఖీలోనికి (మదీనాలోని శ్మశానవాటిక) వెళ్ళారు. మృతులైన మహిళలు, పురుషులు, మృతవీరుల కోసం ప్రార్థించారు. అది గమనించి నేను వెనుతిరిగి వచ్చాను. వేగంగా నడవడం వల్ల నాకు ఆయాసం వచ్చింది. ఆయన తిరిగి వచ్చి, అది గమనించారు. ‘‘ఆయిషా! ఎందుకలా వేగంగా శ్వాస తీసుకుంటున్నావు?’’ అని అడిగారు. నేను జరిగిన విషయాన్ని వివరించాను.


‘‘ఈ రోజు షాబాన్‌ నెల పదిహేనవ రాత్రి. ఈ రాత్రి కల్బ్‌ వంశస్తుల మందలోని (అరేబియాలో కల్బ్‌ వంశస్థుల గొర్రెల మంద చాలా పెద్దది) గొర్రెల వెంట్రుకలతో సమానమైన సంఖ్యలో మానవులకు నరకం నుంచి విముక్తి ప్రసాదిస్తాడు’’ అని చెప్పారు. ఆ తరువాత ఆయన నిలబడి నమాజ్‌ చేశారు. సజ్దాలో చాలా సమయం ఉన్నారు. మరునాడు ఉదయాన్నే ‘‘ఓ ప్రభూ! నీ కఠిన శిక్ష నుంచి నన్ను రక్షించు. నాపై నీ ఆగ్రహ జ్వాలలు సోకకుండా కాపాడు. పాప కార్యాల నుంచి నన్ను రక్షించు. నీ వెలలేని గుణగణాలను పొగిడేటంత శక్తిమంతుణ్ణి నేను కాదు! క్షమించు దేవా!’’ అనే ప్రార్థనను నాకు నేర్పారు’’ అని తెలిపారు.



మహా ప్రవక్త ప్రవచించిన సందేశాలను పరిశీలిస్తే... ‘‘ఈ రాత్రి మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకూ ఇస్తిగ్‌ఫార్‌ (క్షమాపణ) కోరే వారికి అల్లాహ్‌ శుభాలు ప్రసాదిస్తాడు. ఆ రాత్రి పవిత్రతను కాపాడడం కోసం ప్రార్థించిన వారిని అల్లాహ్‌ తప్పక కరుణిస్తాడు. ‘నువ్వు కోరుకోవాలే కాని ఇవ్వడానికి నేను సిద్ధం’ అని అహ్వానిస్తాడు. అయితే, ‘గతంలో చేసిన తప్పులను ఎన్నటికీ చెయ్యను’ అని ప్రతిజ్ఞ చేయాలి. తనకోసం, తోటి వారి కోసం, బంధువులు, స్నేహితులు, మృతులు, సజీవులు... ఇలా అందరి కోసం ప్రార్థిస్తే ఆయన తప్పక కరుణిస్తాడు.


ఇంతటి శుభప్రదమైన రాత్రిలో కూడా పుణ్యఫలాలకు నోచుకోని దురదృష్టవంతులు కొందరు ఉంటారు. వారు అల్లాహ్‌ను తప్ప ఇతరులను దైవసమానులుగా భావించేవారు, తల్లితండ్రులను కష్టపెట్టేవారు, చేతబడులూ, మంత్రతంత్రాలూ చేసేవారు. మత్తుపానీయాలు సేవించేవారు, వడ్డీ వ్యాపారం చేసేవారు, ఇతరులపై దౌర్జన్యం చేసేవారు, గర్వంతో విర్రవీగేవారు ఈ శుభాలకు నోచుకోరు. 


ఏడాదిలో కొన్ని రాత్రులను ఆరాధనల కోసం అల్లాహ్‌ ప్రత్యేకించాడు. అలాంటి పవిత్ర రాత్రులలో ముఖ్యమైనవి రమజాన్‌ మాసంలోని ‘లైలతుల్‌ ఖద్ర్‌’, షాబాన్‌ మాసంలోని ‘షబేబరాత్‌’. 


Updated Date - 2021-03-26T05:42:12+05:30 IST