ఎన్నోసార్లు చావును జయించి.. ఆదివారం 100వ బర్త్‌డే చేసుకున్న బామ్మ

ABN , First Publish Date - 2020-11-24T22:55:46+05:30 IST

‘నా చావైనా నేను పిలిస్తేనే వస్తది.. నీ చావైనా నేను పిలిస్తేనే వస్తది..’ ఓ సినిమాలో హీరో చెప్పే డైలాగ్. అవతలి వారి చావు సంగతి ఎలా ఉన్నా.....

ఎన్నోసార్లు చావును జయించి.. ఆదివారం 100వ బర్త్‌డే చేసుకున్న బామ్మ

లండన్: ‘నా చావైనా నేను పిలిస్తేనే వస్తది.. నీ చావైనా నేను పిలిస్తేనే వస్తది..’ ఓ సినిమాలో హీరో చెప్పే డైలాగ్. అవతలి వారి చావు సంగతి ఎలా ఉన్నా.. ఇంగ్లాండ్‌కు చెందిన ఓ బామ్మ మాత్రం ఎన్నోసార్లు చావును జయించి మృత్యుంజయురాలిగా పేరు తెచ్చుకుంది. అప్పటి హిట్లర్ నుంచి నేటి కరోనా మహమ్మారి వరకు ఆమెపై ప్రతి వైపు నుంచి దాడి జరిగినా ఆమె వాటిని ఎదిరిస్తూనే ఉంది. చావును ఓడిస్తూనే వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం తన 100వ పుట్టినరోజును దిగ్విజయంగా జరుపుకొంది. చావు అంచుల వరకు వెళ్లి తిరిగి రావడమంటే మాటలు కాదు. అందులోనూ ఏదో ఒకటి, రెండు సార్లంటే పర్లేదు కానీ.. చావు దగ్గరకొచ్చిన ప్రతిసారీ దానిని ఓడించడమంటే ఇక మిరాకిల్ అనే చెప్పుకోవాలి. 


బ్రిటన్‌కు చెందిన జాయ్ ఆండ్రూ అనే మహిళ ఇలాంటి ఘనతే సాధించింది. ఎన్నో సార్లు చావు అంచుల వరకు వెల్లి తిరిగి వచ్చారామె. ఒకప్పటి నాజీ నియంత హిట్లర్ ఆమెను చంపించేందుకు చూశాడు. హిట్లర్ దెబ్బనుంచి తప్పించుకున్నవారు చాలా తక్కువ. కానీ ఆండ్రూ తప్పించుకుంది. మరికొన్నేళ్లకు ఘోరమైన విమాన ప్రమాదంలో చిక్కుకుంది. ఆ ప్రమాదంలో ఎంతోమంది మరణించారు. కానీ ఆండ్రూ బతికి బయటపడింది. ఆ తరువాత రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ఆ వ్యాధినీ జయించింది. చివరిగా 99ఏళ్ల వయసులో కరోనా బారిన పడింది. 


వయసు మీద పడిన వారికి కరోనా వస్తే ఇక వారి ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. దీంతో ఆమె ప్రస్తుతం నివశిస్తున్న మెడికల్ కేర్ ఫెసిలిటీ సిబ్బంది ఆమె అంతిమ సంస్కారాలకు కూడా రెడీ చేసేశారు. చివరి చూపు కోసం ఆమె బంధువులకు కూడా కబురు చేశారు. కానీ ఆండ్రూ మాత్రం ఎప్పటిలానే చావుకు మళ్లీ టోకరా ఇచ్చింది. 


బతికి బయటకట్టి డాక్టర్లకే మతి పోగొట్టింది. ఈ క్రమంలోనే ఆదివారం 100ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆమెకు చికిత్స అందిస్తున్న మెడికల్ కేర్ సెంటర్‌ సిబ్బంది ఆమె పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏది ఏమైనా మన బామ్మ ఆండ్రూ గ్రేట్ కదా. ఇదంతా చూస్తుంటే.. చావైనా ఆండ్రూ పిలిస్తే కానీ రాదేమో అనిపిస్తోంది కదూ..!

Updated Date - 2020-11-24T22:55:46+05:30 IST